Raw Banana Bonda। తక్కువ మైదాతో అరటికాయ బోండా, రెసిపీ ఇదిగో!
Raw Banana Bonda Recipe: మైసూర్ బజ్జీలకు అరటికాయతో ట్విస్ట్ ఇస్తే అదిరిపోయే రుచి ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
కొన్ని వంటకాలను మనం ఉదయం అల్పాహారంగా తినవచ్చు, సాయంత్రం స్నాక్స్ లాగా ఆస్వాదించవచ్చు, అలాగే టిఫిన్ లాగా చేసి రాత్రి భోజనాన్ని ముగించవచ్చు. అలాంటి అల్పాహారాలు ఏముంటాయి అంటే.. ఇడ్లీ, దోశ, ఉప్మాలతో పాటు చాలా మందికి ఫేవరేట్ అయిన మైసూర్ బోండా కూడా ఉంటుంది. ఈ చలికాలంలో వేడి వేడి మైసూర్ బోండాలు తింటే వెచ్చగా, గమ్మత్తుగా అనిపిస్తుంది. మైసూర్ బోండాలు, పునుగులు చాలా రుచికరంగా ఉంటాయి. అయినప్పటికీ ఇవి పూర్తిగా మైదాపిండితో చేసిన ఆయిల్ ఫుడ్ కాబట్టి, తినాలని ఇష్టం ఉన్నా.. తినేందుకు వెనకకడుగు వేస్తారు. అయితే మైదాపిండి పరిమాణాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన పదార్థాలను జోడించి సరికొత్తగా బోండాలు ఎలా చేసుకోవాలో ఆ రెసిపీని మీకు ఇప్పుడు ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
మీరు అరటికాయ బజ్జీలు, అరటికాయ కూర తినే ఉంటారు. మరి ఎప్పుడైనా అరటికాయ బోండాలు తిన్నారా? ఈ అరటికాయ బోండాలు కూడా చూడటానికి నోరూరించేలా, తింటే రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది చాలా సింపుల్ రెసిపీ. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఆలస్యం చేయకుండా అరటికాయ బోండాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా మరీ..
Raw Banana Bonda Recipe కోసం కావలసిన పదార్థాలు
- అరటికాయ 250 గ్రాములు
- 150 గ్రా ఉల్లిపాయ
- 3 టేబుల్ స్పూన్లు మైదా
- పసుపు 1 tsp
- కాశ్మీరీ మిరప పొడి 1 tsp
- గరం మసాలా 1 tsp
- బ్రెడ్ పౌడర్ 25 గ్రా.
- 1/4 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర
- అవసరమైనంత ఉప్పు.
- వేయించడానికి సరిపడా నూనె
అరటికాయ బోండాలు తయారు చేసే విధానం
1. ముందుగా అరటిపండును రెండు ముక్కలుగా కట్ చేసి ఆవిరి మీద ఉడికించాలి
2. ఉడికిన అరటిపండు తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసుకొని, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి బాగా కలపాలి
3. ఆ తర్వాత గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
4. ఈ మిశ్రమంలో బ్రెడ్ పౌడర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పిండిలా చేసుకోవాలి.
5. మరోవైపు మైదా పిండిని కూడా నీళ్లతో కలిపి మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి
6. ఇప్పుడు ఈ పిండి బంతులను బ్రెడ్ పౌడర్‌లో ముంచి, నూనెలో వేయించాలి.
7. బోండాలు నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండుసార్లు వేయించాలి, ఇలా వేయించిన బోండాలను గిన్నెలోకి తీసుకోవాలి.
అంతే, అరటికాయ బోండాలు రెడీ. వీటిని టొమాటో చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
సంబంధిత కథనం