Warangal 1000 Pillar Temple : సిద్ధమైన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం - 17 ఏళ్ల తర్వాత అందుబాటులోకి…
1000 Pillar Temple Kalyana Mandapam : 17 ఏళ్ల తర్వాత వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది.
1000 Pillar Temple Kalyana Mandapam: కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి(Warangal 1000 Pillar Temple). డెవలప్ మెంట్ పేరుతో 2006లో ఆలయంలోని కల్యాణ మండపాన్ని తొలగించి, పునరుద్ధరించే పనులు చేపట్టారు. కానీ ప్రభుత్వాలు మారినా అనుకున్న టైంలో వర్క్స్ కంప్లీట్ కాలేదు. దాదాపు 17 ఏళ్ల పాటు పనులు కొనసాగగా.. చివరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎట్టకేలకు ఓపెనింగ్ కు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వేయి స్తంభాల గుడిలో పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగానే పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వెయ్యేళ్లు చెక్కుచెదరలే
ఓరుగల్లు(Warangal History) నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో ఒకటో రుద్రుడు కీ.శ.1163లో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1,400 మీటర్ల వైశాల్యంలో, శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించారు. శిలలపై సప్తస్వరాలు లిఖించడంతో పాటు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయపాడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం వెయ్యి స్తంభాలతో వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు. ఇదిలాఉంటే వరంగల్ నేపథ్యంలో వేయి స్తంభాల గుడిని(Thousand Pillar Temple) చూపిస్తూ వర్షం సినిమాను తెరకెక్కించగా.. అది కాస్త సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత వర్షం డబ్బింగ్ వర్షన్స్ తో పాటు 20కి పైగా వేయి స్తంభాల గుడి, అందులో ఉన్న కల్యాణ మండపాన్ని చూపిస్తూ షూటింగ్ చేసుకుని సక్సెస్ అయ్యాయి. దీంతో వేయి స్తంభాల గుడికి సినిమా యూనిట్స్ తో పాటూ టూరిస్ట్ ల రాక కూడా ఎక్కువైంది. ఇదిలాఉంటే పర్యాటకుల తాకిడికి అనుగుణంగా ఆలయాన్ని పునరుద్ధరించే పేరున 2006లో కల్యాణ మండల స్తంభాలను తొలగించారు. వాటిని రీడెవలప్ చేసి మళ్లీ కల్యాణ మండపాన్ని రూపొందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పెషల్ ఫోకస్
వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలగించిన పురావస్తు శాఖ అధికారులు 2006 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల వరకు వాటిని హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో పెట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి, దశాబ్ధంన్నరకు పైగా కాలయాపన చేశారు. కల్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు.. పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తుశాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు పునరుద్ధరణ పనులకు కేటాయించడంతో ఆయన పనులను మొదలు పెట్టారు. కానీ నిధులు సరిగా విడుదల కాకపోవడంతో ఆయన పనులు మధ్యలోనే ఆపేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాతైనా వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పనులకు మోక్షం కలుగుతుందని అంతా భావించారు. కానీ అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, స్థానిక లీడర్లు వినయ్ భాస్కర్, ఇతర నాయకులు గత ప్రభుత్వాలు విమర్శించడం తప్ప వేయి స్తంభాల గుడి పనులపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు దాటినా వేయి స్తంభాల గుడి పనులు పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే రెండేళ్ల కిందట ములుగు జిల్లా రామప్ప టెంపుల్(Ramappa Temple ) యునెస్కో గుర్తింపు పొందిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కల్యాణ మండపం పనులపై ఆరా తీశారు. 2022 ఏప్రిల్ 26న కేంద్ర ప్రభుత్వ టూరిజం, ఇతర శాఖల అధికారులతో కలిసి వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు. కల్యాణ మండపం తిరిగి నిర్మించే బాధ్యత తనదేనని మాటిచ్చి, దాని ప్రకారం గతంలో ఖర్చయిన నిధులతో సంబంధం లేకుండా మరో రూ.15 కోట్లు మంజూరు చేశారు. ఆ తరువాత స్థపతి శివకుమార్ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు పనులు మళ్లీ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు నిరంతరం శ్రమించి, కల్యాణ మండపానికి రూపం తీసుకువచ్చారు. ఈ మేరకు నాలుగైదు రోజుల కిందటే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా ఓపెనింగ్
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(Union Kishan Reddy) చేతులమీదుగా శుక్రవారం ఉదయం వేయి స్తంభాల గుడి కల్యాణ మండపాన్ని పున: ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రమే ఆయన వరంగల్ నగరానికి రానున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు వరంగల్ కోటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన శుక్రవారం ఉదయం కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శుక్రవారం ఉదయం 10 గంటలకు ములుగు జిల్లాలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ వద్ద సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.