Makara Sankranti 2023 । భోగి, మకర సంక్రాంతి, కనుమ తేదీలు.. పుణ్యకాలం, పూజా విధానాలు ఇవిగో!
Makara Sankranti 2023: ఈ 2023 సంవత్సరంలో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ఏ తేదీలలో జరుపుకుంటున్నాం, పుణ్యకాలం, పూజా విధానం మొదలనైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
Makara Sankranti 2023: మకర సంక్రాంతి అత్యంత పవిత్రమైన హిందూ పండుగలలో ఒకటి, ఇది మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకొనే వ్యవసాయ పండగ. సూర్యుడు మకరరాశి లోకి మారిన రోజున మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ప్రతీ ఏడాది జనవరి నెలలో ఒక నిర్ధిష్ట తేదీకి వచ్చే ఈ పండుగ ఈ 2023 సంవత్సరంలో మాత్రం జనవరి 15న వస్తుంది. ఈ సంవత్సరం సూర్య భగవానుడు జనవరి 14వ తేదీ రాత్రి 8:45 తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇది సూర్య భగవానుడికి అంకితం ఇచ్చే పండగ, అందువల్ల ఆ మర్నాడు సూర్యోదయం తర్వాత జనవరి 15న ఆదివారం రోజు సంక్రాంతి పండగ జరుపుకుంటున్నాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెట్టిన ఈరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
సంక్రాంతి పండుగ మొదటి రోజును భోగి అని పిలుస్తారు అది జనవరి 14, 2023 జరుపుకుంటున్నాం, రెండో రోజు జనవరి 15 మకర సంక్రాంతి కాగా, మూడవ రోజు కనుమ పండుగను జనవరి 16, 2023న జరుపుకుంటారు.
మకర సంక్రాంతి 2023 తిథి, పుణ్యకాలం
మకర సంక్రాంతి పండుగ ఆదివారం, జనవరి 15, 2023 న వస్తుంది. దృక్ పంచాంగ్ ప్రకారం, సంక్రాంతి తిథి జనవరి 14న, రాత్రి 8:57 గంటలకు ప్రారంభం అవుతుంది. మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15 ఉదయం 7:15 నుండి సాయంత్రం 5:46 వరకు ఉంటుంది. మొత్తం వ్యవధి - 10 గంటల 31 నిమిషాలు. మకర సంక్రాంతి మహా పుణ్యకాలం ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై ఉదయం 9:00 గంటలకు ముగుస్తుంది, వ్యవధి - 1 గంట 45 నిమిషాలు. ఈ కాలంలో చేసే దానాలు గొప్ప ప్రయోజనకరంగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
మకర సంక్రాంతి పూజా విధానం
మకర సంక్రాంతి రోజున తెల్లవారుజామునే లేచి, దగ్గరలోని పవిత్ర నదికి వెళ్లి స్నానం చేయాలి. సూర్య భగవానుణ్ని ప్రార్థించాలి. పురాణ శాస్త్రల ప్రకారం, మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో నల్ల నువ్వులు, బెల్లం, ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు, అక్షత మొదలైన వాటిని ఉంచి, ఆపై 'ఓం సూర్యాయ నమః' అనే మంత్రాన్ని పఠిస్తూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్య సమర్పణతో పాటు, ఈ రోజున శని దేవుడికి కూడా అర్ఘ్యం సమర్పించడం, పేదలకు దానాలు చేయడం వలన గ్రహ దోషాలు కొంతమేర తొలగుతాయి.
మకర సంక్రాంతి రోజున నీళ్లలో నల్ల నువ్వులు, గంగాజలం కలిపి స్నానం చేయాలి. దీని వలన సూర్యుని అనుగ్రహం పొంది, జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల సూర్యుడు, శని గ్రహాల ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజున సూర్యుడు తన కుమారుడైన శని గృహమైన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.
సంక్రాంతి పండగ భారతదేశం అంతటా వివిధ పేర్లతో జరుపుకుంటారు. పవిత్ర నదీ జలాల్లో స్నానాలు చేస్తారు, పేదలకు దానధర్మాలు చేస్తారు, గాలిపటాలు ఎగురవేస్తారు, నువ్వులు, బెల్లంతో చేసిన మిఠాయిలను తయారు చేస్తారు, పశువులకు పూజ చేస్తారు, ఇంకా స్థానికంగా ఎన్నో ఉత్సవ పోటీలు నిర్వహిస్తారు.
సంబంధిత కథనం