Vijayawada : ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన తల్లిదండ్రులు.. కాలువలో దూకిన యువతి!
Vijayawada : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని యువతి ప్రేమించింది. ఆ వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో యువతి కాలువలో దూకేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఒక సారి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్‌స్టేషన్ పరిధి చిట్టినగర్‌లో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టి నగర్‌కు చెందిన ఓ యువతి (19) ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువకుడితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుకునే వారు. చాటింగ్ చేసేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడిన పెళ్లి చేసుకుంటానని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపనకు చెందిన యువతి ఈనెల 24న కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
చికిత్స తరువాత కోలుకోవడంతో ఇంటికి తీసుకువచ్చారు. అయినప్పటికీ ప్రేమికుడి కోసం పరితపించింది. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈనెల 25న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతికారు. కాకినాడ జిల్లా తునిలో ఉన్నట్లు గుర్తించి, ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకొచ్చిన మరుసటి రోజు 26 తేదీన రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత మళ్లీ ఇంటి నంచి వెళ్లి పోయింది.
తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులందరూ మళ్లీ వెతికారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వెతికారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో యువతి తండ్రికి పాండు అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీ కుమార్తె పాత పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని పై వంతెన నుంచి రైవస్ కాలువలోకి దూకేసినట్లు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లి కాలువలో వెతికినా కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)