Summer Breakfast । వేసవిలో బ్రేక్‌ఫాస్ట్ అంటే మినిమం ఇలా ఉండాలి!
Summer Breakfast Ideas: వేసవిలో బ్రేక్‌ఫాస్ట్ గా ఎలాంటి అల్పాహారాలు తీసుకోవచ్చో ఆరోగ్య నిపుణుల కొన్ని సూచనలు ఇక్కడ తెలుసుకోండి.
Summer Breakfast Ideas: ఎండకాలంలో సూర్యుడు త్వరగా ఉదయిస్తాడు, తన ప్రతాపాన్ని చూపిస్తాడు. వేడిని తట్టుకునేందుకు మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈ వేసవిలో నూనెలు, మసాలాలు ఎక్కువ ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. ఇది మిమ్మల్ని నీరసంగా మార్చడమే కాకుండా శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్‌గా ఉంచే ఆహార పానీయాలను (Hydrating Drinks) తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఘన పదార్థాల కంటే కూడా వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. నీటి శాతం సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు (Water-rich foods) తీసుకోవాలి. ఇవి శరీరానికి నీటితో పాటు పోషకాహారాన్ని అందిస్తాయి. మీరు వేసవిలో బ్రేక్‌ఫాస్ట్ గా ఎలాంటి అల్పాహారాలు తీసుకోవచ్చో ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేశారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
Curd Rice- పెరుగు అన్నం
మీరు ఈ వేసవిలో ప్రత్యేకంగా అల్పాహారాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అన్నం, కొంచెం పెరుగు కలిపి పెరుగన్నం చేసేయండి. ఇది వేసవికాలంలో చాలా తేలికైన ఆరోగ్యకరమైన అల్పాహారం. వేడిని అధిగమించడానికి పెరుగు అన్నం అన్నింటికంటే ఉత్తమం. మీరు పెరుగన్నంలో మరింత రుచికోసం జీలకర్ర, ఆవాలు, ఎర్ర మిరపకాయ, శనగపప్పు, మినపపప్పు మొదలైన మసాలా దినుసులతో పోపు వేసుకోవచ్చు. ఇందులోనే కొన్ని అల్లం, కొత్తిమీర తరుగు వేసి ఉప్పు చల్లుకుంటే రుచిగా ఉంటుంది. కడుపుకు చల్లగా ఉంటుంది, అజీర్తికి కూడా చాలా మంచిది.
Vegetable Salad- వెజిటబుల్ సలాడ్
సలాడ్ అంటే కేవలం భోజనం తర్వాత తినేదే కాదు, ఇదే ఒక భోజనం కూడా. అప్పుడప్పుడు సలాడ్స్ తినడం చాలా మంచిది. వేసవికాలంలో, ఉదయం వేళలో వెజిటెబుల్ సలాడ్ అద్భుతమైన అల్పాహారం. ఇది మీ ఆకలిని తీర్చుతుంది, శక్తిని అందిస్తుంది. మిమ్మల్ని హైడ్రేట్ కూడా చేస్తుంది. క్రంచీ సీజనల్ వెజిటేబుల్స్ సలాడ్ లో చేర్చుకోవాలి. పాలకూర, బ్రోకలీ, పచ్చి ఉల్లిపాయలు, పెసర్ల మొలకలు వంటివి పుష్కలంగా తీసుకోవచ్చు. దీనితో పాటుగా పుచ్చకాయ ముక్క, సీతాఫలం, బొప్పాయి వంటి మీకు నచ్చిన పండును తింటూ ఆనందించండి.
Oats Attu- ఓట్స్ అట్టు
ఒట్టు.. నిజంగానే వేసవిలో ఓట్స్ అట్టు ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం. రాత్రంతా నానబెట్టిన ఓట్స్‌లో శనగపిండిని కలిపి అందులో కొద్దిగా పుదీనా, కరివేపాకు తరుగు వేసుకొని అట్టుపోసుకొని తినండి, ఎంత ఆరోగ్యకరమో నమ్మండి.
Poha- అటుకులు
అటుకులు ఒక సాధారణ, ఆరోగ్యకరమైన అల్పాహారం. వేసవిలో అల్పాహారంగా పోహా తినండి. ఇందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, వేరుశనగ, కొత్తిమీర వంటివి చల్లితే ఎంతో రుచికరమైన అల్పాహారం సిద్ధం అవుతుంది.
Buttermilk - మజ్జిగ
వేసవిలో కొన్నిసార్లు ఏదీ తినాలని అనిపించదు. ఇటువంటి సమయంలో మిమ్మల్ని రిఫ్రెష్ చేసే పానీయం మజ్జిగ. కొద్దిగా పెరుగు, కొన్ని నీళ్లు కలిపి మజ్జిగ చేయండి. అందులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, చాట్ మసాలా వేసి బాగా కలపండి. పైనుంచి కరకరలాడే బూందీ, పుదీనా ఆకులు చల్లండి. ఉదయం అల్పాహారంగా ఇలా ట్రై చేయండి.
సంబంధిత కథనం