Sleep Divorce । భార్యాభర్తల మధ్య 'స్లీప్ డివోర్స్'.. అసలేమిటి ఈ ధోరణి?-sleep divorce a new trend emerges between couple know all about it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Divorce । భార్యాభర్తల మధ్య 'స్లీప్ డివోర్స్'.. అసలేమిటి ఈ ధోరణి?

Sleep Divorce । భార్యాభర్తల మధ్య 'స్లీప్ డివోర్స్'.. అసలేమిటి ఈ ధోరణి?

HT Telugu Desk HT Telugu
Jun 15, 2023 09:39 PM IST

sleep divorce: హ్యాష్‌ట్యాగ్ స్లీప్ డివోర్స్ పేరిట సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. అసలేమిటీ ఈ ధోరణి? తెలుసుకోండి.

sleep divorce
sleep divorce (istock)

sleep divorce: ఇటీవల కాలంగా ఇంటర్నెట్లో, సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో ఎక్కువగా శోధిస్తున్న అంశాలలో 'స్లీప్ డివోర్స్' కూడా ఒకటి. ఇదేమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు మంచాలలో విడివిడిగా నిద్రపోవడం. ఇలా నిద్రించేటపుడు వేరుగా పడుకోవడం వలన నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని కొంతమంది కపుల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు హ్యాష్‌ట్యాగ్ స్లీప్ డివోర్స్ #SleepDivorce పేరిట అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. విడివిడిగా నిద్రపోవడం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా హాయిగా నిద్రపోగలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు.

భాగస్వాములు ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు ఒకరు గురకపెట్టడం, కాళ్లు చేతులు వేయడం, మంచంపై స్థలం సరిపోకపోవడం, తరచూ లేవడం మొదలైన కారణాల వలన నిద్రకు భంగం వాటిళ్లడం సహజం. అయితే దీనిని అధిగమించేందుకు విడివిడిగా పడుకోవడం మేలని కొందరు చెబుతున్నారు. ప్రత్యేక పడకలలో పడుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ప్రముఖ సైకోథెరపిస్ట్ చాందినీ తుగ్నైట్ M.D. స్లీప్ డివోర్స్ ప్రయోజనాల గురించి చర్చించారు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

మెరుగైన నిద్ర నాణ్యత

స్లీప్ డివోర్స్ భాగస్వాములిద్దరికీ మెరుగైన నిద్ర నాణ్యతను అందించవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేని మరింత గాఢమైన, ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు.

అనుకూల వాతావరణం

కొందరికి ఏసీ ఆన్ ఉండాలి, కొందరికి వెచ్చగా ఉండాలి. ఒకరికి లైటింగ్ ఉండాలి, మరొకరి చీకటిగా ఉండాలి. స్లీప్ డివోర్స్ వలన ఈ సమస్య ఉత్పన్నం కాదు.

నిద్ర సమస్యల ఇబ్బంది ఉండదు

గురక, స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌ వంటివి నిద్రకు అంతరాయం కలిగించే కొన్ని ఉదాహరణలు, ఇవి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టవచ్చు. విడివిడిగా నిద్రించడం ద్వారా నిద్ర సమస్యల ఇబ్బంది ఉండదు

వ్యక్తిగత శ్రేయస్సు

వ్యక్తిగత శ్రేయస్సుకు నాణ్యమైన నిద్ర అవసరం. స్లీప్ డివోర్స్ వ్యక్తులు వారి నిద్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశమిస్తుంది, ఇది శమెరుగైన మానసిక స్థితి, మెరుగైన అభిజ్ఞా పనితీరుకు దారితీస్తుంది.

మెరుగైన సంబంధ సంతృప్తి

నిద్ర-సంబంధిత సవాళ్లను పరిష్కరించడం ద్వారా, భాగస్వాములిద్దరూ వారి జీవితంలోని ఇతర రంగాలలో మెరుగైన భావోద్వేగ కనెక్షన్, విభేదాలు లేని సామరస్యాన్ని అనుభవించవచ్చు.

ఇబ్బందులేమి?

స్లీప్ డివోర్స్ కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధం దెబ్బతినవచ్చు. వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావొచ్చు, శృంగారానికి దూరం కావచ్చు, సాన్నిహిత్యం దెబ్బతినవచ్చు. ఇవన్నీ ఇతర అనర్థాలకు దారితీయవచ్చు. స్లీప్ డివోర్స్ నిజమైన డివోర్స్ కు దారితీసినా ఆశ్చర్యం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం