Vegetarian Protein Foods । మీరు శాకాహారులా? అయితే ప్రోటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి!
Vegetarian Protein Foods: శాకాహారంలోనూ ప్రోటీన్ వనరులు ఉన్నాయి. మీరు ఈ శాకాహారులైతే ప్రోటీన్ ఆహారం కోసం ఇక్కడ పేర్కొన్న ప్రత్యామ్నాయ వనరులను కచ్చితంగా తీసుకోవాలి.
Plant-based Protein Foods: ఇటీవల కాలంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన ఏర్పడింది. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినేందుకు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
సమతుల్య ఆహారం (Balanced Diet) విషయానికి వస్తే ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. మన శరీరంలోని ప్రతి కణంలో ప్రోటీన్ ఉంటుంది. శరీరంలోని కణాలను సరిచేయడానికి, కొత్త వాటిని తయారు చేయడానికి మీ ఆహారంలో ప్రోటీన్ అవసరం. పిల్లలు, టీనేజ్, గర్భిణీ స్త్రీలలో పెరుగుదల, వారి అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. మాంసం తినేవారికి ప్రోటీన్ సులభంగా లభిస్తుంది. అయితే మనలో చాలా మంది శాకాహారులు ఉంటారు. కనీసం గుడ్డు కూడా తినని వారుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అవసరమయ్యే ప్రొటీన్ అందదు. అయితే శాకాహారంలోనూ ప్రోటీన్ వనరులు ఉన్నాయి. మాంసం తినని వారు తప్పకుండా ఈ ఆహార పదార్థాలను తినడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని జయించవచ్చు. ప్రోటీన్లు లభించే శాకాహార పదార్థాలేవో (Vegetarian Protein Sources) ఇక్కడ కొన్ని తెలుసుకోండి.
సోయాబీన్
చాలా మంది సోయాబీన్స్ తినడానికి ఇష్టపడరు. కానీ సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్లకు ఉత్తమ వనరులలో ఒకటి. USDA ప్రకారం, 100 గ్రాముల సోయాబీన్స్‌లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్లకు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకోవచ్చు. సోయా చిక్కుళ్లు లేదా సోయా పాలు వారానికి ఒకసారి తాగితే శరీరానికి కావలసిన ప్రొటీన్లు లభిస్తాయి.
తెల్లశనగలు
తెల్లశనగలు శాకాహార ప్రోటీన్లకు గొప్ప వనరు. వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంగా తినడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, దృఢంగా తయారవుతారు. తెల్లశనగలతో వివిధ రకాల రుచికరమైన వంటలు కూడా చేసుకోవచ్చు. 100 గ్రాముల వండిన చిక్‌పీస్‌లో సుమారు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
బుక్వీట్
బుక్వీట్ పిండిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ సూపర్‌ఫుడ్‌ను రోటీ, పాన్‌కేక్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, 100 గ్రాముల వండిన బుక్వీట్ లో 13.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
సబ్జా గింజలు
సబ్జా విత్తనాలు ఆవాల వలె కనిపిస్తాయి, ఈ చిన్నటి నల్లని విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 కూడా ఉంటాయి. వీటిలో సరిపడా ప్రోటీన్లు కూడా ఉంటాయి. USDA ప్రకారం, 100 గ్రాముల సబ్జా గింజల్లో 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని నానబెట్టుకోని వివిధ పానీయాలలో కలుపుకొని తీసుకోవచ్చు.
పప్పులు
పప్పులు, కాయధాన్యాలు కూడా గొప్ప ప్రోటీన్ వనరులు. ఈ పప్పులను వండేముందు నానబెట్టాలి (Soaked Pulses). ఆ తర్వాత వండుకొని తింటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ఇక 1 కప్పు పప్పులో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
పాల పదార్థాలు
డెయిరీ ఉత్పత్తులైన గ్రీకు యోగర్ట్, కాటేజ్ చీజ్ లలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. చిక్కటి గడ్డపెరుగును గ్రీక్ యోగర్ట్ అని చెప్పొచ్చు. వీటిలో ఒక కప్పుకు 14 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు.
మీరు ఈ శాకాహారులైతే ప్రోటీన్ ఆహారం కోసం ఇక్కడ పేర్కొన్న ప్రత్యామ్నాయ వనరులను కచ్చితంగా తీసుకోవాలి.
సంబంధిత కథనం