AP Cabinet : అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ, స్థానిక సంస్థల ఇద్దరు పిల్లల నిబంధన రద్దు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-amaravati ap cabinet meeting decision on excise policy local bodies two child rule key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet : అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ, స్థానిక సంస్థల ఇద్దరు పిల్లల నిబంధన రద్దు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet : అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ, స్థానిక సంస్థల ఇద్దరు పిల్లల నిబంధన రద్దు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 07, 2024 04:44 PM IST

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించింది. గత ప్రభుత్వాల ఎక్సైజ్ పాలసీలపై చర్చ జరిగింది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఏపీ కేబినెట్ నిర్ణయాలు

AP Cabinet Decisions : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తెచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఈ నిబంధనను తొలగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అలాగే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ శాఖలో అవతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేబినెట్ చర్చ జరిగింది. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై కేబినెట్ చర్చించింది. భూముల సర్వే రాళ్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వీటి స్థానంలో రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అందించనున్నారు.

అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ

అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన జీవో నెంబర్‌ 217, 144 జీవోలు రద్దు చేసింది. రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి, స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించాలని, అందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర ముద్రించాలని కేబినెట్ నిర్ణయించింది.

వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని కేబినెట్ అభిప్రాయపడింది. గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించిందని విమర్శలు వస్తున్నాయని మంత్రులు అన్నారు. దీంతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తొలగించి, కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు చేయాలని కేబినెట్ సూచించింది.

మంత్రిమండ‌లి నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

1.సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ - 1992, సెక్షన్ 3 ప్రకారం (ఎ) క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్.డి.ఎఫ్) సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2.ప‌శు సంవ‌ర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మ‌త్స్య శాఖ‌: పశు సంవర్థక‌ శాఖ 2021లో జారీ చేసిన నంబర్ 217, మత్స్యశాఖకు సంబంధించి జీఓఆర్టీ 144 రద్దు ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గత 3 దశాబ్దాలుగా మత్స్యకార సంపద, సంక్షేమం కోసం నామ మాత్రపు లీజుతో ప్రభుత్వ చెరువులను మత్స్యకార సహకార సంఘాలకు ఇచ్చారు. కానీ మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించేలా జీవో నెంబర్ లు 144, 217 లను గత ప్రభుత్వం జారీ చేసింది. అందులో భాగంగా ఫైలట్ ప్రాజెక్ట్ క్రింద ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 25,380 హెక్టార్ల నీటి విస్తీర్ణంతో ఎంపిక చేసిన 27 ప్రభుత్వ చెరువులను 6592 మత్స్యకార కుటుంబాలకు చెందిన 27 మత్స్యకార సహకార సంఘాలకు కేటాయించకుండా పబ్లిక్ ఆక్షన్ వేసింది.

ఇచ్చిన జీవోలను నిలుపుదల చేయాలని కోరుతూ ఇప్పటికే అనేక మంది మత్స్యకారులు, సంఘాలు 11 కోర్టు కేసులు వేసి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఇచ్చిన జీవోలు అమలుకు సాధ్యం కాలేదు. అదే విధంగా సదరు జీవోలకు అనుగుణంగా “ఇన్ లాండ్ ఫిషర్ మేన్ కో ఆపరేటివ్ సొసైటీ”లను ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత లేదు. మత్స్యకార సంఘాలకు చెరువులు కేటాయించని కారణంగా జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. మధ్య మార్గంగా అక్రమార్కులు లబ్ధి పొందుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు చేప పిల్లల పెంపకం నుంచి మార్కెటింగ్ వరకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కేబినెట్, ముఖ్యమంత్రి సూచించారు. దీంతో 27 మత్స్యకార సంఘాలకు మేలు కలించాలని, పైన పేర్కొన్న 11 కేసులను పరిష్కరించాలనే సదుద్దేశంతో సంబంధిత జీవోలను రద్దు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది.

3.పురపాలక పరిపాలన, ప‌ట్టణాభివ‌ృద్ధి శాఖ : ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు మున్సిప‌ల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేయడం, సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిప‌ల్ కార్పొరేషన్ చట్టం - 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ చట్టం 1965 లో చేసిన చట్ట సవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తగ్గుతున్న పునరుత్పత్తి రేటును పరిగణలోకి తీసుకుని, మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాలను, జనాభా స్థిరీకరణ, జనాభా సమతౌల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు వర్తించనందున ఆ చట్టసవరణల ర‌ద్దుకు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది.

జాతీయ పునరుత్పత్తి రేటు 2.1 గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం 1.5 గా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల పునరుత్పత్తి వయసు సగటున 32.5 కాగా 2047 నాటికి 40 ఏళ్లుకానుంది. అదే విధంగా మహిళల్లో ప్రస్తుత పునరుత్పత్తి వయస్సు సగటున 29 సంవత్సరాలు కాగా అది 2047 నాటికి 38 సంవత్సరాలు కానుంది. ఆర్థికభివృద్ధికి దోహదపడే పనిచేసే వ్యక్తుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. అదే విధంగా ప్రస్తుతం ఏపీలో 60 ఏళ్లకు పై బడిన వ్యక్తుల సంఖ్య 11 శాతం కాగా ఇది 2047 నాటికి 19 శాతం కానుంది. ఇదే వయస్సు జాతీయ స్థాయిలో ప్రస్తుతం 10 శాతంగా ఉండగా, 2047 నాటికి 15 శాతం కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అర్బన్ లోకల్ బాడీస్ లో అనర్హులుగా ప్రకటిస్తూ 1955, 1965, 1994 లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాలకు సవరణల ద్వారా కుటుంబ నియంత్రణ ప్రోత్సహించేలా జత చేసిన నిబంధనలను రద్దు చేసే ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

4.పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివ‌ృద్ధి శాఖ‌: ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడం, సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం - 1994 లోని సెక్షన్ 19 కు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

5.హెల్త్ అండ్ మెడిక‌ల్ & ఫ్యామిలీ వెల్ఫేర్: ఫేజ్-1 క్రింద నేష‌న‌ల్ మెడికల్ క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూత‌న వైద్య క‌ళాశాల‌ల‌కు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టాల‌న్న ప్రతిపాద‌న‌కు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ఫేజ్-2 క్రింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మ‌రియు మదనపల్లె ల‌లో నిర్మించిన నూత‌న వైద్య క‌ళాశాల‌లో 2024 - 25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమ‌తి కోరుతూ చేసిన ప్రతిపాద‌న‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు.

6.వాట‌ర్ రిసోర్సెస్: జీవో నెంబ‌ర్. 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2023లో జారీ చేసిన జీవో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట (శ్రీశైలం ప్రాజెక్టు) గ్రామ పంచాయతీకి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ నీటిపారుదల శాఖకు బదిలాయించే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు బదిలీ చేసిన 208.74 ఎకరాల భూమిలో చేప‌ట్టిన‌ నిర్మాణాలను భవిష్యత్ అవసరాల దృష్ట్యా యథాతథంగా ఉంచాలని చేసిన‌ ప్రతిపాదనను మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుపతి అధ్యాత్మిక క్షేత్రం తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా టెంపుల్ టూరిజం, రెవెన్యూ ఉన్న దేవాలయం శ్రీశైలం అని, ఈ శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా అత్యధిక భక్తులు, పర్యాటకులు సున్నిపెంట , శ్రీశైలం ప్రాజెక్టుకు, దేవాలయానికి వస్తున్న తరుణంలో ఆదాయం పెంచేందుకు, పర్యాటకాభివృద్ధికి ఈ స్థలాన్ని భవిష్యత్ లో బదలాయించాలని సూచించారు.

7.రెవెన్యూ(ఎక్సైజ్) : 2014-19, 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు, "వే ఫార్వర్డ్" మదింపు కోసం మంత్రి మండలిలో చ‌ర్చించారు. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్‌వర్క్ లోపభూయిష్టంగా, పారదర్శకంగా లేకుండా ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. పర్యవేక్షణలో అంతరాలు, విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు, ఆదాయ నష్టాల పెరుగుదలకు దారితీశాయి.. రానున్న నెల‌న్నర రోజుల్లో ఎక్సైజ్ శాఖ‌ను మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణకై ఏకీక‌ృత ప‌రిపాల‌న విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ‌ను పున‌ర్నిర్మించేందుకు ప్రతిపాదించింది.

మ‌ద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధ‌ర‌ల నిర్ధార‌ణ విధానాల‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్న విధానాల‌ను అధ్యయ‌నం చేసేందుకు అధికారుల బృందం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప‌ర్యటిస్తుందని కేబినెట్ తెలిపింది. సెప్టెంబర్ 5, 2024 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 1, 2024 నుంచి కొత్త మ‌ద్యం విధానం అమలు చేయాలన నిర్ణయించింది.

8.రెవెన్యూ (ల్యాండ్స్): రూ.22.95 కోట్ల వ్యయంతో జారీచేసిన 21.86 లక్షల భూహక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించి ఫిర్యాదుల సంఖ్యలు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలని సీఎం కేబినెట్ కు సూచించారు. రాబోయే మూడు నెలల కాలంలో, గ్రామ సభలు అయ్యేంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు నిర్వహించవద్దని సించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులను, పాస్ బుక్ లను తయారు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, ల్యాండ్ గ్రాబింగ్ వంటివి జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించి భుూముల బదిలీలో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలు గుర్తించి వాటికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కేబినెట్ కోరింది. పేదవాళ్ల భూ హక్కులను కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ ని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయ్యే వరకు రిజిస్ట్రేషన్ ఆపాలని నిర్ణయించారు.

సంబంధిత కథనం