టెట్ వివరాల సవరణ కోసం తెలంగాణ విద్యాశాఖ ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుందని పేర్కొంది. అయితే గడువు పూర్తి అయినప్పటికీ వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోనే ఉంచారు అధికారులు. చాలా మంది అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ ఆప్షన్ ను కొనసాగిస్తున్నారు.
ఎడిట్ ఆప్షన్ తో కొత్త మార్కులు ఆప్‌లోడ్ చేసినా ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ఇదే కాకుండా.. సబ్జెక్టులు, హాల్ టికెట్ల నెంబర్ల విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా… సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే వీటిని పరిష్కరించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
అభ్యర్థుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యాశాఖ వెబ్ సైట్ లో టెక్నికల్ సపోర్ట్ కోసం ప్రత్యేక నెంబర్లను ఉంచింది. టెట్ వివరాల ఎడిట్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయా అభ్యర్థులు 91-9154114982/+91-6309998812 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా helpdesktsdsc2024@gmail.com మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపింది.
సెప్టెంబర్ 12వ తేదీన సాయంత్రం తర్వాత ఈ ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి వచ్చింది. దీంతో టెట్ పరీక్ష మార్కులు, హాల్‌టికెట్, ఇతర పలు వివరాల నమోదులో దొర్లిన తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
టెట్ ఫలితాల్లో పేపర్-1లో 57,725 మంది, పేపర్-2లో 51,443 మంది క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత డీఎస్సీ పరీక్షలను నిర్వహించారు. ఆ తర్వాత ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని విశ్లేషించిన తర్వాత… ఇటీవలే ఫైనల్ కీలను ప్రకటించారు.
ఫైనల్ కీలను ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే డీఎస్సీ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే చాలా మంది అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లారు. వాటిని సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంకు లిస్ట్(జీఆర్‌ఎల్) ఇస్తే సమస్యలు ఎదురవుతాయని విద్యాశాఖ భావించింది. ఈ క్రమంలోనే టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులను కలిపి డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో టెట్ వివరాల ఎడిట్ కు పాఠశాఖ విద్యాశాఖ అవకాశం కల్పించింది.
ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.