Walk 10,000 Steps । ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవండి.. మీ ఆరోగ్యంలో అద్భుత మార్పులు!-walk 10000 steps a day miracles happen to your health check tips how to reach your daily routine ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walk 10,000 Steps । ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవండి.. మీ ఆరోగ్యంలో అద్భుత మార్పులు!

Walk 10,000 Steps । ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవండి.. మీ ఆరోగ్యంలో అద్భుత మార్పులు!

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 11:43 AM IST

Walking 10000 Steps A Day: ప్రతిరోజూ 10 వేల అడుగులు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనివలన ఎలాంటి మేలు కలుగుతుంది, రోజూ ఈ లక్ష్యాన్ని సులభంగా ఎలా పూర్తిచేయవచ్చో తెలుసుకోండి.

Walk 10,000 Steps Daily
Walk 10,000 Steps Daily (istock)

10000 Steps A Day: నడక అనేది చాలా సులభమైన వ్యాయామం. ఇందుకోసం మీరు జిమ్‌లో చేరాల్సిన అవసరం లేదు, మరే ఇతర ప్రత్యేక పరికరాలు కూడా అవసరం లేదు. మీ కాళ్లను నమ్ముకుంటే సరిపోతుంది. రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు 10,000 అడుగులు నడవడం అనేది నేడు ఒక పాపులర్ ఫిట్‌నెస్ ట్రెండ్. దీని వలన మీ ఫిట్‌నెస్‌, ఫ్లెక్సిబిలిటీ మెరుగుపడటమే కాకుండా శరీరంలోని దాదాపు ప్రతి భాగంపై సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది వివిధ పరిశోధనల్లో వెల్లడైంది.

చాలామంది ఇప్పుడు తమ స్మార్ట్‌వాచ్, ఇతర గాడ్జెట్లను ఉపయోగిస్తూ తాము రోజులో ఎన్ని వేల అడుగులు నడిచారు, ఎన్ని మెట్లు ఎక్కారు, ఎన్ని మైల్ స్టోన్లు పూర్తి చేశారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అది తమ కమ్యూనిటీకి తెలియజేస్తున్నారు.

Benefits of Walking 10000 Steps A Day- రోజూ 10 వేల అడుగుల నడకతో ప్రయోజనాలు

రోజుకి ఇలా 10 వేల అడుగులు నడవడం ద్వారా మీరు ఎలాంటి ప్రయోజనాలు ఆశించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

మీ ఊపిరితిత్తులను బలపరుస్తుంది

ప్రతిరోజూ 10000 అడుగుల నడక వల్ల మీ ఊపిరితిత్తులు, దాని చుట్టూ ఉండే కండరాలు బలోపేతం అవుతాయి. మీరు పీల్చే ఆక్సిజన్ రేటు పెరగడంతో పాటు దానిని సమర్థవంతంగా ఉపయోగించుకునే మీ శరీరం సామర్థ్యం పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది

ఈ రోజూవారీ వ్యాయామం మీ కండరాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ రవాణా మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీ గుండె కండరాలను బలపరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

మీ ఏకాగ్రతను పెంచుతుంది

ఈ రకమైన శారీరక శ్రమ మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల (ఎండార్ఫిన్‌లను) విడుదలను పెంచుతుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, దీని ఫలితంగా అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మీ ఏకాగ్రత, మీలో సృజనాత్మకత మెరుగుపడతాయి.

ఎముకలను బలపరుస్తుంది

మీ ఈ శారీరక శ్రమ మీ ఎముకలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది వాటి సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, తరువాతి కాలంలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కండరాలను కూడా నిర్మిస్తుంది, కండరాలలో బలాన్ని పెంచుతుంది.

రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది

మీరు శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడు, మీ కండరాలు మీ రక్తప్రవాహంలో గ్లూకోజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాయి, 24 గంటలలో ఇది మీ రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. మీ శరీరంలోని ఇన్సులిన్ మరింత సమర్ధవంతంగా పని చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు రోజూ 10000 అడుగులు నడకను లక్ష్యంగా పెట్టుకోవాలి.

తక్కువ రక్తపోటు

అధిక రక్తపోటును నివారించడానికి, రక్త ప్రసరణ సరిగ్గా జరగటానికి శారీరక శ్రమ ముఖ్యం. మీ రోజువారీ 10000 నడక రొటీన్ ఈ విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రక్తనాళాల సంకోచాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తం మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది.

Tips Walk 10000 Steps A Day- ఈ చిట్కాలు పాటించండి

ప్రతిరోజూ బిజీ షెడ్యూల్ కలిగిన వారు వ్యాయామం చేయడానికి సమయం సరిపోదు. వారు వివిధ రూపాల్లో నడకను ఎంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

-లిఫ్ట్‌కి బదులుగా మెట్లను ఎంచుకోండి.

- ఫోన్‌లో మాట్లాడుతూ అటూ ఇటూ నడవండి

- తక్కువ దూరాలకు వాహనాలకు బదులు నడకను ఎంచుకోండి

- భోజన విరామం తర్వతా కాసేపు నడవండి

- మీకు దూరంగా ఉన్న వాష్‌రూమ్‌ని ఉపయోగించండి

- కుక్కను నడకకు తీసుకెళ్లండి.

- స్నేహితుడితో కలిసి సాయంత్రం నడకకు వెళ్లండి

ఇలా చాలా రకాలుగా మీరు నడకను ఎంచుకోవడం ద్వారా సులభంగా 10000 అడుగుల నడకను పూర్తి చేస్తారు.