Ration Rice Smuggling : రేషన్ బియ్యం స్మగ్లింగ్ లో కదులుతున్న డొంక, తెరపైకి కీలక నేతల పేర్లు!
Ration Rice Smuggling : ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై వైసీపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కాకినాడ పోర్టు రేషన్ బియ్యం పట్టివేతలో ద్వారంపూడి పేరు వినబడగా...తనకు సంబంధంలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. గోదాములో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో పేర్ని నాని కుటుంబం పేరు తెరపైకి వచ్చింది.
Ration Rice Smuggling : ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ తీవ్ర కలకలం రేపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న.. రేషన్ బియ్యం అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటిపోతుంది. ఇటీవల కాకినాడ పోర్టులో స్టెల్లా నౌకలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడడంతో రైస్ మాఫియా గుట్టు రట్టైంది. ఈ విషయంపై తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యం తరలిస్తు్న్న నౌకను సీజ్ చేయమని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టి ఈ నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉందని నిర్థారించారు. పోర్టులో ఎక్స్ పోర్టుకు సిద్ధంగా ఉన్న 12 వేల టన్నుల బియ్యంను సైతం తనిఖీ చేసిన తర్వాత ఎగుమతి అనుమతి ఇస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. పీడీఎస్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ పేరిట ఎగుమతి అవుతున్నట్లు గుర్తించామన్నారు. వీటిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడినప్పుడు...అధికార పక్షం నేతలు వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. గతంలో ప్రభుత్వంలో కాకినాడ పోర్టు అడ్డాగా రేషన్ మాఫియా సాగిందని విమర్శలూ ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్...ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ద్వారంపూడి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టాక...కాకినాడ పోర్టుపై ఫోకస్ పెట్టింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టింది. ఇటీవల సిట్ ను సైతం ఏర్పాటు చేసింది. అయితే అధికారుల ప్రమేయం లేకుండా వేల టన్నుల రేషన్ బియ్యం పోర్టు దాటి పోవన్న విమర్శలు ఉన్నాయి.
రేషన్ బియ్యం అక్రమ రవాణాతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. తాను బియ్యం వ్యాపారం చేయడంలేదని, తన తమ్ముడు బియ్యం ఎగుమతి వ్యాపారంలో ఉన్నారన్నారు. అయితే రేషన్ బియ్యం వ్యవహారంలో ఎమ్మెల్యే కొండబాబు హస్తం ఉందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే కాకినాడలోని గోదాముల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం అయ్యిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు విచారణ జరుపుతున్నాయి.
పేర్ని జయసుధ గోదాములో బియ్యం మాయం
రేషన్ బియ్యం వ్యవహారం ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని వైపు తిరిగింది. ఆయన కుటుంబంపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో పేర్ని నాని దంపతులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పేర్ని నానికి కుటుంబానికి చెందిన జేఎస్ గోదాములో బియ్యం స్టాక్స్ తగ్గిందని, మూడు వేల బ్యాగుల రేషన్ బియ్యం షార్టేజి వచ్చిందని, వేబ్రిడ్జ్ లో పొరపాటు వల్ల ఇలా జరిగిందని జె.ఎస్. గోడౌన్ వారు లేఖ రాశారు. గోడౌన్ లో మాయమైన బియ్యానికి ఎంత విలువైతే అంత డబ్బులు చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు. మాయమైన బియ్యానికి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారుల నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన నాని కుటుంబం విడతల వారీగా డీడీలు అధికారులకు పంపారు. గోదాంలో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పేర్ని జయసుధ గోదాములో మొత్తం 4840 బియ్యం బస్తాలు మాయం అయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం అయ్యిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు విచారణ జరుపుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని, అయితే బియ్యం మాయంపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. జేఎస్ గోడౌన్ పై అనుమానాలు ఉన్నాయని అన్నారు.
అయితే రేషన్ బియ్యం వ్యవహారం వైసీపీ నేతల చుట్టూ తిరుగుతోంది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్, గోదాములో బియ్యం మాయంలో వైసీపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ దర్యాప్తులో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయో వేచిచూడాలి.
సంబంధిత కథనం