వరంగల్లులో సైనిక్ స్కూల్ ఆశలు గల్లంతేనా..? కంటోన్మెంట్‌కు తరలనుందా?-will warangal sainik school find new battlegrounds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  వరంగల్లులో సైనిక్ స్కూల్ ఆశలు గల్లంతేనా..? కంటోన్మెంట్‌కు తరలనుందా?

వరంగల్లులో సైనిక్ స్కూల్ ఆశలు గల్లంతేనా..? కంటోన్మెంట్‌కు తరలనుందా?

HT Telugu Desk HT Telugu
Jan 23, 2024 06:02 AM IST

వరంగల్లులో ఏర్పాటవుతుందనుకున్న సైనిక్ స్కూల్ ఆశలు గల్లంతేనా? 2016లో మంజూరైన సైనిక్ స్కూల్ హైదరాబాద్ కంటోన్మెంట్‌కు తరలిపోనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

సైనిక్ స్కూల్ కోసం ప్రతిపాదించిన భూమి
సైనిక్ స్కూల్ కోసం ప్రతిపాదించిన భూమి

దాదాపు ఎనిమిదేళ్ల కిందట వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూల్ వేరే చోటుకు తరలిపోనుందా.. అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు సైనిక్ స్కూల్ మంజూరు చేయగా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పునాది కూడా పడలేదు. ఎనిమిదేళ్ల పాటు పూర్తి స్థాయిలో స్థలం కేటాయించడానికి గత ప్రభుత్వం మీనమేషాలు లెక్కించగా ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఏర్పాటుకు ప్రతిపాదనలు రెడీ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతోనే వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూల్ తరలిపోయినట్టేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మొదట ధర్మసాగర్ మండలంలో ఏర్పాటుకు నిర్ణయం

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత 2016లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ను మంజూరు చేసింది. స్కూల్ ఏర్పాటుకు కావాల్సిన భూమి, భవన నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కోసం రూ. 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు అప్పటి డిప్యూటీ సీఎం, ప్రస్తుత స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైనిక్ స్కూల్ తన సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయించేందుకు ప్లాన్ చేశారు. ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

దీంతో ఎల్కుర్తిలో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో నిరుపేద రైతులకు సర్వే నెంబర్ 160 లో ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ ను సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆ సర్వే నెంబర్ లో మొత్తం 229 ఎకరాల భూమి ఉంది. కానీ సైనిక్ స్కూల్ కోసం 50 ఎకరాలు అవసరం కాగా అక్కడి రైతులకు పరిహారం ఇచ్చి భూమిని తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. 

ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్‌ను తిరిగి ప్రభుత్వ అవసరాల కోసమే తిరిగి తీసుకుంటుందన్న ఉద్దేశంతో అధికారులు ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని బ్లాక్ చేసి, రైతులకు కొత్త పాసు పుస్తకాలు జారీ కాకుండా చేశారు. పరిహారం చెల్లించి భూములను తీసుకుంటామని చెప్పినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో వారికి తెలంగాణ ప్రభుత్వ పాసు పుస్తకాలు రాక, రైతుబంధుకు నోచుకోకపోగా.. ఇటు పరిహారం అందక రెండు విధాలుగా నష్టపోవాల్సి వచ్చింది.

స్థలం ఇవ్వకపోవడం వల్లే ఆలస్యం!

2016లో కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ ను మంజూరు చేయగా అదే ఏడాది నవంబర్ లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అదే విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మేనేజ్‌మెంట్‌తో నిర్వహించిన మీటింగ్ లో పాల్గొన్న ఆయన సైనిక్ స్కూల్ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు సైనిక్ స్కూల్ మంజూరు చేసిందని, 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంవోయూ మీద సంతకం చేయాల్సి ఉందని చెప్పారు. 

సైనిక్ స్కూల్ కు భూమికి కేటాయించడమే కాకుండా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు ల్యాండ్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, వచ్చే ఏడాది నుంచే సైనిక్ స్కూల్ ప్రారంభిస్తామని 2016 నవంబర్ లో కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. 

ఇదిలాఉంటే 2017 జనవరి 17తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సైనిక్ స్కూల్ మంజూరైన విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని, ఈ స్కూల్ వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నానంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే ఉంటే మిగిలిన జిల్లాలకు గుర్తింపు ఎక్కడ ఉంటుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు.

తరలిపోయినట్టేనా..?

దాదాపు ఎనిమిదేళ్ల కిందట స్కూల్ మంజూరైనా స్థలం కేటాయించడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలున్నాయి. దీంతోనే పలుమార్లు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల మధ్య తరచూ మాటల యుద్ధం నడిచింది. ఇదిలాఉంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి రక్షణ శాఖ పరిధిలోని భూములను వివిధ డెవలప్మెంట్ పనుల కోసం కేటాయించాల్సిందిగా కోరడంతో పాటు తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

దీంతో కేంద్ర మంత్రి నుంచి సానుకూల సంకేతాలు రాగా.. వరంగల్‌లో ఇకనైనా సైనిక్ స్కూల్ కు అడుగులు పడతాయని ఓరుగల్లు జిల్లా ప్రజలు ఆశపడ్డారు. ఇంతలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో వరంగల్ ప్రజలను గందరగోళంలో పడేసింది. మొదట్నుంచీ ధర్మసాగర్ మండలం ఎల్కుర్తిలోనే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తారని అందరూ భావించగా ఇప్పుడు కొత్తగా కంటోన్మెంట్ లో ఏర్పాటుకు అడుగులు పడుతుండటంతో వరంగల్ నుంచి సైనిక్ స్కూల్ తరలిపోయినట్టేననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్లు

రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు. కాగా ఇప్పుడు సైనిక్ స్కూల్ తరలిపోయే అవకాశం కనిపిస్తుండటంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు స్పందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. సైనిక్ స్కూల్ ఏర్పడితే ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు రావడంతో పాటు ఎంతోమంది పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు లభించడం, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు లభించే అవకాశం ఉండటంతో సైనిక్ స్కూల్‌ను ఎల్కుర్తిలోనే ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి జిల్లా నేతలు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఉమ్మడి జిల్లాలోని నేతలు వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.

-హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి

IPL_Entry_Point

టాపిక్