Industrial Hubs :ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్- పోలవరం నిధులు, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లకు గ్రీన్ సిగ్నల్
Kopparthy Orvakal Industrial Hubs : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్యాజెక్టులకు రూ.4923 కోట్లు కేంద్రం కేటాయించనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
Kopparthy Orvakal Industrial Hubs : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,596 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,137 కోట్లు కేటాయించనున్నారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీకి రూ.8,860 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, సుమారు 54 వేల మందికి ఉపాధి లభించనుందని కేంద్రం తెలిపింది. 2,621 ఎకరాల్లో రానున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,786 కోట్ల వ్యయం చేయనున్నట్లు పేర్కొంది. ఇక్కడ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, సుమారు 45 వేల మందికి ఉపాధి దొరకనుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
పోలవరం మొదటి దశ ప్యాకేజీ నిధులు
సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలు ఫలిస్తున్నాయి. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. పోలవరం ప్రాజెక్టు నిధులపై దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా సీఎం చంద్రబాబు చర్చించారు. మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను సీఎం కోరారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా నవంబర్ నుంచి పోలవరం పనులను వేగం పెంచేందుకు మొదటి దశ ప్యాకేజీ నిధులు కీలకం కానున్నాయి.
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది - రామ్మోహన్ నాయుడు
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. హైదరాబాద్-బెంగళూరు, విశాఖ-చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తామన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. కొప్పర్తి.. విశాఖ-చెన్నై కారిడార్ కిందకు వస్తుందన్నారు. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని తెలిపారు. గత ఐదేళ్లుగా వైసీపీ హయాంలో ఏపీ వెనుకబడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా నిధులు వస్తాయన్నారు. అమరావతి, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
కొప్పర్తి, ఓర్వకల్లు హబ్ లతో రాయలసీమకు పారిశ్రామిక శోభ రానుందని టీడీపీ అభిప్రాయపడింది. కడప జిల్లాలో కొప్పర్తి, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ప్రాంతాలలో భారీ పారిశ్రామిక హబ్ లు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపింది. జగన్ సాధించలేనిది చంద్రబాబు సాధించారని సీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.
సంబంధిత కథనం