Morning -Weight loss । బరువు తగ్గాలనుకుంటే ఉదయం మీ దినచర్యను ఇలా ప్రారంభించండి!
Morning Routine For Weight loss: సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ ఉదయం మీ దినచర్య ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాం
Morning Routine For Weight loss: అధిక బరువు, ఊబకాయం సమస్యలు కలిగిన వారు తమని తాము ఫిట్ గా ఉంచుకోవడానికి మొట్టమొదటగా చేయాల్సిన పని బరువు తగ్గడం. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం వలన మంచి శరీరాకృతిని పొందవచ్చు, మధుమేహం, హృదయ సంబంధింత వ్యాధులను నివారించవచ్చు. అయితే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అవగాహన లేకుండా తీవ్రమైన వ్యాయామాలు చేయడం, సరిగ్గా ఆహారం తినకపోవడం చేస్తారు. కానీ, ఇలా చేయడం వలన బరువు తగ్గకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
వాస్తవమేమిటంటే బరువు తగ్గడం, ముందుకు వచ్చిన పొట్టను కరిగించి నడుమును సన్నగా మార్చడం అనేది రాత్రికిరాత్రే జరిగే పనికాదు. ప్రణాళికబద్ధంగా స్థిరంగా ఆచరించవలసిన కొన్ని అంశాలు ఉంటాయి, ప్రతిరోజూ సాధన అవసరం అవుతుంది. ఉదయం లేచిన దగ్గర్నించీ మీరు అనుసరించే దినచర్య సరిగ్గా ఉండాలి. సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ ఉదయం మీ దినచర్య ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.
ఉదయం నిమ్మరసం తాగండి
ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు తాగటం మంచి అలవాటు. అయితే ఈ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే బరువు తగ్గడంలో అది మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగటం ద్వారా మీ జీవక్రియ ప్రారంభం అవుతుంది. రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉన్న మీకు మంచి శక్తినిస్తుంది. ఈ పానీయం మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది, మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, కొవ్వును కరిగించే ప్రక్రియలను వేగవంతం చేసి మీరు బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
వ్యాయామం చేయండి
పొట్టభాగంలో కొవ్వును తగ్గించడానికి ఉదయం వ్యాయామం చేయడం ఉత్తమం అని చెబుతారు. ఎందుకంటే ఉదయం నుంచే మీ శరీరాన్ని కదిలించడం వల్ల మీ జీవక్రియను పెరుగుతుంది, ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. తద్వారా వేగంగా కొవ్వును కాల్చడాన్ని, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జాగింగ్ చేయడం, చురుకైన నడకకు వెళ్లడం, యోగా చేయడం లేదా హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయడం చేయవచ్చు. ప్రతి ఉదయం, కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.
ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్
ఉదయం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మరచిపోవద్దు. మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటే మీకు ఆకలి పెరిగి పగలంతా ఎక్కువ తినేస్తారు, చిరుతిళ్లు తినాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయండి. ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోండి. మాంసకృత్తులతో కూడిన అల్పాహారం మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, జీవక్రియను వేగవంతం చేయడానికి చాలా అవసరం. గుడ్లు, గ్రీక్ యోగర్ట్ , ప్రోటీన్ స్మూతీ లేదా ప్రోటీన్ దోశ వంటి అల్పాహారాలు తీసుకోండి. ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం, ఇది కేలరీలను బర్న్ చేస్తుంది, రోజంతా ఆకలి బాధలను తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి
ఉదయం దినచర్య ప్రారంభమైన దగ్గర్నించీ చాలా మందికి ఉరుకులు పరుగుల జీవితం ఉంటుంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా బరువు పెరగటానికి ఒక కారణం. కాబట్టి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మీ శరీరంలో హార్మోన్లను అసమతుల్యతను నియంత్రించడానికి ప్రయత్నించండి. రోజూ ఉదయం కనీసం 10-15 నిమిషాలు బుద్ధిపూర్వకంగా ధ్యానం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది, మీ శ్రేయస్సు మెరుగుపడుతుంది.
ప్రతిరోజూ ఉదయం ఇలాంటి దినచర్యను కలిగి ఉండండి. ప్రతిరోజూ పోషకాలు అధికంగా ఉండే సమతుల్య భోజనం చేయండి, పీచు పదార్థాలు ఎక్కువ తినండి, రాత్రికి 7-8 గంటలు నిద్రపోండి. ఇలాంటి జీవనశైలిని అలవర్చుకుంటే మీరు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటారు, ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
సంబంధిత కథనం