President Draupadi Murmu Hyderabad Tour: దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 26న రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి.. 5 రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. దక్షిణాది విడిది కోసం ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు.
శీతకాల విడిదిలో భాగంగా ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 26న మధ్యాహ్నం ఏపీలోని శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకుంటాైరు. అనంతరం తెలంగాణ పర్యటనకు బయలుదేరుతారు. అదే రోజు మధ్యాహ్నం 3.05 గంటల నుంచి 3.15 వరకు బొల్లారంలో యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడంతో పాటు వీరనారులను సన్మానించనున్నారు. సాయంత్రం 7.45 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చే విందుకు హాజరు అవుతారు.
ఈనెల 27న ఉదయం 10.30 గంటలకు నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీని సందర్శించి విద్యార్థులతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీసు అకాడమీని సందర్శించి శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులతో మాట్లాడనున్నారు. ఇక ఈ నెల 28న ఉదయం 10.40 నుంచి 11.10 గంటల వరకు భద్రాచలం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ‘ప్రశాద్’ అనే ప్రాజెక్టును ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ సైతం ప్రశాద్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖకి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
ఇక 29న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు షేక్‌పేట్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ను రాష్ట్రపతి సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి ఉంటుంది. సాయంత్రం 5–6 గంటల వరకు శంషాబాద్‌లోని శ్రీరామా నుజాచార్యుల విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న ఉదయం 10–11 గంటల వరకు రంగారెడ్డి జిల్లా శాంతివనంలోని శ్రీరామచంద్ర మిషన్‌ను సందర్శించి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ, తెలంగాణకు చెందిన అంగన్‌వాడీ, ఆశ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘హర్ దిల్ ధ్యాన్..హర్ దిన్ ధ్యాన్’ అనే నినాదాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీరామచంద్ర మహారాజ్ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రపతి నిలయం చేరుకొని ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
2019 ఏడాదిలో అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి వస్తుండటంతో అధికారులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే దేశ 15వ రాష్ట్రపతి హోదాలో మొట్ట మొదటిసారి శీతాకాల విడిదికి ద్రౌపదీ ముర్ము రానున్నారు.