Neera |చెట్టు నుండి తీసే మకరందమే నీరా.. ఆరోగ్య ప్రయోజనాలలో ఔరా!-what is neera difference with toddy best time to drink neera and its health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neera |చెట్టు నుండి తీసే మకరందమే నీరా.. ఆరోగ్య ప్రయోజనాలలో ఔరా!

Neera |చెట్టు నుండి తీసే మకరందమే నీరా.. ఆరోగ్య ప్రయోజనాలలో ఔరా!

Manda Vikas HT Telugu
May 03, 2023 09:59 AM IST

Neera Health Benefits: నీరా అంటే ఏమిటి, ఇది తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎవరు తాగవచ్చు, మొదలైన అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Toddy Milk Neera
Toddy Milk Neera (pinterest)

Neera: తేనెటీగలు పువ్వుల మకరందాన్ని పీల్చి తేనెను తయారు చేస్తాయి. ఈ మకరందం చెట్టు నుంచి తీయగలిగితే అది నీరా అవుతుంది. నీరా అనేది సాధారణంగా పామే కుటుంబ చెట్ల నుంచి సేకరిస్తారు. మన ప్రాంతంలో తాటి చెట్లు, ఈత చెట్లు విరివిగా ఉంటాయి. కాబట్టి వీటి నుంచే నీరా అనేది ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి తెల్లని ద్రవం విడుదలవుతుంది దీనినే కల్లు అంటారు. తాటి నుంచి వస్తే తాటికల్లు, ఈత చెట్టు నుంచి ఉత్పత్తి అయినది ఈత కల్లు అవుతుంది. అయితే ఇక్కడ నీరా అనేది ఈ కల్లు ఏర్పడకంటే ముందు తీసే మరింత స్వచ్ఛమైన ద్రవం. నీరాను తీసేటపుడు గీతా కార్మికులు పూర్తిగా చెట్టును శుభ్రం చేసి, దీనికోసం ప్రత్యేకమైన మట్టి కుండను కట్టి, సూర్యోదయానికి మునుపే సేకరిస్తారు. ఇది చూడటానికి కొబ్బరి నీళ్లలా కనిపిస్తుంది. రుచిలో సహజంగానే తియ్యగా ఉంటుంది. ఇందులో ఆల్కాహాల్ అనేది ఉండదు. కాబట్టి దీనిని ఎవరైనా తాగొచ్చు, ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. నీరా తాగటం చాలా ఆరోగ్యకరం అని గ్రామీణ ప్రాంతాల్లో నమ్ముతారు. గర్భిణీలకు ప్రత్యేకంగా తాగిస్తారు కూడా.

Best Time To Drink Neera- నీరా ఎప్పుడు తాగాలి?

నీరాను చెట్టు నుంచి సూర్యోదయం అవ్వకముందే సేకరిస్తారు. దీని అర్థం ఎండ తగిలితే ఇది పులిసినట్లు అవుతుంది. దీంతో నీరా కాస్త తెల్లని కల్లులా తయారవుతుంది. కల్లు తయారయ్యే ప్రక్రియలో దీనిలో ఆల్కాహాల్ ఉత్పత్తి జరుగుతుంది. సాధారణంగా చెట్టు నుంచి తీసిన కల్లులో 4 శాతం ఆల్కాహాల్ ఉంటుంది. కాబట్టి నీరా జీవిత కాలం చాలా తక్కువ. నీరా స్వచ్ఛమైన రూపాన్ని ఉదయం వేళ ఖాళీ కడుపుతో (Empty Stomach) తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

అయితే నీరాను ఎండతగలకుండా శీతల ప్రదేశంలో ఉంచి నాలుగైదు రోజుల వరకు కూడా భద్రపరుచుకోవచ్చు. తాజాగా ఉన్నప్పుడు తియ్యని రుచి ఉంటుంది, రోజులు గడిచే కొద్దీ కిణ్వణ ప్రక్రియ జరిగి పుల్లని కల్లులా తయారవుతుంది.

Neera Health Benefits- నీరా ఆరోగ్య ప్రయోజనాలు

స్వచ్ఛమైన నీరా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రొటీన్, చక్కెర, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. నీరా తాగితే కడుపు శుభ్రపడుతుంది, ఇది శరీరాన్ని అంతర్గతంగా శుభ్రపరిచే పానీయంలా (Detoxing Drink) పనిచేస్తుంది. పరిగడుపున నీరా తాగడం వలన ఈ ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు తొలగించటానికి, మధుమేహం, కొవ్వు కాలేయం, గుండె సమస్యల నివారించడంలో సహాయపడుతుంది.

తెలంగాణ ప్రభుతం నీరాను ఒక ఆరోగ్యకర పానీయంగా అధికారికంగా ఆమోదించింది. 2023 మే3న బుధవారం రోజున నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ను ప్రారంభించనుంది. నగరవాసులకు సురక్షితమైన, స్వచ్ఛమైన నీరాను అందించే ఉద్దేశ్యంతో ఈ నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Whats_app_banner