Period Blood Clots: పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డలు బయటికి వస్తున్నాయా? కారణాలు ఇవే! ఈ జాగ్రత్తలు తీసుకోండి
Period Blood Clots: పీరియడ్స్ సమయంలో కొందరికి రక్తం గడ్డలు ఎక్కువగా బయటికి వస్తుంటాయి. దీంతో ఆందోళన చెందుతుంటారు. ఇలా రక్తం గడ్డలు బయటికి వచ్చేందుకు ప్రధాన కారణాలు ఏవో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇక్కడ చూడండి.
మహిళలకు నెలసరి (పీరియడ్స్) సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రక్తస్రావం సమస్యగా ఉంటుంది. నొప్పి, నీరసం సహా మరిన్ని సమస్యలు ఇబ్బందిగా ఉంటాయి. అయితే, కొందరికి పీరియడ్స్ సమయంలో రక్తంతో పాటు గడ్డలు (Blood Clots) కూడా బయటికి వస్తుంటాయి. దీంతో ఆందోళన చెందుతుంటారు. అలా బయటికి రక్తం గడ్డలు బయటికి వచ్చేందుకు కారణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డలకు కారణాలు
పీరియడ్స్ సమయంలో కొందరికి రక్తం గడ్డలు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. నెలసరి సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంటుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే.. నెలసరి సమయంలో రక్తస్రావంలో గడ్డలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, రక్తం గడ్డలు బయటికి వచ్చేందుకు మరిన్ని అంశాలు కూడా కారణం అవుతాయి. విటమిన్ బీ-12 లోపం, థైరాయిడ్, అండాశయాల్లో తిత్తులు, రక్తహీనత, ఫెబ్రాయిడ్లు, హర్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్ కూడా కారణాలు కావొచ్చు.
ఈ జాగ్రత్తలు పాటించాలి
పీరియడ్స్ సమయంలో రక్తంలో గడ్డలు సాధారణమే. అయితే, ఇవీ మరీ ఎక్కువైతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఇవి తక్కువగా వాడాలి: ప్లాస్టిక్ బాటిల్స్, కంటైనర్లు తక్కువగా వాడాలి. ప్లాస్టిక్‍లోని కెమికల్స్ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఎక్కువ కావొచ్చు. కొన్ని బ్యూటీ ప్రొడక్టుల్లోని రసాయనాల వల్ల కూడా హార్మోన్లపై ప్రభావం పడుతుంది. అందుకే రక్త స్రావం ఎక్కువగా ఉంటే కాస్మోటిక్స్ వాడకం తగ్గించాలి.
పోషకాహారం: పీరియడ్స్ సమయంలో విటమిన్ ఏ,బీ,సీ,డీ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే తీవ్రమైన రక్తస్రావం, గడ్డల నుంచి ఉపశమనం ఉంటుంది. రక్తం గడ్డలు కట్టకుండా విటమిన్ ఏ తోడ్పడుతుంది. విటమిన్ బీ6 కూడా ఇందుకు సహకరిస్తుంది. హార్మోన్ లెవెల్స్ సమతుల్యంగా ఉండేలా విటమిన్ డీ చేయగలదు. సున్నింగా ఉండే కణాలను బలంగా చేయడంలో విటమిన్ సీ సహకరిస్తుంది.
కోల్డ్ కంప్రెస్: మీ పొత్తి కడుపు కింద భాగంలో చల్లటి నీరు నింపిన ప్యాక్‍తో ఒత్తుకోవాలి. సుమారు రెండు నిమిషాల పాటు కోల్డ్ ప్యాక్ అలాగే పెట్టుకోవాలి. పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డలు వచ్చినప్పుడు ఇలా చేయాలి.
మానసిక ఒత్తిడి వల్ల: పీరియడ్స్ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా రక్తం గడ్డలకు కారణం అవుతుంది. అందుకే ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. ధ్యానం లాంటివి చేయాలి.
పుదీన టీ: పీరియడ్స్ సమయంలో పుదీన టీ తాగాలి. ఇది శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉండడంలో సహకరిస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిని కూడా తగ్గించగలదు. రెడ్ రాస్ప్ బెర్రీ టీ కూడా ఇందుకు ఉపయోగపడుతుంది.
నిపుణులను సంప్రదించాలి: ఒకవేళ రక్తంలో గడ్డలు మరీ ఎక్కువగా వస్తుంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి. వారి సూచనలు పాటించాలి.