Khara Pongal Recipe । ఖారా పొంగలి.. సంక్రాతి పండగకి సాంప్రదాయమైన అల్పాహారం!
Khara Pongal Recipe: సంక్రాంతి పండగకి తప్పకుండా చేసుకునే అల్పాహారంలో పొంగలి ముఖ్యమైనది. రుచికరంగా ఖారా పొంగలి ఎలా చేయవచ్చో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
సంక్రాంతి పండగ అంటేనే తెలుగు వారి సాంప్రదాయాలను చాటే పెద్ద పండగ. ఈ పర్వదినం సందర్భంగా పలు రకాల పిండి వంటలు ప్రత్యేకంగా చేసుకుంటారు. అలాగే సంక్రాంతి సందర్భంగా తప్పకుండా చేసుకోవాల్సిన అల్పాహారం పొంగలి. ఈ పొంగలిని రెండు రకాలుగా చేస్తారు, ఈ రెండింటిలో బెల్లంతో చేసేది తీపి రుచిని కలిగి ఉంటుంది. మరొక దానిని కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, ఇంగువ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి చేస్తారు, దీనినే ఖారా పొంగలి అంటారు. ఖారా పొంగలి ఎంతో రుచికరమైన అల్పాహారం. దేవాలయాలు, పండగలు, ప్రత్యేకమైన రోజుల్లో ఈ అల్పాహారాన్ని తప్పకుండా చేసుకుంటారు, దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు.
పొంగలి దక్షిణ భారతదేశ ప్రత్యేకమైన రెసిపీ. దీనినే తమిళంలో వెన్ పొంగల్ అని పిలుస్తారు. ఇక్కడ వెన్ అంటే తెలుపు కాగా, పొంగల్ అంటే ఉప్పొంగేది అనే అర్థం వస్తుంది. మరి ఈ సంక్రాంతి పర్వదినాన రుచికరమైన ఖారా పొంగలి రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. ఇక్కడ పేర్కొన్న సూచనల ప్రకారం, సులభంగా ఈ అల్పాహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
Khara Pongal Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బియ్యం (లేదా ఏదైనా - మిల్లెట్లు, ఓట్స్, క్వినోవా)
- 1/2 కప్పు పెసరిపప్పు
- 3 టేబుల్ స్పూన్లు నెయ్యి
- 1 స్పూన్ నల్ల మిరియాలు
- 1 పచ్చి మిర్చి
- 1 అంగుళం అల్లం
- 1 స్పూన్ జీలకర్ర
- 7-8 జీడిపప్పు
- 1 రెమ్మ కరివేపాకు
- చిటికెడు ఇంగువ
- 1/2 టీస్పూన్ ఉప్పు
ఖారా పొంగలి రెసిపీ - తయారీ విధానం
1. ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేడి చేసి, ఆపై బియ్యం, పెసరిపప్పు వేసి 2-3 నిమిషాలు వేయించాలి.
2. ఇప్పుడు ఇందులో 3-4 కప్పుల నీరు పోయండి, అలాగే ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ గా ఉడికించాలి.
3. మరొక బాణలిలో మరికొంచెం నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము, ఇంగువ వేసి 1 నిమిషం పాటు వేయించాలి.
4. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో ఉడికించిన పొంగలిని ఒక గిన్నెలోకి తీసుకొని, పైనుంచి ఇంతకు ముందు వేయించిన పోపును వేసి కలపాలి.
అంతే ఘుమఘుమలాడే ఖారా పొంగలి రెడీ. చట్నీ లేదా సాంబార్‌తో వడ్డించుకొని వేడివేడిగా పొంగలి రుచిని ఆస్వాదించండి. పండగను ఆనందంగా జరుపుకోండి. సంక్రాంతి శుభాకాంక్షలు!
సంబంధిత కథనం