Neem Leaves: వేసవిలో వేప ఆకులను ఇలా ఉపయోగించండి, ఆ సమస్యలన్నీ దూరమవుతాయి
Neem Leaves: వేప ఆకులను చూడగానే ఎంతోమంది ముఖం ముడుచుకుంటారు. నిజానికి వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. వేసవిలో వేప ఆకులను ఉపయోగించడం ద్వారా కొన్ని అనారోగ్యాలకి దూరంగా ఉండవచ్చు.
Neem Leaves: వేప ఆకులు కాస్తా చేదు, తీపి కలిపిన రుచిని కలిగి ఉంటాయి. ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మండే వేసవిలో శరీరాన్ని చల్లబరచడం దగ్గర నుంచి రోగనిరోధక శక్తిని పెంచే వరకు వేప ఆకులు ఉపయోగపడతాయి. సాంప్రదాయ వైద్యంలో వేప ఆకులను శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. వేపాకుల నుంచి రసాన్ని తీసి ఆ రసాన్ని ప్రతిరోజూ తాగుతూ ఉండండి. గోరువెచ్చటి నీటిలో ఈ రసాన్ని కలుపుకొని తాగడం లేదా నేరుగా ఒక స్పూన్ రసాన్ని తాగినా చాలు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీలైతే వేపాకులను శుభ్రంగా కడిగి, నమిలి ఆ సారాన్ని మింగినా ఎంతో మంచిది. దీనిలో శీతలీకరణ గుణాలు ఎక్కువ. శరీరానికి వడదెబ్బ కొట్టకుండా ఇది కాపాడతాయి. వేసవి వేడి వల్ల శరీరంలో కలిగిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.
వేపాకుల రసంతో చర్మం మెరుపు
వేప ఆకులలో చేదు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్స్, మలినాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కాబట్టి వేప ఆకులను నమిలి ఆ సారాన్ని మింగడం లేదా వేపాకుల రసాన్ని తీసి తాగడం వంటివి చేస్తూ ఉంటే రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల మీ చర్మం మెరుపును సంతరించుకుంటుంది. రక్తం ఎంత స్వచ్ఛంగా ఉంటే ఆ మెరుపు మీ చర్మంలో కనిపిస్తుంది.
వేప ఆకుల సారాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో రకాల అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఈ వేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి వేసవి సమయంలో వచ్చే వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఈ వేపాకుల రసం శరీరానికి అందిస్తుంది.
చర్మానికి మేలు
చర్మానికి ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు వచ్చిన చోట వేప ఆకుల పేస్టును రాయడం ద్వారా త్వరగా నయం చేసుకోవచ్చు. వేపాకుల రసాన్ని తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే అజీర్ణం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు కూడా రాకుండా అడ్డుకుంటుంది. వేపాకుల రసం తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్లు ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ వేపాకుల సారాన్ని తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. వేపాకులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. దీనివల్ల గ్లూకోజ్ శోషణ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. కాబట్టి వేసవిలో ప్రతిరోజు వేపాకుల సారాన్ని తాగితే డయాబెటిస్ రోగం అదుపులో ఉంటుంది.
వేపాకులను ప్రతిరోజూ నమలడం వల్ల నోరు పరిశుభ్రంగా మారుతుంది. వేసవిలో నోటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. నోటి పూత, నోరు తడారి పోవడం వంటివి జరుగుతాయి. వేపాకులను నమలడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా అంతా బయటకు పోతుంది. చిగుళ్ళు, దంతాలు స్వచ్ఛంగా మారుతాయి. వేపాకులను నమలడం కష్టం అనుకుంటే వేపాకుల రసాన్ని తీసి ఒక రెండు స్పూన్లు గుటుక్కున మింగేయండి.
టాపిక్