Fake Notes in Medaram: మేడారం జాతర వేళ.. ములుగులో దొంగనోట్ల కలకలం!-fake notes in lime light during medaram fair time ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fake Notes In Medaram: మేడారం జాతర వేళ.. ములుగులో దొంగనోట్ల కలకలం!

Fake Notes in Medaram: మేడారం జాతర వేళ.. ములుగులో దొంగనోట్ల కలకలం!

HT Telugu Desk HT Telugu

Fake Notes in Medaram: మేడారం మహాజాతర సమీపిస్తున్న వేళ ములుగు జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది.

ములుగులో దొంగనోట్ల కలకలం

Fake Notes in Medaram:విద్యుత్తుశాఖ అధికారులు నెలవారీ విద్యుత్తు బకాయిలు వసూలు చేసే క్రమంలో కొంతమంది దొంగ నోట్లు ఇవ్వగా.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసే సమయంలో దొంగనోట్ల విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో బ్యాంకు అధికారులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు గుట్టుగా విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గత కొద్దిరోజులుగా ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో విద్యుత్తుశాఖ అధికారులు కరెంట్ బిల్లుల బకాయిలు వసూలు చేస్తున్నారు.

రోజువారీలాగే ఓ అధికారి సోమవారం వరకు ములుగు మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్తు బకాయిలు వసూలు చేశాడు. అన్నీ కలిపి 7 లక్షల 12 వేల రూపాయలు కాగా.. ఆ మొత్తాన్ని విద్యుత్తు శాఖ అకౌంట్ లో వేసేందుకు ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్ బీఐ బ్యాంకుకు వెళ్లాడు.

తాను ఇచ్చిన మొత్తాన్ని విద్యుత్తు సంస్థ అకౌంట్ లో వేయాల్సిందిగా అక్కడున్న సిబ్బందిని కోరడంతో ఆయన సదరు ఉద్యోగి నుంచి ఆ డబ్బులను తీసుకుని లెక్కించాడు. అందులో ఓ మూడు 500 నోట్లు డిఫరెంట్ గా కనిపించడంతో సదరు బ్యాంకు ఉద్యోగి వాటిని పరీక్షించి చూశాడు. అది ఒరిజినల్ నోటులా లేకపోవడం గమనించి, దొంగనోటుగా గుర్తించాడు.

వెంటనే విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆయన నోట్లు తీసుకుని వచ్చిన విద్యుత్తుశాఖ అధికారి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ విద్యుత్తుశాఖ అధికారి ద్వారా ఫేక్ నోట్లు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఎన్పీడీసీఎల్ అధికారి మాత్రం కరెంట్ బిల్లుల చెల్లింపుల్లో దొంగ నోట్లు ఇదే మొదటిసారి అని, ఆ నోట్లు ఎవరి నుంచి వచ్చాయో కనిపెట్టడం సాధ్యం కాలేకపోయిందని చెప్పారు.

మేడారం జాతర టెన్షన్

సాధారణంగా దొంగ నోట్ల దందా చేసే దుండగులు జాతరల సమయంలో నకిలీ నోట్లు ఎక్కువగా చెలామణి చేస్తుంటారు. ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. లక్షల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తుంటారు.

జాతర జరిగే నాలుగు రోజుల్లో వివిధ దుకాణాల్లో కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంటుంది. జాతర ముగిసేంతవరకు రోడ్లన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయి ఉంటాయి.

ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చే జాతరను టార్గెట్ చేసుకుని దొంగ నోట్ల ముఠా దందా చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కూడా ములుగులోని ఓ పెట్రోల్ బంక్ లో తాజా దొంగనోట్లు వెలుగుచూశాయి. ఓ వాహనదారుడు సదరు బంక్ లో రూ.100 పెట్రోల్ పోయించుకుని రూ.500 నోటు ఇవ్వగా.. బంక్ నిర్వాహకులు ఆయనకు తిరిగి ఇచ్చిన రూ.వంద నోట్లలో ఒక నోటు నకిలీదిగా తేలింది.

దీంతో కంగారు పడిపోయిన వాహనదారుడు బంక్ నిర్వాహకులను నిలదీశాడు. కాగా బంక్ నిర్వాహకులు ఆయనకు మంచినోటు ఇచ్చి పంపించేశారు. వరుసగా నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్టు వెలుగులోకి రావడం కలకలం రేపుతుండగా మేడారం జాతర ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందోననే సందేహం వ్యక్తమవుతోంది.

ఒకవేళ జాతరలో నకిలీ నోట్లు చెలామణి చేసినా అంత రద్దీలో ఎవరూ సరిగా గుర్తించలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో నకిలీ నోట్ల చెలామణి విచ్చలవిడిగా జరిగే ప్రమాదం ఉంటుంది. నకిలీ నోట్లు చెలామణి అయితే ఎంతోమంది దుకాణదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉండగా.. సాధారణ జనాలు కూడా తిప్పలు పడక తప్పని పరిస్థితి నెలకొంటుంది.

అధికారుల అలర్ట్..

ములుగు జిల్లాలో నకిలీ నోట్లు వెలుగులోకి వస్తుండటంతో పోలీస్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అసలు దొంగ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు జిల్లా పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తొందర్లోనే జాతర ప్రారంభం కానుండటంతో దొంగ నోట్ల కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ములుగు పోలీస్ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)