No Alliance In Telangana: తెలంగాణలో ఎవరితో పొత్తులుండవన్న కిషన్ రెడ్డి.. నారాయణ పేటలో ఎన్నికల ప్రచారం ప్రారంభం
No Alliance In Telangana: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీతో ఎన్నికల పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణ పేటలో కృష్ణమ్మకు పూజలు చేసి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు.
No Alliance In Telangana: పార్లమెంటు ఎన్నికల్లో Elections ఏ రాజకీయ పార్టీతో బీజేపీకిBjp పొత్తు ఉండదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం నేపథ్యంలో ఎవరితో రాజకీయ పొత్తులు ఉండవని, బీజేపీ ఒంటరిగానే తెలంగాణ ఎన్నికలకు వెళుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.
నారాయణపేటలో బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి KishanReddy ప్రారంభించారు. విజయసంకల్ప రథ యాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ఒకేసారి ఐదు యాత్రలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని నియోజక వర్గాల్లో అగ్రనేతలు పర్యటించేలా ఏక కాలంలో ఐదు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టినట్టు తెలిపారు.
తెలంగాణలో Telangana బీజేపీకి స్పష్టమైన ప్రజా మద్దతు ఉందని, ఒంటరిగానే తాము విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్- బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే తిప్పి కొట్టాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్BRSతో పొత్తు ప్రసక్తే ఉత్పన్నం కాదని, బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు పోటీచేసి మెజారిటీ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న బీజేపీ మునిగిపోయే నావ వంటి బీఆర్‌ఎస్‌తో కలిసే పరిస్థితి రాదని స్పష్టం చేశారు.
గతంలో కూడా తాము బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. ఈ ప్రచారాన్ని కొందరు దుర్మార్గులు పనిగట్టుకుని కుట్రపూరితంగా చేస్తున్నారని, మెడకాయ మీద తలకాయ లేనివాళ్లు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించొద్దని ఆయన కోరారు.
మంగళవారం నుంచి రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో మొత్తం 5,500 కి.మీ మేర పార్టీ ఆధ్వర్యంలో 'విజయసంకల్పయాత్ర' Vijaya sankalpa Yatraజరుగుతుందని వివరించారు. బీజేపీ శ్రేణుల్ని ప్రజలు ఆశీర్వదించాలని, బహిరంగ సభలు ఉండవని, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగానే ఈ యాత్రలను పూర్తిచేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. 20వ తేదీ నుంచి నాలుగుయాత్రలు సమాంతరంగా మొదలవుతాయని, మేడారం జాతర కారణంగా వరంగల్ వైపు సాగే యాత్ర మాత్రం కొన్నిరోజుల ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్రల్లో భాగంగా... రైతులు, చేతివృత్తులవారు, నిరుద్యోగులు, పొదుపుసంఘాల మహిళలు, ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటామన్నారు.
విజయ సంకల్ప యాత్రలు ఇలా...
1) కొమరంభీం విజయ సంకల్ప యాత్ర...
బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుంచి ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు 21 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ దీనిని ప్రారంభిస్తారు. ఎంపీ డా. కె.లక్ష్మణ్, ఆరుగురు శాసనసభ్యులు భైంసా యాత్రలో పాల్గొంటారు.
2) రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర...
కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మ ప్రారంభిస్తారు. ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు.
3) భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర...
భువనగిరిలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు. ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రాజా సింగ్, వెంకటరమణా రెడ్డి పాల్గొంటారు.
4) కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర...
సమ్మక్క సారక్క జాతర కారణంగా కొన్ని రోజులు ఆలస్యంగా ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,015 కి.మీ మేర 7 రోజుల పాటు 21 నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ యాత్ర ఉంటుంది.
5) కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర...
మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసిన తర్వాత ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,440 కి.మీ మేర యాత్ర సాగనుంది. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొంటారు.