Dearness Allowance Hike : ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కరువు భత్యాన్ని (DA hike) 4 శాతం పెంచింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్(Union Cabinet) ఆమోదముద్ర వేసింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), పెన్షనర్ల డియర్నెస్ రిలీఫ్ (Dearness Relief) 50 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఇది 46% గా ఉంది.
కేంద్రం నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖాజానాపై అదనంగా రూ.12,868.72 కోట్లు భారం పడనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. చివరిసారిగా 2023 అక్టోబర్ లో డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) లను కేంద్ర కేబినెట్ 4 శాతం పెంచింది. దాంతో ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ 2023 జూలై 1 నుంచి 46 శాతానికి పెరిగింది. ఆ సమయంలో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది. జనవరి, జూలై నుండి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు DA మరియు DR లను పెంచుతారు. DA, DR లను ఎంత పెంచాలనే విషయాన్నిఆల్ ఇండియా CPI-IW డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
కేబినెట్(Union Cabinet Decisions) నిర్ణయాలను మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అంతే కాకుండా… ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ.300 సబ్సిడీ పథకాన్ని 2025, మార్చి 31 వరకు పొడిగించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది . 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.12,000 కోట్లు ఖర్చు కానుంది. సబ్సిడీని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను 2016లో తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. 2024-25 సీజన్ కింద ముడి జూట్‌కు కనీస మద్దతు ధరలను (MSP) కలిపించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కృతిమ మేధ(AI) వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఏఐ అభివృద్ధి సంపూర్ణ అనుకూల వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో AI మిషన్(India AI Mission) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. మొత్తం 10,372 కోట్లతో ఈ మిషన్ ను ప్రతిపాదించింది. ఈ రంగంలోకి ఆవిష్కరణలు చేయటం, ఇన్నోవేషన్ సెంటర్లను ప్రారంభించటం వంటివి ఉంటాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు.