Ugadi Special Recipe : వేప పువ్వు చట్నీ.. వారం రోజులపాటు ఉంచినా పాడవదు-ugadi special recipe how to prepare neem flower chutney easy to make ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi Special Recipe : వేప పువ్వు చట్నీ.. వారం రోజులపాటు ఉంచినా పాడవదు

Ugadi Special Recipe : వేప పువ్వు చట్నీ.. వారం రోజులపాటు ఉంచినా పాడవదు

Anand Sai HT Telugu
Apr 07, 2024 11:00 AM IST

Neem Flower Chutney : తెలుగువారికి ఉగాది చాలా ప్రత్యేకమైన పండుగ. ఉగాది పచ్చడి చేసుకుని తాగుతారు. ఈ సమయంలో పిండి వంటలు చేస్తుంటారు. ఉగాది రోజున కొత్తగా వేప పువ్వు చట్నీ ట్రై చేయండి.

వేప పువ్వు చట్నీ
వేప పువ్వు చట్నీ (Unsplash)

Neem Flower Benefits : ఉగాది పండుగ చాలా ప్రత్యేకమైనది. కొత్త సంవత్సరం మెుదలవుతుంది. ఈరోజున ప్రత్యేకంగా పూజలు చేయడం ఆనవాయితీ. అంతేకాదు రకరకాల పిండి వంటు చేసుకుని తింటారు. ఉగాది తెలుగువారికి చాలా ఇష్టమైన పండుగ. కొత్తదనం, కొత్త ఉత్సాహం ఉంటుంది. ఉగాది అంటే వేప పువ్వు, బెల్లం, మామిడికాయ, చింతపండు.. ఇలా రకరకాల రుచులు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచి చేసే ఔషధాలు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ ఉగాదికి కొత్తరకం రెసిపీ ట్రై చేయండి. వేప పువ్వుతో చట్నీ చేయండి.

వేప చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వేప పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. అందుకే వేప పువ్వుతో చట్నీ ప్రయత్నించండి. కాస్త చేదుగా అనిపించినా మీ మెుత్తం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. వేప పువ్వు చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం..

వేప పువ్వు చట్నీకి కావాల్సిన పదార్థాలు

1/2 కప్పు వేప పువ్వు, 10 ఎండు మిరపకాయలు, కొంత చింతపండు (చిన్న నిమ్మకాయ సైజు), 1 టేబుల్ స్పూన్ బెల్లం, 1 టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు రుచికి తగ్గట్టుగా.

వేప పువ్వు చట్నీ తయారీ విధానం

ముందుగా ఒక మందపాటి అడుగున ఉన్న పాత్రను వేడి చేసి అందులో చేదు వేప పువ్వులను వేయించాలి. దీన్ని వేయించడానికి కొంత సమయం పడుతుంది. తక్కువ మంటలో కాసేపు వేయించుకోవాలి.

ఇప్పుడు ఒక ప్లేట్‌లో వేప పువ్వు ఉంచి, అదే పాత్రలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఎండు మిరపకాయలను 2-3 నిమిషాలు వేయించాలి.

తర్వాత ప్లేట్‌లో వేసి ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత ఉప్పు, బెల్లం, చింతపండు రసం వేసి చిక్కని చట్నీలా చేసుకోవాలి.

కావాలంటే కొబ్బరి తురుము వేసుకోవచ్చు. వేయించిన పప్పును కూడా వేసుకోవచ్చు. చింతపండుకు బదులుగా మామిడికాయను తీసుకోవచ్చు.

ఈ తయారైన చట్నీని మళ్లీ తాళింపు పెట్టుకోవచ్చు. లేదంటే అలా కూడా తినేయవచ్చు.

ఈ వేప పువ్వు చట్నీని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఒక నెల వరకు ఉపయోగించవచ్చు.

వేప పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు

వేప ఆకు చాలా చేదుగా ఉంటుంది. కానీ వేప పువ్వు చేదుగా ఎక్కువగా ఉండదు. ఈ పువ్వు తినడానికి వేరే రుచిగా ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే దీనిని ఎండబెట్టి లేదా తాజా పువ్వును కూడా ఉపయోగించవచ్చు. అలసట, కడుపులో నులిపురుగులు వంటి ఈ రకమైన సమస్యలను పరిష్కరించడంలో వేప పువ్వు సహాయపడుతుంది. ఇది చర్మ సమస్య, తలనొప్పికి సరిగా పని చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

వేప ఆకులతో సమానమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పువ్వు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని రక్తంలో మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. వేప ఆకు పువ్వు కడుపులోకి ప్రవేశించినప్పుడు, ఇది అలర్జీ, దురద సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. దురద, గాయం ఉంటే అది త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

వేప పువ్వును ఎండబెట్టి పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే పురుగులు వస్తాయి. ఈ పువ్వును తినడం వల్ల కడుపులో ఉండే పురుగులు పోతాయి. ఈ పువ్వును ఎండబెట్టి తేనెలో కలిపి నెలకోసారి పిల్లలకు ఇస్తే చాలా మంచిది. జీర్ణక్రియకు చాలా మంచిది. దీన్ని తింటే గొంతుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

Whats_app_banner