Shani trayodashi: రేపే శని త్రయోదశి.. ఇవి దానం చేశారంటే శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది
Shani trayodashi: మార్చి 23వ తేదీ శని త్రయోదశి వచ్చింది. రేపు శని అనుగ్రహం పొందటం కోసం కొన్ని వస్తువులు దానం చేయాలి. అలాగే కొన్ని వస్తువులు మాత్రం పొరపాటున కూడా కొనుగోలు చేయొద్దు.
Shani trayodashi: శనివారం, త్రయోదశి కలిసి వస్తే ఆరోజుని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఇవి రెండూ కలిసి రావడం చాలా విశిష్టమైనది. మార్చి 23 శనివారంతో పాటు త్రయోదశి తిథి వచ్చింది. శని త్రయోదశి పరమేశ్వరుడికి మహా ప్రీతికరమైన రోజు. శివారాధన చేస్తే శని అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే శనివారం రోజు త్రయోదశి వస్తే శని అనుగ్రహం పొందగలుగుతారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అంటారు. అందుకే ఆ రోజుకి అంతటి విశిష్టత ఉంటుంది.
శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతి కరమైన రోజు. శని గ్రహ బాధల నుంచి విముక్తి కలిగేందుకు ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి, నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది.
శనిత్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు
శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయాలి. దోషాలు ఉన్న వాళ్ళు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపించాలి. కాకులకు ఆహారం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శని బాధలు తీరుతాయి.
కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వులు నూనె, బొగ్గులు, నల్ల రిబ్బన్, ఎనిమిది ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలను నల్లని వస్త్రంలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదంటే వాటిని పారే నీటిలో విడిచి పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చేయాలి. నూనె, గొడుగు, నువ్వులు, నవధాన్యాలు కొనకూడదు. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభించదు.
శని దోషం వల్ల ఇబ్బందులు
శని దేవుడు ఆగ్రహిస్తే జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. ధన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. సంపద తరిగిపోతుంది.
శని దోషాల నుండి బయటపడేందుకు శనివారం నాడు శివుడిని, హనుమంతుడిని పూజించాలి. పేదలకు సహాయం చేయాలి అవసరంలో ఉన్నవారికి దానం చేయాలి. దానధర్మాలు చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించాలి. శని దేవుడికి నల్ల నువ్వులు, నల్ల శనగలు, నలుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించాలి. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది