Teenage Girls | టీనేజ్ అమ్మాయిలు ఏం కోరుకుంటారు ?
13 నుండి 19 ఏళ్ళ వయసును టీనేజ్‌గా భావిస్తారు. ఈ తరుణంలో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలి.
స్థిరమైన భవిష్యత్తు నిర్మాణంలో యుక్త వయసు పాత్ర కీలకం. అమ్మాయిలు వయసు పెరిగే కొద్దీ వారిలో శారీరకంగా, మానసికంగా మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల ప్రభావం కారణంగా మార్పులు మొదలవుతాయి. కౌమార దశలో ఉన్న వారికి వీటిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ఎలాంటి భయాలు, అనుమానాలు లేకుండా ఉంటారు.
పీరియడ్స్ అంటే ఏంటి?
యుక్త వయసు రాగానే అమ్మాయిలలో రుతుస్రావం మొదలవుతుంది. ఈ విషయంపై వారికి అవగాహన అవసరం. ఈ మార్పు గురించి ఎవరికి చెప్పాలో అమ్మాయిలకు అర్థం కాదు. వారి స్నేహితుల కంటే కాస్త భిన్నంగా కనిపించే సరికి కంగారు పడుతూ.. లోలోపలే కుమిలిపోతుంటారు. అమ్మాయికి మీ దగ్గర చనువు ఉంటే.. అమ్మా పీరియడ్స్ అంటే ఏంటి? అని అడగ్గానే ఆ ప్రశ్నకు వివరంగా సమాధానం చెప్పాలే తప్ప ప్రశ్నను అణిచివేయకూడదు. ఇలాంటి విషయాలను అందరూ రహస్యంగా భావించడంతో అమ్మాయిలు వాటిని బయటకు చెప్పుకోడానికి భయపడుతుంటారు. దీంతో వారు మానసికంగా కుంగిపోయి చదువు మీద దృష్టి పెట్టలేరు. ఈ సమయంలోనే తల్లి తోడు చాలా ముఖ్యం. ఈ విషయాలపై అవగాహన పెంచుతూ వారికి అండగా నిలవాలి. టీనేజ్ రాగానే ఇలాంటి మార్పులు సహజమనే భావన వారిలో కల్పించాలి.
భవిష్యత్‌పై అలోచన
టీనేజ్ పిల్లలకు తల్లిదండ్రుల నిరంతర మార్గదర్శకత్వం అవసరం. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడం మంచిదే కానీ అది వారి భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేసేలా కాదు. వారికి తగిన స్వేచ్ఛను ఇవ్వడం వల్ల భవిష్యత్‌పై అవగాహన వస్తుంది. అయితే ఈ విషయం వ్యక్తికి.. వ్యక్తికి మారుతూ ఉంటుంది. పరిణతి, వారికి కుటుంబం నుండి లభించే మద్దతు, వారి గత అనుభవాలు, స్వేచ్చను ఇచ్చిన పరిస్థితిలో వారు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
తల్లిదండ్రుల భరోసా
ఈ సమయంలో కుటుంబం నుంచి ప్రోత్సాహం అవసరం. బయట ఎదుర్కొంటున్న ఇబ్బందులను కుటుంబంతో స్వేచ్చగా చెప్పగలగాలి. కుటుంబం నుంచి ఆప్యాయత అందాలి. ఎంత బిజీగా ఉన్నా వారి కోసం సమయం కేటాయించాలి. చిన్నతనంలో మీరు వారితో ఎంత ఫ్రీగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఆటలాడాలి. బయటకు వెళ్ళాలి. బుక్స్ చదవాలి. సినిమాలను కలిసి చూడాలి.
గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన
అమ్మాయిల మీద ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ముఖ్యంగా బంధువులు, చుట్టుపక్కల వారు, తెలిసిన వాళ్ల చేతిలోనే అఘాయిత్యాలకు గురవుతున్నారు. అందుకే అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి. ఎంత వరకు సేహ్నంగా ఉండాలనేది వివరించాలి. టీచర్స్, లెక్చరర్స్ తమ పట్ల ఎలా ఉంటున్నారో పిల్లలు గమనించేలా చూడాలి.
సంబంధిత కథనం