Warangal News : గ్రేటర్ వరంగల్ ముంగిట మరో ఛాలెంజ్- నెగ్గితే రూ.రూ.135 కోట్లు దక్కే ఛాన్స్-warangal news in telugu citiis challenge gwmc participate in smart city scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal News : గ్రేటర్ వరంగల్ ముంగిట మరో ఛాలెంజ్- నెగ్గితే రూ.రూ.135 కోట్లు దక్కే ఛాన్స్

Warangal News : గ్రేటర్ వరంగల్ ముంగిట మరో ఛాలెంజ్- నెగ్గితే రూ.రూ.135 కోట్లు దక్కే ఛాన్స్

HT Telugu Desk HT Telugu
Feb 03, 2024 08:02 PM IST

Warangal News : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో ప్రతిష్టాత్మక పోటీకి ఎంపికైంది. సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేటివ్​అండ్​సస్టైన్-2.0 ఛాలెంజ్ కు వరంగల్ ఎంపికైంది. ఈ ఛాలెంజ్ లో నెగ్గితే గ్రేటర్ వరంగల్ కు కేంద్రం ప్రభుత్వం నుంచి రూ.135 కోట్లు దక్కే అవకాశం ఉంది.

 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్

Warangal News : వరంగల్ నగరానికి మరో ఘనత దక్కనుంది. ఇప్పటికే వివిధ పోటీల్లో స్థానం దక్కించుకున్న వరంగల్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే మరో ప్రతిష్టాత్మక పోటీకి ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్​హౌజింగ్​అండ్ అర్బర్​ఎఫైర్స్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేటివ్​అండ్​సస్టైన్-2.0(సీఐటీఐఐఎస్–2.0​) ఛాలెంజ్​ కు ఎంపికైంది. ఈ మేరకు శనివారం గ్రేటర్​వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందింది. 2015లో గ్రేటర్​ వరంగల్​నగరం స్మార్ట్ సిటీ పథకానికి ఎంపికవ్వగా.. దాదాపు రూ.2 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టారు. లీ అసోసియేట్స్​అనే ప్రైవేటు సంస్థ ఇక్కడి ప్రాజెక్టు పనులను చూసుకుంటోంది. కాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరానికి స్మార్ట్​ సిటీ పథకానికి ఎంపిక చేయగా.. చాలాచోట్ల పనులు పెండింగ్​ ఉన్నాయి. కాగా ఆయా నగరాలను ప్రోత్సహించడంతో పాటు మరిన్ని నిధులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ సీఐటీఐఐఎస్​ ఛాలెంజ్​ను నిర్వహిస్తుంది. ఈ మేరకు స్మార్ట్​ సిటీ నగరాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇది వరకే సమర్పించాయి. ఈ నేపథ్యంలో తొలి దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 84 నగరాలు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన డ్యాక్యుమెంట్స్ సమర్పించగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నగరాలను ఛాలెంజ్ కు ఎంపిక చేసింది. దీంతో ఆ జాబితాలో గ్రేటర్​ వరంగల్ నగరానికి చోటు దక్కింది.

yearly horoscope entry point

రెండు సెషన్స్​ లో ప్రజంటేషన్​

సిటీ ఇన్వెస్ట్​మెంట్​ టు ఇన్నోవేటివ్​ అండ్​ సస్టైన్​–2.0 ఛాలెంజ్​లో భాగంగా ఈ నెల 8న కేంద్ర హౌజింగ్​అండ్ అర్బన్​అఫైర్స్​ మంత్రిత్వశాఖకు చెందిన జ్యూరీ సభ్యుల సమక్షంలో స్మార్ట్​ సిటీలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా రెండు సెషన్స్​ లో జరగనుండగా.. మొదటి సెషన్​ లో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి 13 నిమిషాల్లో వివరించాల్సి ఉంటుంది. రెండో సెషన్​ లో 15 నిమిషాల టైం కేటాయిస్తారు. ఈ రెండో సెషన్​లో నగరానికి సంబంధించిన స్లైడ్​ లను ప్రదర్శిస్తూ డెవలప్మెంట్​ గురించి వివరించాలి. ఇలా దేశవ్యాప్తంగా ఎంపికైన నగరాలకు సంబంధించిన మున్సిపల్​కమిషనర్లు ఇచ్చే ప్రజంటేషన్లను పరిగణనలోకి తీసుకుని చివరగా సిటీ ఇన్వెస్ట్మెంట్​టు ఇన్నోవేటివ్​అండ్​సస్టైన్​–2.0 ఛాలెంజ్ కు ఓవరాల్​గా 18 నగరాలను ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక మొత్తం జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే ఉంటుంది. కాగా ఈ ఛాలెంజ్​లో చివరగా ఎంపికయ్యే 18 నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.135 కోట్లు అందజేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్ కు లేఖ అందింది.

నగరానికి గుర్తింపు దక్కడం హర్షణీయం- మేయర్ గుండు సుధారాణి

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఛాలెంజ్ కు వరంగల్ ఎంపిక కావడం హర్షనీయమని గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​గుండు సుధారాణి అన్నారు. దేశవ్యాప్తంగా 84 స్మార్ట్ సిటీ నగరాల్లో వరంగల్ కు కూడా చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కు దేశంలోని ఫాస్ట్ మూవింగ్ సిటీస్ లో చోటు దక్కిందని, భవిష్యత్తులో మిగిలిన పథకాలలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తామని మేయర్​స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో గ్రేటర్ వరంగల్ ను ముందంజలో నిలిపే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఈ ఛాలెంజ్​ ఒక మైలురాయిగా నిలుస్తుందని మేయర్​ గుండు సుధారాణి చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిపుణులు, అధికారుల సలహాలు తీసుకుని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామని మేయర్​స్పష్టం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఛాలెంజ్ కు వరంగల్ నగరం ఎంపిక కావడంతో గ్రేటర్ అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. ఛాలెంజ్ లో నెగ్గి నగర అభివృద్ధి లో భాగస్వాములు కావడంతో పాటు మరిన్ని నిధులతో గ్రేటర్ వరంగల్ ను దేశంలోనే అగ్ర భాగంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner