Prakasam Barrage Boats: కృష్ణా వరదల్లో కొట్టుకువచ్చిన ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డంగా చిక్కుకుపోయిన బోట్ల తొలగింపు ప్రారంభమైంది. దాదాపు ఎనిమిది రోజుల తర్వాత మొదటి బోటును బయటకు తీయగలిగారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల తొలగింపు కోసం సెప్టెోంబర్ 1వ తేదీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. క్రేన్ల ద్వారా వెలికి తీసే ప్రయత్నాలు విఫలం కావడంతో పుల్లీలతో బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
మరోవైపు బ్యారేజీ గేట్లకు బోట్లు అడ్డు పడటంతో ఆ ప్రాంతంలో ఇసుక మేటలు వేశాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువున ఉన్న క్రాస్ బండ్ పడవల్ని బయటకు తీయడానికి అడ్డుగా నిలిచింది. డ్రెడ్డింగ్ పడవల్లో ఇసుక నీరు చేరడంతో దాని బరువు వంద టన్నులకు చేరింది.
దీంతో బెకమ్ ఇంజనీరింగ్ కంపెనీ భారీ పడవల సాయంతో మునిగిపోయిన పడవను వెలికితీసే ప్రయత్నాలు చేసింది. ఇసుక తవ్వకాలకు వినియోగించే రెండు భారీ పడలకు అడ్డుగా ఇనుపదూలాలను ఏర్పాటు చేసి దాని సాయంతో మునిగిన పడవను నీటి నుంచి పైకి లేపారు.
తగ పది రోజులుగా ఇంజనీరింగ్ నిపుణులు, అండర్ వాటర్ డైవర్లు, మత్స్యకారులు చేసిన ప్రయత్నాలు ఫలించి మంగళవారం రాత్రి బోటును బయటకు తీయగలిగారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లకు వెనుకన ఇరుక్కుపోయిన మూడు బోట్లలో ఒక బోటును బయటకు లాక్కొచ్చారు. ఈ నెల 7న ప్రారంభమైన బోట్ల ఆపరేషన్ మంగళవారం రాత్రి ఫలితాన్నిచ్చింది. భారీ క్రేన్లు ఉపయోగించినా కదలని బోటును కావడి విధానంలో రెండు బోట్ల సాయంతో బయటకు తీశారు.
బ్యారేజీ గేట్లకు అడ్డంగా ఒకదానిపైఒకటిగా మూడు నాలుగు బోట్లు బోల్తా పడ్డాయి. ఆక్సి ఆర్క్ కట్టర్ ద్వారా రెండు ముక్కలు చేసి క్రేన్ల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత కాకినాడ నుంచి అబ్బులు టీంను రంగంలోకి దింపారు. బెకమ్ కంపెనీ, వైజాగ్‌కు చెందిన సీ లయన్ సంస్థ, అబ్బులు టీం కలిసి సంయుక్తంగా శ్రమించి బోల్తా పడిన బోటును మొదట ఒక దిశలోకి తీసుకొచ్చాయి.
మంగళవారం ఉదయం నుంచి రెండు బోట్లకు ఏర్పాటు చేసిన గడ్డర్ల సాయంతో మునిగిన పడవను నీటి పైకి తెచ్చేందుకు శ్రమించారు. ఇందుకోసం బోట్లను నీటితో నింపి మునిగిన బోటు లెవల్‌కు చేర్చారు. మునిగిపోయిన బోటును రెండు పడవల మధ్య కట్టేసిన అందులో ఉన్న నీటిని బయటకు తోడేశారు. దీంతో మునిగిన పడవ పైకి లేచింది
ఆ తర్వాత మూడు బోట్లను మెల్లగా ఒడ్డుకు కదిలించారు. ఇనుప గడ్డర్లతో ఉన్న రెండు బోట్లనుమరో రెండు బోట్లకు కలిపి ఒడ్డుకు లాక్కొచ్చారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2 భారీ పడవలతో పాటు, ఒక మోస్తరు బోటు అడ్డుపడి చిక్కుకుని ఉన్నాయి. బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను బెకెం సంస్థ ఇంజినీర్లు కొనసాగిస్తామని ప్రకటించారుర.
ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద గేట్లను పైకి లేపేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు వెళ్లింది, మరో 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ గేట్లవద్దే చిక్కుకుపోయాయి. వీటిని తొలగించేందుకు పదిరోజులకు పైగా శ్రమిస్తున్నారు. బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడంతో కుట్ర కోణం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది.