Sankranti- Kites Flying | సంక్రాంతికి పతంగులను ఎందుకు ఎగరవేస్తారు? దాగి ఉన్న మర్మం ఇదే!-why do people fly kites during makar sankranti know the importance ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Do People Fly Kites During Makar Sankranti, Know The Importance

Sankranti- Kites Flying | సంక్రాంతికి పతంగులను ఎందుకు ఎగరవేస్తారు? దాగి ఉన్న మర్మం ఇదే!

Manda Vikas HT Telugu
Jan 08, 2023 09:36 AM IST

Makara Sankranti 2023- Kites Flying: సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పందాలు, తమిళనాడులో జల్లికట్టులు నిర్వహించడం చాలా ఫేమస్. ఇలాగే చాలా చోట్ల సంక్రాంతి పండగకు గాలిపటాలు ఎగరవేయడం కూడా సాధారణమే. గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ ప్రాంతాల్లో భారీ ఎత్తున ‘కైట్ ఫెస్టివల్స్’ నిర్వహిస్తారు.

Makar Sankranti- Kite Festival
Makar Sankranti- Kite Festival (AFP)

Makara Sankranti 2023: సంక్రాంతి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన వ్యవసాయ పండగ. భారతదేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ పండగను జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలను బట్టి పండగ సాంస్కృతిక ప్రాముఖ్యత, నిర్వహించే కార్యక్రమాలు విభిన్నంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతిని అతిపెద్ద పండగగా జరుపుకుంటారు. తెలంగాణలో కూడా దసరా తర్వాత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పండుగ సంక్రాంతే.

తమిళనాడులో పొంగల్, పంజాబ్ రాష్ట్రంలో లోహ్రి, గుజరాత్ లో ఉత్తరాయన్, అస్సాంలో బిహు, ఝార్ఖండ్ లో సక్రాతి.. ఇలా ప్రాంతాలను ఈ పండగను ఏ పేరుతో జరుపుకున్నా, అన్ని చోట్లా ప్రతీ ఏడాది ఒకే తేదీన జరుపుకోవడం సంక్రాంతి పండగ విశిష్టత.

సాధారణంగా ప్రతీ ఏడాది నూతన సంవత్సరంలో జనవరి 14వ తేదీన సంక్రాంతి పండగను జరుపుకోవడం ఆనవాయితి. సంక్రాంతి అంటే నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ఈ సంక్రమణ జరిగే రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పందాలు, తమిళనాడులో ఎద్దుల పోటీ (జల్లికట్టు) లు నిర్వహించడం చాలా ఫేమస్. ఇలాగే చాలా చోట్ల సంక్రాంతి పండగకు గాలిపటాలు ఎగరవేయడం కూడా సాధారణమే. గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ ప్రాంతాల్లో భారీ ఎత్తున ‘కైట్ ఫెస్టివల్స్’ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా విభిన్న ఆకృతులతో కూడిన పతంగులు ఎగరవేయడం, అత్యంత ఎత్తులోకి ఎగరవేయడంతో మాంజా దారాలతో పతంగులను తెంపే పోటీ విశేషంగా ఆకర్షిస్తాయి.

తెలంగాణలో ఇళ్ల డాబాలపైన డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకొని. పతంగులను ఎగరవేస్తూ 'కీంచ్ కట్.. డీల్ మార్' వ్యూహాలతో ఒక్కో పతంగిని తెంపుతూ ఫుల్ జోష్ లో జరిగే కైట్ ఫైట్స్ మంచి హుషారును పంచుతాయి.

మరి సంక్రాంతికి ఈ పతంగులు ఎగరవేసే సంప్రదాయం ఎప్పట్నించి వచ్చింది, అసలు పతంగులను ఎందుకు ఎగరవేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఎగరవేస్తారో ఇక్కడ తెలుసుకోండి.

Sankranti - Importance of Kites Flying

సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులు ఎగరవేసే సంప్రదాయం కొన్ని వేల ఏళ్ల నుంచే ఉన్నట్లు చరిత్ర ఆధారాలున్నాయి. పతంగులు ఎగరేయడానికి గల కచ్చితమైన కారణాలు ఏమి లేకపోయినా, కొన్ని బలమైన వాదనలు ఉన్నాయి. అవేంటంటే..

సంక్రాంతికి పతంగులను ఎగరవేయడం వెనక ఉన్న మర్మం..

  • సంక్రాంతి ఒక వ్యవసాయ పండగ. వర్షాలు కురవాలన్నా, పంటలు సమృద్ధిగా పండాలన్నా ఒక విధంగా సూర్యుడే మూలం. కాబట్టి సూర్య భగవానునికి అభివాదం తెలుపుతూ పతంగులను ఎగరవేస్తారు.
  • ఉదయపు సూర్య కిరణాలు శరీరాన్ని తాకితే ఆరోగ్యకరం, విటమిన్ డి అందుతుంది. ఎండ వేడిమి అనేక రకాల చర్మ సమస్యలు, సీజనల్ వ్యాధుల నుండి కాపాడుతుంది. కాబట్టి మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరానికి తాకితే వాటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకోసం ఆడపిల్లలు ఆరుబయట రంగవల్లులు వేసే సంప్రదాయం, మగవారు గాలి పటాలు ఎగరవేసే సంప్రదాయం తీసుకువచ్చినట్లు మరొక వాదన ఉంది.
  • పండగ అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవాలి. హిందూ పండగల్లో ఇలా ఉత్సాహాన్ని నింపే ఏదో ఒక అంశం ఉంటుంది. అలాగే సంక్రాంతికి కూడా ప్రజలను చురుకుగా, ఉత్సాహంగా ఉంచే కార్యకలపాల్లో పతంగులు ఎగరవేయటం కూడా ఒకటి.
  • ఆకాశాన్ని తాకే గాలిపటం ఉన్నత స్థితి చిహ్నంగా చెప్తారు. ఆలోచనలు ఉన్నతంగా ఉండి, సరైన ఆధారం, నియంత్రణ ఉంటే జీవితం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. పట్టు తప్పినా, ఆధారం లేకపోయినా జీవితం తలకిందులు అవుతుంది. పతంగులు ఎగరవేయటంలో కూడా ఇదే నీతి ఇమిడి ఉంటుందనే ఇంకో వాదన ఉంది.

ఏది ఏమైనా, మన సంప్రదాయాలను గౌరవించడం, మన సంస్కృతిని కాపాడుకోవడం మన ధర్మం. ప్రతి పండగకి దానికి ఉన్న సంప్రదాయాలు పాటిస్తేనే అది మన నుంచి మన తరువాతి తరం వారికి చేరుతుంది. అప్పుడే పండగలకు అర్థం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం