Kadapa Mayor vs Mla: మేయర్ ఇంటి ముందు చెత్త పోసిన టీడీపీ నేతలు, చెత్తపన్నుపై టీడీపీ, వైసీపీ మధ్య రగడ
Kadapa Mayor: కడపలో చెత్త సేకరణ అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మునిసిపల్ సిబ్బంది చెత్త సేకరణ చేయడం లేదని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు మేయర్ నివాసాన్ని ముట్టడించి తమ ఇళ్లలోని చెత్తను మేయర్ ఇంటి ముందు పారబోశారు. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వ్యతిరేకంగా మేయర్ సురేష్‌బాబు వర్గం ఆందోళనకు దిగింది.
Kadapa Mayor VS Mla: కడపలో వైసీపీ మేయర్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే వివాదం ముదిరి పాకాన పడింది. కడప మునిసిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ అధికార పక్షంగా ఉంది. కడప అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలుపొందారు. దీంతో మునిసిపల్ పీఠంపై పట్టు కోసం వైసీపీ, టీడీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో కొద్ది రోజులుగా కడప మునిసిపాలిటీలో చెత్త సేకరణలో జాప్యం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి పార్టీలు ప్రకటించాయి. అప్పటి వరకు చెత్త పన్ను చెల్లించవద్దని పిలుపునివ్వడంతో పన్నులు చెల్లించడం తగ్గిపోయింది. 20రోజులుగా మునిసిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలు నిలిచిపోయాయి .పలు ప్రాంతాల్లో వారానికి ఓ సారి మాత్రమే చెత్తను సేకరిస్తున్నారు.
మేయర్ ఆదేశాలతోనే చెత్త సేకరణ నిలిపివేశారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. చెత్త పన్ను సేకరణ తగ్గిపోవడంతోనే ఇంటింటి చెత్త సేకరణ నిలిచిపోయినట్టు మేయర్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో చెత్త సేకరించకపోతే మేయర్, వైసీపీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు చెత్త పారబోయాలని ఎమ్మెల్యే రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ పన్నును రద్దు చేయలేదని,అందు వల్లే చెత్త పన్నును వసూలు చేస్తున్నట్టు మేయర్ సురేష్ కౌంటర్ ఇచ్చారు. చెత్త పన్ను రద్దు చేస్తే జీవో చూపాలని సవాలు చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే మంగళవారం టీడీపీ కార్యకర్తలు కడప మేయర్ ఇంటి ముందు చెత్త పారబోసి నిరసనకు దిగారు.
చెత్త పన్ను కట్టకపోతే చెత్త ఏరివేత కుదరదన్న మేయర్ సురేశ్ బాబు మాటలకు నిరసనగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి సూచనతోనే చెత్త పారబోసినట్టు ప్రకటించారు. ఆ సమయంలో ఇంట్లో లేని మేయర్ సురేష్ బాబు సమాచారం అందుకుని ఇంటి వద్ద చెత్త పారబోయడం చూసి విస్తుబోయాడు. అనంతరం కడప చిన్న చౌక్ పిఎస్ ఎదుట మేయర్ సురేష్ ఆందోళనకు దిగారు. వైసీపీ కార్పోరేటర్లతో కలిసి తన ఇంటి ఎదుట చెత్త పారబోసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడప నగర పాలక సంస్థలో వైసీపీ అధికారంలో ఉంది. ఇంటింటి చెత్త సేకరణలో జాప్యం చేస్తుండటంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 20రోజులుగా కడప నగరంలో వారానికి ఓసారి చెత్త సేకరణ చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికే మేయర్ సురేష్ చెత్త సేకరణ అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎవరి ఇంట్లో చెత్త ఉంటే మేయర్, కార్పొరేటర్ల ఇళ్ల ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే సూచించడంతో మేయర్ ఇంటి ముందు పారబోశారు. మంగళవారం ఉదయం చిన చౌక్ నుంచి కడప మేయర్ నివాసం ఉన్న ప్రాంతానికి ర్యాలీగా వెళ్లి మేయర్ ఇంటి ముందు చెత్తను పారబోశారు. దీంతో పోలీసులు ఆందోళన కారుల్ని అక్కడ నుంచి పంపేశారు.
టీడీపీ శ్రేణులు చేసిన చర్యతో కడప చిన్న చౌక్ పిఎస్ వరకు ర్యాలీగా వచ్చి బైఠాయించారు. తమ ఇంటి ముందు చెత్త వేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కడప ద్వారకానగర్‌లో ఉన్న ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటికి బయల్దేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని నిర్బంధించారు. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లో వారిని ఉంచారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ నివాసాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.
సంబంధిత కథనం