Warangal Skill Centre: రూ.200 కోట్లతో వరంగల్ లో టెక్నికల్ సెంటర్.. నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ
Warangal Skill Centre: యువతీ, యువకుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం వరంగల్ నగరంలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా వాటిలో ఒకటి వరంగల్‌లో ఏర్పాటు కానుంది.
Warangal Skill Centre: కేంద్రం ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఒకటి వరంగల్ కు మంజూరైంది. దాదాపు రూ.200 కోట్లతో ఈ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయనుండగా.. వరంగల్ జిల్లాలోని ఖిలా వరంగల్ మండలం రంగశాయిటపేటలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
మంత్రి కొండా సురేఖ స్థలాన్ని కూడా ఫైనల్ చేసినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో టెక్నికల్ సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలతో టెక్నికల్ సెంటర్ ను వరంగల్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి కూడా అంగీకారం తెలిపింది.
టెక్నికల్ సెంటర్ ఏర్పాటు తొందరగా పూర్తయితే ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
రూ.200 కోట్లతో ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ(మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్) పరిశ్రమల్లో భాగంగా పరిశ్రమలకు అధునాతన సాంకేతికతను సమకూర్చడం, యువతీ, యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం, టెక్నికల్ అంశాలపైనా నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక, వ్యాపార సలహాలు అందించడంతో పాటు ఇతర స్కిల్ టెవలప్మెంట్ కోసం టెక్నికల్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
వివిధ రంగాలు, పరిశ్రమల్లో నైపుణ్యాభివృద్ధిలో ఈ టెక్నికల్ సెంటర్ పాత్ర ప్రధానంగా ఉంటుంది. దీంతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 చోట్ల ఈ టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది.
తెలంగాణకు సంబంధించిన నైపుణ్య శిక్షణా కేంద్రం వరంగల్ లో ఏర్పాటు కానుండగా.. ఈ టెక్నికల్ సెంటర్ కోసం సరిపడా భవనం, ప్లాంట్లు, యంత్రాల సమకూర్పు, తదితర అవసరాల కోసం రూ.200 కోట్లను పెట్టుబడిగా అందించనుంది.
ఈ టెక్నికల్ సెంటర్ లో ప్రధానంగా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్, ఎలక్ట్రికల్, లెదర్, గ్లాస్, స్టోర్స్ తదితర విభాగాలు, రంగాలకు సంబంధించిన సాంకేతిక అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. ఈ టెక్నికల్ సెంటర్ ఏర్పాటైతే తెలంగాణ మొత్తంమీద ఏకైక సెంటర్ కానుండగా.. ఇందులో చేపట్టే స్కిల్ డెవలప్మెంట్ చర్యలతో వేలాది మంది యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వరంగల్ శివారు మడికొండలోని ఇండస్ట్రీయల్ పార్కుకు వివిధ కంపెనీలు తీసుకొస్తామని గత పాలకులు చెప్పినప్పటికీ.. ఒకట్రెండు తప్ప పెద్దగా కంపెనీలేమీ రాలేదు.
వచ్చిన వాటికీ కూడా సరైన సౌకర్యాలు లేక కంపెనీల యజమానులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు వివిధ రంగాల్లో యువత సొంతంగా నైపుణ్యాలు పెంపొందించుకోవడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించనుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మంత్రి చొరవతో వరంగల్ కు...
యువతకు ఎంతో కీలకమైన ఈ టెక్నికల్ సెంటర్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు మొదట ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్రంలోని మిగతా ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు.
వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉండటంతో పాటు టెక్నికల్ హబ్ గా ఇది ఏర్పాటు కానుండటంతో మంత్రి సురేఖ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి మరీ దీనిని వరంగల్ కు మంజూరు చేయించారు.
ఖిలా వరంగల్ మండలంలోని రంగశాయిపేటలో స్థలం కూడా అందుబాటులో ఉందని వివరించడంతో వరంగల్ లో దాని ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వ పెద్దలకు వివరించడంలో మంత్రి సఫలీకృతమయ్యారుఇక్కడ టెక్నికల్ సెంటర్ పూర్తి స్థాయిలో ఏర్పాటైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇదొక వరప్రదాయినిగా మారనుంది.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)