Coconut: పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా?-why coconut is most important thing in religious rituals ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Coconut: పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా?

Coconut: పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Dec 28, 2023 05:00 PM IST

పూజ దగ్గర నుంచి ఏదైన వేడుకలు, ప్రారంభోత్సవాల వరకు అందరూ తప్పనిసరిగా కొబ్బరికాయ ఉపయోగిస్తారు. దానికి ఎందుకంత ప్రాముఖ్యతో తెలుసా?

కొబ్బరికాయని పూజలో ఎందుకు ఉపయోగిస్తారు?
కొబ్బరికాయని పూజలో ఎందుకు ఉపయోగిస్తారు? (pexels)

హిందువులు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ తప్పనిసరిగా కొడతారు. పండుగలు, వేడుకలు, శుభ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా ఏ సందర్భమైన ముందుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో కొబ్బరికాయకి పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది.

స్వచ్చత, సంతానోత్పత్తి, దైవిక ఆశీర్వాదాలని కొబ్బరికాయ సూచిస్తుంది. దీని బయట గట్టి పెంకు రక్షణని సూచిస్తుంది. అందులోని కొబ్బరి స్వచ్చమైన మనసుని సూచిస్తుంది. అందుకే దీన్ని వేడుకల్లో, నైవేద్యాలలో ఉపయోగిస్తారు. సంస్కృతంలో కొబ్బరికాయని శ్రీఫలగా పిలుస్తారు. అంటే దేవుడి పండు అని అర్థం. మహా భారతం, రామాయణం వంటి పురాణాలు, బౌద్ధమతంలోని జాతక కథల్లో కొబ్బరి కాయ గురించి ప్రస్తావన కూడా ఉంది.

క్రీ. శ ఆరవ శతాబ్దానికి ముందు కొబ్బరి కాయ దేశీయ ఆచారాలలో ఎంతో పవిత్రమైనదిగా భావించడం జరిగింది. అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం సమయంలో మతపరమైన ఆచరాలలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. మత్స్య పురాణం ప్రకారం ఇతర పవిత్ర చెట్లతో పాటు కొబ్బరి చెట్టుని తోటలో నాటడం వల్ల శ్రేయస్సు, సంపద పెరుగుతుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం కొబ్బరికాయని శివుడు తన కుమారుడు వినాయకుడికి ఇచ్చారని చెబుతారు. ప్రపంచంలోనే ఇది గౌరవనీయమైన పండుగా గుర్తింపు తెచ్చుకుంది.

కొబ్బరికాయ నమ్మకాలు

హిందూ మతంలో కొబ్బరి కాయ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులని సూచిస్తుంది. కొబ్బరికాయని పూజా వస్తువుగా భావించి దైవిక త్రిమూర్తుల నుంచి ఆశీర్వాదం పొందటం కోసం భక్తులు కొబ్బరికాయని ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం విష్ణువు భూమి పైకి వచ్చినప్పుడు మానవ జాతి సంక్షేమం కోసం లక్ష్మీదేవి, కొబ్బరి చెట్టు, కామధేను అవుని తీసుకువచ్చినట్టు చెబుతారు. ముక్కోటి దేవతలు కొలువై ఉన్నట్టు భావించి కొబ్బరికాయని పవిత్రంగా చూస్తారు.

కొబ్బరి కాయని మనిషితో కూడా పోలుస్తారు. ఇందులోని భాగాలు మానవ శరీర భాగాలుగా చెప్తారు. టెంకాయలోని కొబ్బరి పార్వతి దేవికి ప్రతీకగా చూస్తారు. లోపల ఉండే నీరు పవిత్రమైన గంగా నదితో సంబంధం కలిగి ఉంటుందని అంటారు. పెంకు పదార్థం కార్తీకేయుడిని సూచిస్తుంది. అందుకే హిందూ మతంలో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ప్రతిబింబిస్తూ మతపరమైన ఆచారాలలో కొబ్బరి కాయకి ప్రాముఖ్యత ఇస్తారు.

కొబ్బరికాయ కొట్టడం వెనుక ప్రాముఖ్యత

కొబ్బరికాయని పగలగొట్టే చర్య అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ప్రతీకాత్మక ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. ఇందులోని ప్రతి భాగం మానవ స్వభావంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. కొబ్బరి కాయ బయటి పెంకు అహంకారానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. కొబ్బరి కాయ కొట్టడం అంటే మనలోని అహంకారాన్ని తీసివేయడమే. ఇందులోని లేత కొబ్బరి మనసుకి ప్రతీకగా పరిగణిస్తారు. కొబ్బరికాయలో ఉండే నీరు స్వచ్చతకు ప్రతీక. ఆ నీటిని దేవుడికి సమర్పించడం అంటే వ్యక్తి శుద్ధీకరణను సూచించడం.

మానవుడితో కొబ్బరికాయకి పోలిక

కొబ్బరి కాయ మానవ శరీర నిర్మాణ శాస్త్రంలోని వివిధ అంశాలని పోలి ఉంటుందని నమ్ముతారు. కొబ్బరికాయకి ఉండే పీచు మనిషి వెంట్రుకలతో పోల్చారు. గట్టి పెంకు మానవ పుర్రెని పోలి ఉంటుంది. ఇందులోని నీరు మానవ రక్తంగా భావిస్తారు. తెల్లటి కొబ్బరి మానవ మెదడుకి సారూప్యంగా ఉంటుంది. కొబ్బరి కాయని దేవుడికి కొట్టినప్పుడు మనలో ఉన్న అసూయ, ఈర్ష్య, అహంకారం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

టాపిక్