Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు వీటిని దానం చేశారంటే మీ జీవితంలో కష్టాలు ఉండవు అంతా శుభమే
Akshaya tritiya 2024: పవిత్రమైన అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. వీటిని దానం చేశారంటే మీ జీవితంలో కష్టాలు ఉండవు, అంతా శుభమే జరుగుతుంది.
Akshaya tritiya 2024: హిందూ ధర్మశాస్త్రంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏవైనా కొత్త పనులు చేపట్టేందుకు, వ్యాపారం ప్రారంభించేందుకు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసుకునేందుకు అక్షయ తృతీయ పవిత్రమైన రోజుగా భావిస్తారు.
వైశాఖ మాసం మూడో రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ అంటే క్షయం కానిది, నశించినది అని అర్థం. అందుకే ఈరోజు ఎటువంటి ముహూర్తం చూడకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. శుభకార్యాలు నిర్వహించుకుంటారు. దానాలు చేసేందుకు చాలా మంచి రోజు. ఈరోజు నీటితో కూడిన మట్టి కుండ, ఫ్యాన్లు, గొడుగులు, బియ్యం, ఉప్పు, నెయ్యి, ఆకుకూరలు, పంచదార, చింతపండు, సత్తు మొదలైన వస్తువులు దానం చేయడం చాలా మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున అదృష్టం కోసం మీరు శంఖం, నెమలి ఈకలు కూడా కొనుగోలు చేయవచ్చు. శంఖం లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. అయితే వీటిని కొన్న తర్వాత గంగా జలంతో శుభ్రం చేసిన పూజ చేసిన తర్వాతే ఉపయోగించుకోవాలి. బంగారం, వెండి ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తే వాటిని లక్ష్మీ పూజలో ఉంచిన తర్వాత మాత్రమే ఉపయోగించుకోవాలి. అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.
శయన దానం
అక్షయ తృతీయ రోజు చాప, మంచం, దుప్పట్లు, పరుపు వంటి వస్తువులు దానం చేయడం వల్ల ఇంట్లో వారికి పీడకలలు రావడం తగ్గుతుంది. పడుకునేందుకు ఉపయోగించే వస్తువులు దానం చేయడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది.
వస్త్ర దానం
శుభప్రదమైన అక్షయ తృతీయ రోజు వస్త్ర దానం చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు, ప్రకృతి సంబంధమైన ప్రమాదాల నుండి రక్షించబడతారు.
కుంకుమ దానం
ఇల్లాలి సౌభాగ్యానికి గుర్తు కుంకుమ. అందుకే భర్త క్షేమం కోరుకుంటూ ప్రతి స్త్రీ నుదుట కుంకుమ ధరిస్తుంది. అక్షయ తృతీయ రోజు కుంకుమ దానం చేయడం వల్ల ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగుతుంది.
చందన దానం
అక్షయ తృతీయ రోజు చందనం దానం చేయడం వల్ల కీర్తి పెరుగుతుంది. వైశాఖం ఎండలు ఎక్కువగా ఉంటాయి అందుకే చల్లని వస్తువులు దానం చేయాలని చెబుతారు. అందుకే చందనం చలువ చేసే పదార్థం దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
తాంబూలం
తాంబూలంలో ఉపయోగించే తమలపాకులు దానం చేయడం వల్ల ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు, రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభిస్తాయి. జీవితం చక్కగా సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది .
కొబ్బరి దానం
అక్షయ తృతీయ రోజు కొబ్బరికాయ దానం చేయడం వల్ల వంశం అభివృద్ధి చెందుతుంది. సంపద పెరుగుతుంది.
మజ్జిగ దానం
వేసవి సమయం కనుక అక్షయ తృతీయ రోజు మజ్జిగ దానం చేస్తే మంచిది. దాహంలో ఉన్న వారి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను దానం చేయడం వల్ల ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది. అన్ని రంగాలలోనూ రాణిస్తారు. కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అక్షయ తృతీయ రోజు జలదానం చేయడం అన్నింటికల్లా ముఖ్యమైనది, శుభప్రదమైనది.
ఉదకుంభ ధానం
అక్షయ తృతీయ రోజు ఉదకుంభ దానం చేయడం ఎంతో విశిష్టమైనదిగా పరిగణిస్తారు. రాగి లేదా వెండి కలశంలో కుంకుమపువ్వు, కర్పూరం, తులసి, వక్క కలిపిన నీటిని దానం చేయడం వల్ల వివాహం కాని వారికి పెళ్లి నిశ్చయమవుతుంది. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
పాదరక్షలు
వైశాఖ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి. అందుకే అటువంటి సమయంలో చెప్పులు, బూట్లు వంటివి దానం చేయడం వల్ల నరకబాధలు తొలగుతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే గొడుగు వంటివి కూడా దానం చేస్తారు.