Hyderabad Neera Cafe : హైదరాబాద్ వాసులకు నిఖార్సైన నీరా, రేపు నెక్లెస్ రోడ్లులో కేఫ్ ప్రారంభం-hyderabad govt neera cafe opens tomarrow ministers ktr srinivas goud inagurates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Neera Cafe : హైదరాబాద్ వాసులకు నిఖార్సైన నీరా, రేపు నెక్లెస్ రోడ్లులో కేఫ్ ప్రారంభం

Hyderabad Neera Cafe : హైదరాబాద్ వాసులకు నిఖార్సైన నీరా, రేపు నెక్లెస్ రోడ్లులో కేఫ్ ప్రారంభం

Bandaru Satyaprasad HT Telugu
May 02, 2023 08:41 PM IST

Hyderabad Neera Cafe : హైదరాబాద్ వాసులు స్వచ్ఛమైన నీరా రుచి చూసేందుకు ఓ కేఫ్ ను ఏర్పాటుచేస్తున్నారు. బుధవారం నుంచి ఈ కేఫ్ అందుబాటులోకి రానుంది.

హైదరాబాద్ లో నీరా కేఫ్
హైదరాబాద్ లో నీరా కేఫ్ (Twitter )

Hyderabad Neera Cafe : భాగ్యనగర వాసులకు నిఖార్సైన నీరా రుచి చూపించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో బుధవారం నుంచి నీరా కేఫ్ అందుబాటులోకి రానుంది. రూ.12.20 కోట్ల వ్యయం నిర్మించిన నూతన నీరా కేఫ్ ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వాసులతో పాటు పర్యాటకుల కోసం ఈ నీరా కేఫ్‌ ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పల్లె వాతావరణం ప్రతిబించేలా ఆధునిక హంగులతో నిర్మించారు. నీరా కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ప్రారంభోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పలు జిల్లాల్లో నీరా కేఫ్ లు ఏర్పాటు

నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్‌తో పాటు వివిధ జిల్లాల్లో కూడా నీరా కేఫ్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్‌, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్గొండలోని సర్వేల్‌లో నీరా కేఫ్‌ల నిర్మాణాలకు ఒక్కో దానికి రూ.8 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ నీరా కేఫ్‌ల నిర్వాహణకు 300 మంది గీత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గీత కార్మికులు జీవితాలు మేరుగుపడ్డాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. 50 ఏళ్లు దాటిన గీత కార్మికులకు పింఛన్ అందిస్తున్నామన్నారు.

కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా

కల్లు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణిస్తే వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షలు పరిహారం, వైకల్యమైనవారికి రెండు నుంచి ఐదు లక్షల వరకు పరిహారం అందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత చెట్టు పన్ను రద్దు చేశామన్నారు. మూతపడ్డ నీరా దుకాణాలకు తిరిగి అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. కల్లు గీత కార్మికులకు పని కల్పించి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు నీరా కేఫ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గౌడన్నలకు వైన్‌షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కేటాయించామన్నారు.

గీత కార్మికులకు బీమా

రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తరహాలో కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని వారం రోజుల్లోనే అందించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపాందించాలని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు కేసీఆర్.

IPL_Entry_Point