Deskfast Ideas । ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదా? అయితే డెస్క్‌ఫాస్ట్ చేయండి!
Deskfast Ideas: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసేంత సమయం ఉండటం లేదా? అయితే మీ కార్యాలయంలో లేదా మీరు పనిచేసే డెస్క్ వద్దనే అల్పాహారం తీసుకోండి. ఇక్కడ కొన్ని ఐడియాలు చూడండి..
Breakfast To Deskfast: మనలో చాలా మందికి ఉదయం పూట అస్సలు తీరిక ఉండదు. పనికి ఆలస్యం అవుతుందనే తొందరలో కనీసం బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) చేయకుండానే వెళ్లిపోతుంటారు. ఇప్పటికీ చాలా మంది వర్క్ ఫ్రమ్ చేస్తున్నవారూ ఉన్నారు, వారికి కూడా వేళకు ఆహారం తీసుకునే తీరిక ఉండటం లేదు. అయితేనేం మీరు పనిచేసే డెస్క్ వద్దనే మీరు ఉదయం చేయాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌ను చేసేయండి. దీనినే ఇప్పుడు ట్రెండీగా డెస్క్‌ఫాస్ట్ (Deskfast) అని పిలుస్తున్నారు.
ప్రతిరోజూ ఇమెయిల్‌లు, డెడ్‌లైన్లు, టార్గెట్లు అంటూ పరుగెత్తే ఈ వేగవంతమైన జీవితంలో వర్క్ డెస్క్‌లపై భోజనం చేయడం ఇప్పుడు సరికొత్త వర్కింగ్ స్టైల్‌గా మారింది. వర్క్ టేబుల్‌పై అల్పాహారం తినడం అనేది ఇప్పుడు చాలా సాధారణమైన ట్రెండ్. మీరు కూడా తీరికలేని వ్యక్తి (Busy Working Professional) అయితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే, మీ కార్యాలయంలో డెస్క్‌ఫాస్ట్ చేయడాన్ని మర్చిపోకండి. శాండ్‌విచ్, స్మూతీ లేదా నట్స్ -డ్రైఫ్రూట్స్ ఏదైనా కావచ్చు, నిద్రలేచిన తర్వాత మీ శరీరానికి శక్తిని, పోషకాలను అందించేంది మీరు రోజులో ఉదయం తీసుకునే అల్పాహారమే.
Quick Deskfast Recipes and Ideas- డెస్క్‌ఫాస్ట్ రెసిపీలు
మీరు సూపర్ ఫాస్ట్‌గా సిద్ధం చేసుకొని, మీ డెస్క్ వద్ద తినగలిగే కొన్ని అల్పాహారాల రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం చూడండి.
ఫ్రూడ్ సలాడ్
మమిడి, అరటి, సపోటా, బొప్పాయి, స్ట్రాబెర్రీ వంటి మీకు నచ్చిన పండ్లను తీసుకొని, అన్నింటిని శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసుకోండి, వాటి గింజలను తొలగించండి. ఒక మిక్సింగ్ గిన్నెలో కట్ చేసిన పండ్లముక్కలు తీసుకొని, పైనుంచి కొన్ని దానిమ్మ గింజలను, కట్ చేసిన కాజు, పిస్తా, బాదం వంటి నట్స్ ను చల్లండి, ఆపైన తేనె చిలకరించండి. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఫ్రూడ్ సలాడ్ రెడీ.
శాండ్‌విచ్
రెండు బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటికి వెన్న రాయండి. ఆపై కొద్దిగా టొమాటో సాస్, ఒక టీస్పూన్ వెజ్ మయోనైస్ అప్లై చేయాలి. ఒక దోసకాయను వృతాకారంలో ముక్కలుగా కట్ చేసుకొని ఒక బ్రెడ్ మీద పెట్టుకోవాలి. ఆపై రుచికోసం వాటిపైన మిరియాల పొడి, ఉప్పు చల్లుకోవాలి. చివరగా మరో బ్రెడ్ ముక్కతో కప్పేస్తే, శాండ్‌విచ్ రెడీ. ఈ రెండు బ్రెడ్ల మధ్య మీరు మరిన్ని కూరగాయలు లేదా గుడ్లు లేదా ఒక ఆమ్లెట్ ఉంచి తినొచ్చు.
అవకాడో టోస్ట్
ముందుగా మీడియం మంట మీద తవాను వేడి చేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆ తర్వాత రెండు బ్రెడ్ ముక్కలను వేసి బంగారు గోధుమ రంగు వచ్చేంతవరకు టోస్ట్ చేయండి. ఇప్పుడు పండిన అవకాడోను తీసుకొని దానిని సగానికి కట్ చేయండి. అందులో గింజను తీసేయండి. అవకాడో గుజ్జుకు గాట్లు పెట్టి ఉప్పు, కారం చల్లుకుంటూ ఒక ముద్దగా నూరుకోండి. బ్రెడ్ టోస్టులపైన అవకాడో మిశ్రమం అద్దుకుంటే సరిపోతుంది. అవకాడో టోస్ట్ రెడీ.
ఓట్స్ పోరిడ్జ్
ఒక కడాయిని దానిలో నెయ్యివేసి, బాదం ముక్కలను వేయించాలి. అవి వేగిన తర్వాత, అందులోనే ఓట్స్ వేసి 3 నుంచి 4 నిమిషాలు వేయించాలి. ఆ వెంటనే పాలు పోసి దానిని 5 నుంచి 6 నిమిషాలు మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి దానిని కాస్త చల్లారనివ్వాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని తేనె, మీకు నచ్చిన పండ్లను వేసి కలుపుకోవాలి. అంతే ఓట్స్ పోరిడ్జ్ రెడీ.
పోహా
అటుకులను నీటిలో కడిగి, ఆపైన ఆ నీటిని వడకట్టి కాసేపు పక్కనపెట్టండి. అనంతరం ఒక పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు, పప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు వేసి వేయించండి. ఆపైన నానబెట్టిన అటుకులు వేసి, కొద్దిగా ఉప్పు వేసి అన్నీ కలిపేయండి, పోహా రెడీ.
ఎగ్ చాట్
ఒక గిన్నెలో టొమాటో కెచప్, చిల్లీ సాస్, నిమ్మరసం, వేయించిన జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ చట్నీ లాగా కలపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో ఉడికించిన గుడ్లను ముక్కలుగా కట్ చేసి, వాటిపై ఇదివరకు చేసుకున్న చట్నీని చల్లండి. ఆపైన తరిగిన స్ప్రింగ్ ఆనియన్, గరం మసాలా , కారా బూందీని చల్లుకోండి. అంతే రుచికరమైన ఎగ్ చాట్ సిద్ధమైనట్లే.
సంబంధిత కథనం