CM Chandrababu : ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-cm chandrababu key comments on couple of mlas behaviour in cabinet meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu : ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2024 05:07 PM IST

CM Chandrababu : ఏపీలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చిక్కులు తెస్తున్నారు. తాజాగా కేబినెట్ లో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లు తెచ్చుకున్న మంచి పేరు దెబ్బతింటోందన్నారు. మంత్రులు.. ఎమ్మెల్యేలను గైడ్ చేయాలని సీఎం సూచించారు.

ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu : ఏపీ కేబినెట్‍ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లూ నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందన్నారు. పేపర్ల నిండా కొద్ది మంది చేస్తున్న పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు రాస్తున్నారన్నారు. దీనివల్ల అందరికీ చెడ్డపేరు వస్తోందని అభిప్రాయపడ్డారు. మంత్రులు ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. మంత్రులు వారి పార్లమెంట్ పరిధిలో, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నేతలను గైడ్ చేయాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు అన్నారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్త వివాదం

గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావుపై బెదిరింపు ఆరోపణలు వస్తున్నాయి. రైతును బెదిరించారని, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బాధిత రైతు జిల్లా కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు అనే రైతు గుంటూరు విద్యానగర్‌లో నివశిస్తున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో గళ్లా రామచంద్రరావుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌కు రైతు వెంకటరావు 4.90 ఎకరాల భూమి విక్రయించాడు. దీనికి గతేడాది ఏప్రిల్‌ లో అగ్రిమెంట్ రాసుకుని, వెంకటరావుకు మూడు చెక్కులు ఇచ్చారు రామచంద్రరావు. అయితే ఈ చెక్కులు బౌన్స్ అయ్యాయి.

అలాగే తన మిగిలిన భూమిలో కూడా రామచంద్రరావు రియల్ ఎస్టేట్ వారు మట్టి తోలుతున్నారని తెలిసి అడిగేందుకు వెళ్తే కాళ్లు విరగ్గొడతానని బెదిరించారని వెంకటరావు వాపోయారు. దీంతో రైతు వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించారు. అయితే తాము అగ్రిమెంట్‌ చేసుకున్న 4.90 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రయత్నిస్తే అడంగల్‌లో 3.90 ఎకరాలు మాత్రమే చూపిస్తుందని, అంత వరకు రిజిస్టర్‌ చేయించుకుని, దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించామని రామచంద్రరావు అంటున్నారు.

అస్మిత్ రెడ్డి వర్సెస్ సీఐ

టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి...తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం కలకలం రేపింది. అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన దురుసుగా మాట్లాడారని అస్మిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. అనంతరం సీఐ .. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారం సంచలనం అయ్యింది. ఈ ఉదంతంలో తన తప్పు లేదని, శాంతి భద్రతలను కాపాడాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పానని సీఐ తెలిపారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో తాను దురుసుగా ప్రవర్తించలేదన్నారు.

ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై సీఐ కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలతో మంగళవారం పోలీస్ స్టేషన్‌ ఎదుట తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ధర్నా చేశారు. ఎమ్మెల్యే మద్దతుదారులు సీఐ ఇంటిపై దాడికి యత్నించి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో సీఐ వీడియో కాల్ చేసి ఎమ్మెల్యేకు సారీ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. అయితే ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌, కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిశారు. తాడిపత్రిలో జరుగుతున్న ఘటనలపై చర్చించారు. ప్రభుత్వం మారిన కొంతమంది పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆరోపించారు. ఒకరిద్దరి పోలీసుల వల్ల పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందన్నారు.

సంబంధిత కథనం