DA hike: డీఏ పెంపు పై ఈ రోజే నిర్ణయం తీసుకోనున్న కేంద్ర కేబినెట్; డీఏ హైక్ ఎంత అంటే..?
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. ఈ రోజు కేబినెట్ భేటీలో డీఏ (DA hike) పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఏ, డీఆర్ లను 4% పెంచే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది.
Dearness Allowance Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (DA hike) 4 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెంపు తర్వాత డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) 50 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఇది 46% గా ఉంది. ఎల్పీజీ సబ్సిడీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అక్టోబర్, 2023 లో..
చివరిసారిగా 2023 అక్టోబర్ లో డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) లను కేంద్ర కేబినెట్ 4 శాతం పెంచింది. దాంతో ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ 2023 జూలై 1 నుంచి 46 శాతానికి పెరిగింది. ఆ సమయంలో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది. 7వ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా ఈ పెంపు జరిగింది.
ఇప్పుడు మరో 4% పెంపు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఈ రోజు, మార్చి 7, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA hike) పెంపును ఆమోదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ 4 శాతం డీఏ పెంపు తర్వాత, డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ 50 శాతానికి పెరుగుతుంది. జనవరి, జూలై నుండి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు DA మరియు DR లను పెంచుతారు. DA, DR లను ఎంత పెంచాలనే విషయాన్నిఆల్ ఇండియా CPI-IW డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం పారిశ్రామిక కార్మికుల (CPI-IW) వినియోగదారుల ధరల సూచీ 12 నెలల సగటు 392.83 గా ఉంది. దీని ప్రకారం మూలవేతనంలో 50.26 శాతం డీఏ రావాల్సి ఉంటుంది.
ఉజ్వల యోజన
గత ఏడాది అక్టోబర్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్పీజీ సబ్సిడీని కేంద్రం సిలిండర్ కు రూ.300కు పెంచింది. వచ్చే మూడేళ్లలో అదనంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని, రూ.1,650 కోట్ల ఆర్థిక భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.