Fall Asleep Quickly । పడుకున్న వెంటనే నిద్రపట్టాలంటే.. ఈ టిప్స్ పాటించండి!
Fall Asleep Quickly: మీరు పడుకున్న వెంటనే మంచి నిద్ర ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ఈ క్రింద కొన్ని చిట్కాలను అందించాము, వాటిని అనుసరించండి.
Fall Asleep Quickly: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. కానీ, నేటి వేగవంతమైన జీవనశైలి, రోజూవారీ ఒత్తిళ్లు, అనారోగ్యపు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి నిద్ర కరువైపోతుంది. ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు, రాత్రి పన్నెండు, ఒంటి గంట దాటినా కూడా కంటికి కునుకు రాదు. కానీ, ఇలా వరుసగా నిద్రలేకపోతే మీకు చాలా అలసటగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి.
మీరు పడుకున్న వెంటనే మంచి నిద్ర ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ఈ క్రింద కొన్ని చిట్కాలను అందించాము, వాటిని అనుసరించండి.
సౌకర్యవంతమైన పడక
రాత్రి మంచిగా నిద్రపోవాలంటే మీ మంచం కూడా బాగుండాలి. అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన పరుపు, దిండు కలిగి ఉండటం వల్ల వెన్నునొప్పి రాకుండా ఉంటుంది. అప్పుడు మీరు త్వరగా నిద్రపోవచ్చు.
లైట్ ఆఫ్ చేయండి
ఎక్కువ వెలుతురు ఉంటే పడుకున్న వెంటనే నిద్రపట్టదు. అందుకే లైట్ ఆఫ్ చేస్తే త్వరగా నిద్ర వస్తుంది. ఇది మీ శరీరం మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, నిద్రను ప్రోత్సహిస్తుంది. కిటికీల నుండి కాంతిని నిరోధించడానికి కర్టెన్లను ఉంచండి.
మొబైల్ ఫోన్లకు దూరం
మొబైల్ ఫోన్లు మీ నిద్రను దూరం చేసే ప్రధాన శత్రువులు. పక్కన ఫోన్ ఉంటే తరచూ చూస్తాం. దీని స్క్రీన్ మీ నిద్రను చెడగొడుతుంది. అనవసరంగా వచ్చే ఫోన్ అలెట్లు కూడా మీకు నిద్రాభంగ్రం కలిగిస్తాయి. కాబట్టి నిద్రించేటడు మీ ఫోన్ మీకు దూరంగా ఉండేలా చూసుకోండి.
శబ్దాన్ని తగ్గించండి
మీ పడకగది నిశబ్దంగా ఉండేలా చూసుకోండి. నిశబ్దం నిద్రను ప్రేరేపిస్తే, శబ్దాలు మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. కాబట్టి గది నిశబ్దంగా ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
గది వాతావరణం
మీ పడకగది చాలా వేడిగా లేదా చల్లగా లేకుండా సాధారణంగా ఉండేలా చూసుకోండి. చాలా వేడిగా ఉన్నా నిద్రపట్టదు, వాతావరణం బాగా చల్లగా ఉన్నా నిద్రపట్టదు.
డిన్నర్‌ను స్కిప్ చేయవద్దు
ఏ కారణం చేతనైనా డిన్నర్‌ను దాటవేయవద్దు. రాత్రి భోజనం చేయకుండా పడుకుంటే నిద్ర పట్టదు. కానీ ఆ భోజనం కూడా మితంగా, సమతుల్యంగా ఉండాలి. ఇది సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. గోధుమ పాస్తా, ఓట్ మీల్, పాల ఉత్పత్తులు, హెర్బల్ టీలు నిద్రను ప్రోత్సహిస్తాయి. అయితే, పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీలు తాగకూడదు. ఇవి మిమ్మల్ని మెలకువగా ఉంచుతాయి.
ఆల్కహాల్- స్మోకింగ్ వద్దు
మద్యపానం, ధూమపానం మీ నిద్రకు చాలా హానికరం. ఆల్కహాల్ నిద్రను చాలా ప్రభావితం చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, మద్యం తాగిన వెంటనే నిద్ర వస్తుంది. కానీ, మత్తు దిగాక మెలకువ వస్తుంది. మద్యం సేవించి నిద్రపోతే రాత్రిపూట తరచుగా మెలకువ వచ్చే అవకాశం ఉంటుంది.
పైన పేర్కొన్న అన్ని చిట్కాలను పాటిస్తే వెంటనే నిద్రలోకి జారుకోవచ్చు. మీకు మరేదైనా అనారోగ్య సమస్యల వల్ల నిద్రలేకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది.
సంబంధిత కథనం