Sleep deprivation । నిద్రలేమితో చాలా డేంజర్.. పిచ్చిగా ప్రవర్తిస్తారు!
Sleep deprivation: నిద్రలేమి వల్ల కలిగే ప్రధాన దుష్ప్రభావాలు ఏమిటి? ప్రశాంతమైన నిద్ర కోసం మీరు ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Sleep deprivation: ఈరోజుల్లో చాలా మందికి నిద్ర లేమి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అర్థరాత్రి దాటినా, నిద్రపోకుండా మేల్కొని ఉండటం, మొబైల్ ఫోన్ చూస్తుండటం చేసేవారు మీలో ఎంతో మంది ఉంటారు. ఎక్కువ గంటలు పని చేయడం, అలాగే సోషల్ మీడియాలో కాలం గడపడం, ఇతర కార్యకలాపాలలో సమయాన్ని వెచ్చిస్తూ తమ నిద్రను త్యాగం చేస్తున్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కనీసం 7-8 గంటల రాత్రి నిద్ర అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, నేడు చాలా మంది సరిగ్గా 5-6 గంటలు కూడా నిద్రపోవడం లేదు. ఈ అలవాటు ఇలాగే కొనసాగితే అది కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. నిద్రలేమి వల్ల కలిగే ప్రధాన దుష్ప్రభావాలు ఏమిటి? ప్రశాంతమైన నిద్ర కోసం మీరు ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
అభిజ్ఞా సామర్థ్యం తగ్గిపోతుంది
నిద్ర లేమి యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటి అభిజ్ఞా పనితీరులో తగ్గుదల. మీకు తగినంత నిద్ర లేనప్పుడు, మీ మెదడు ఏ సమాచారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేయదు, నిల్వ చేయదు. దీంతో ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి బలహీనపడటం విషయాలకు నెమ్మదిగా ప్రతిస్పందించటం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇది తరువాత జీవితంలో చిత్తవైకల్యం వంటి దీర్ఘాకాలిక మానసిక వ్యాధిని అభివృద్ధి చెందే ప్రమాదంతో ముడిపడి ఉంది.
కోపం, చిరాకు పెరుగుతుంది
నిద్రలేమి మీ మానసిక స్థితిని, మీ భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుంది. మీకు తగినంత నిద్ర లేనప్పుడు, మీరు తరచుగా కోపం రావచ్చు లేదా చిరాకుగా అనిపించవచ్చు. మీరు ప్రతీ విషయంలో మరింత ఆత్రుతగా ఉంటారు, నిరుత్సాహానికి గురవుతారు, పిచ్చిగా ప్రవర్తిస్తారు. అలాగే మీ భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బంది పడుతుంటారు. రాత్రిపూట తగినంతగా నిద్రపోకపోవడం వల్ల మీ జీవన నాణ్యత మొత్తం తగ్గిపోతుంది.
బరువు పెరుగుతారు
నిద్ర లేమి బరువు పెరుగుటతో ముడిపడి ఉంది. మీకు తగినంత నిద్ర లేనప్పుడు, మీ హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి, ఇది ఆకలి బాధలను, అనారోగ్యకరమైన ఆహారాల కోసం కోరికలను పెంచుతుంది. అంతేకాకుండా మీరు అలసిపోయినట్లుగా ఉంటారు, కాబట్టి శారీరక శ్రమ చేయలేరు, ఇవన్నీ కాలక్రమేణా మీరు బరువు పెరగడానికి మరింత దోహదం చేస్తాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, సరిగ్గా నిద్రపోని వారు వ్యాయామాలు చేసినా వాటి ఫలితాలు పొందలేరని తేల్చాయి.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
నిద్ర లేకపోవడం కూడా మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఎందుకంటే, మీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, ఏవైనా అంతర్లీన సమస్యలను రిపేర్ చేసుకోవడానికి సమయం కావాలి. మీరు నిద్రపోయినపుడు ఈ ప్రక్రియలు జరుగుతాయి. కానీ, మీరు నిద్రకు ఆ సమయాన్ని ఇవ్వనప్పుడు, మీ రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో త్వరగా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.
నిద్రలేమి కారణంగా ఈపైన పేర్కొన్నవి కేవలం కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రమే, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీరు నిద్రలేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలకు గురికావచ్చు, వృత్తిరంగంలో మీ పనితీరు తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇలా ఎన్నో నిద్రలేమితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, మంచి నిద్రను పొందేందుకు చర్యలు తీసుకోండి, అవసరమైతే వైద్యులను సంప్రదించండి.
సంబంధిత కథనం