PM-KISAN Amount Hike : పీఎం కిసాన్‌ నిధుల పెంపు..! కేంద్రం కీలక ప్రకటన-no proposal to hike pm kisan amount from rs 6000 per year says agriculture minister arjun munda in parliament ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm-kisan Amount Hike : పీఎం కిసాన్‌ నిధుల పెంపు..! కేంద్రం కీలక ప్రకటన

PM-KISAN Amount Hike : పీఎం కిసాన్‌ నిధుల పెంపు..! కేంద్రం కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 07, 2024 11:21 AM IST

PM-KISAN Funds Latest Updates 2024: పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఇచ్చే పంట పెట్టుబడి సాయంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్టుబడి సాయాన్ని పెంచే ఆలోచన లేదని పార్లమెంట్ లో స్పష్టం చేసింది.

పీఎం కిసాన్ నిధులు
పీఎం కిసాన్ నిధులు (https://pmkisan.gov.in/)

PM-KISAN Funds Latest Updates 2024: గత కొద్దిరోజులుగా పీఎం కిసాన్ నిధులను పెంచే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని… 8 వేల నుంచి 12 వేల వరకు పెంచవచ్చనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే వీటికి చెక్ పెడుతూ మంగళవారం పార్లమెంట్ లో స్పష్టమైన ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.

పీఎం-కిసాన్‌ మొత్తాన్ని పెంచే ఆలోచనే లేదని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రకటన చేశారు. లోక్‌సభలో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్‌ మొత్తాన్ని ఏడాదికి రూ.12 వేలకు పెంచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ పథకం కింద మహిళా రైతులకు కూడా పెంచే ప్రతిపాదన ఏదీ కూడా పరిశీలనలో లేదని ప్రకటించారు.

పంట పెట్టుబడి సాయం కోసం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(Pradhan Mantri Kisan Samman Nidhi) స్కీమ్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల సాయాన్ని అందిస్తుంది. ప్రతి విడుతలో 2వేల రూపాయలను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుంది.

11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పారు కేంద్రమంత్రి అర్జున్ ముండా. పీఎం-కిసాన్‌ అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని తెలియజేశారు. దీనిద్వారా ఏపీ నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు అందిస్తున్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకాలలో PM-KISAN ఒకటని ముండా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నిధులను చేరుతున్నాయని పేర్కొన్నారు. పథకం యొక్క కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం… పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం మరియు ధృవీకరించడం వంటి బాధ్యతలను రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తున్నాయి.

స్టేటస్ చెక్ చేసుకోండిలా..

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‍సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి.

అనంతరం హోమ్‍పేజీలోని ఫార్మర్స్ కార్నర్ (Formers Corner) సెక్షన్ కింద బెనిఫిషియరీ స్టేటస్ (Beneficiary Status) అనే ఆప్షన్‍పై క్లిక్ చేయండి.

అక్కడ మీ పీఎం-కిసాన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

అనంతరం గెట్ డేటా ఆప్షన్‍పై క్లిక్ చేయండి.

అప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మీ స్టేటస్ స్క్రీన్‍పై కనిపిస్తుంది.

దాన్ని డౌన్‍లోడ్ చేసుకొని, సేవ్ చేసుకోండి.

మీ ఖాతాలో డబ్బు క్రిడెట్ అయితే చూపిస్తుంది. ఒకవేళ డబ్బు జమ కాకపోతే కారణాన్ని కూడా తెలుపుతుంది.

కాగా, విడతకు ముందు రైతులు.. కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఈ-కేవీసీని ఈ వెబ్‍సైట్ ద్వారా లేదా సమీపంలోని సీఎస్‍సీ సెంటర్ల ద్వారా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

మీ పేరు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవచ్చు

ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‍సైట్‍లోకి వెళ్లాలి.

అనంతరం హోం పేజీలోని ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ (Formers Corner) కింద ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ (Beneficiary List) ఆప్షన్‍పై క్లిక్ చేయాలి.

అనంతరం మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను ఎంపిక చేసుకోవాలి.

ఎంపిక చేసుకున్న తర్వాక కింద గెట్ రిపోర్టుపై క్లిక్ చేస్తే.. పీఎం-కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా వస్తుంది. దాంట్లో మీ పేరు ఉందేమో చూడవచ్చు.

ఈ వెబ్‍సైట్ ద్వారానే రైతులు.. పీఎం కిసాన్ సమ్మాన్‍ నిధి పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలను ఇచ్చి అప్లికేషన్ సమర్పించవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం