Sleep and fertility: నిద్ర తగ్గితే పిల్లలు పుట్టరు.. ఫర్టిలిటీ సమస్యలకు చెక్ ఇలా-sleep and fertility how lack of sleep can negatively affect your chances of conceiving ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sleep And Fertility How Lack Of Sleep Can Negatively Affect Your Chances Of Conceiving

Sleep and fertility: నిద్ర తగ్గితే పిల్లలు పుట్టరు.. ఫర్టిలిటీ సమస్యలకు చెక్ ఇలా

HT Telugu Desk HT Telugu
Mar 27, 2023 04:49 PM IST

Sleep and fertility: నిద్ర తగ్గితే పిల్లలు పుట్టరని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలు ఏంటి? ఎంత సేపు నిద్ర పోవాలి? నిద్ర పట్టేందుకు టిప్స్ వివరించారు.

నిద్ర తగ్గితే గర్భధారణ అవకాశాల్లో తగ్గుదల
నిద్ర తగ్గితే గర్భధారణ అవకాశాల్లో తగ్గుదల (Unsplash )

ప్రెగ్నెన్సీ రావడంలో పలు జీవనశైలి అలవాట్లు ప్రభావం చూపుతాయి. స్మోకింగ్, ఆల్కహాల్ తాగడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి చెత్త అలవాట్లు గర్భధారణ అవకాశాలను దెబ్బతీస్తాయి. ఇక హైబీపీ, డయాబెటిస్, ఒబెసిటి వంటి అనారోగ్య పరిస్థితులు కూడా సంతానోత్పత్తి రేటును ప్రభావితం చేేస్తాయి. అయితే మీరు నిద్ర పోయే తీరు కూడా సంతానోత్పత్తిని ప్రభావం చేస్తుందని ఎప్పుడైనా విన్నారా? ఒక వ్యక్తి శారీరక, మానసిక, భావోద్వేగ సంబంధిత ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర లేమి సమస్యలు అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయని వైద్య రంగం గుర్తిస్తోంది. పురుషులూ, స్త్రీలూ అందరిపైనా ఈ ప్రభావం పడుతుంది. అయితే మీరు గాఢంగా నిద్ర పోతే మీ శరీరంలో టిష్యూలు తిరిగి కోలుకుంటాయి. అంటే రిపేర్ అయి కొత్త కణాలు వృద్ధి చెందుతాయన్నమాట. దీర్ఘకాలికంగా నిద్ర లేమి కేవలం స్ట్రెస్, యాంగ్జైటీకి మాత్రమే కారణం కాదు.. అది మీ సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా పెను ప్రమాదాన్ని చూపుతుంది.

నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీకి చెందిన ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ తల్వార్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఈ అంశాలను వివరించారు. నిద్రకు, ఫెర్టిలిటీకి మధ్య గణనీయమైన సంబంధం ఉందని వివరించారు. అలాగే సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నిద్ర సరిగ్గా పట్టేలా తగిన సూచనలు చేశారు.

How sleep affects fertility: ఫెర్టిలిటీపై నిద్ర ప్రభావం ఇలా

నిద్ర లేమి వల్ల ఫెర్టిలిటీ సామర్థ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం హార్మోన్ల ఉత్పత్తిలో సమస్యలు. నిద్ర లేమి కారణంగా హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది. కొన్ని రకాల హార్మోన్లు అపరిమితంగా పెరుగుతూ పోతుంటే, మరికొన్నింటి ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది మీ ఫర్టిలిటీ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఒవల్యూటరీ డిస్‌ఫంక్షన్ (అండాశయ సామర్థ్య లోపం), రుతుచక్రంలో అసాధారణతలు, మహిళల్లో సంతాన లేమి సమస్యలు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ మార్ఫాలజీలో అసాధారణతలకు నిద్ర లేమి సమస్యలకు మధ్య సంబంధం ఉంది. హార్మోన్ల అసమతుల్యత లిబిడో తగ్గడానికి కారణమవుతుంది. ఈ రసాయనిక మార్పు మీ రిలేషన్‌షిప్‌లో అడ్డుగోడగా నిలిచిపోతుంది.

దీనికి తోడు నిద్ర లేకపోతే శరీరం ఒత్తిడి హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈస్ట్రోజెన్, టెస్టొస్టెరాన్, ఇతర సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ల స్థాయిని దెబ్బతీస్తుంది.ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే నిద్ర, మెలకువకు సంబంధించిన హార్మోన్లను (మెలటోనిన్, కార్టిసాల్) నియంత్రించే మెదడులోని భాగం కూడా రోజువారీగా రీప్రొడక్టివ్ హార్మోన్ల విడుదలను ప్రభావితం చేస్తుంది.

చీకటి పడ్డాక మెలటోనిన్ అనే హార్మోన్‌ను మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. అది మన నిద్రపోయే, మెలకువ వచ్చే సైకిల్‌ను నియంత్రిస్తుంది. ఇదొక శక్తిమంతమైన యాంటాక్సిడెంట్. ఇది ఒవల్యూషన్‌కు చేరుకునే అండాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. అండాల నాణ్యతను తగ్గించే ఇతర హానికారకాలపై కూడా పోరాడుతుంది. ఎక్కువ కాంతి, ముఖ్యంగా సెల్ ఫోన్లు, టీవీల ద్వారా వచ్చే కాంతి మన శరీరంలోని మెలటోనిన్ సైకిల్స్‌ను ప్రభావితం చేస్తుంది. దీంతో అండాల నాణ్యత దెబ్బతింటుంది. నిరంతరం నిద్ర లేమితో బాధపడితే లుటైనైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్). ఒవల్యూషన్‌కు దోహదం చేసే హార్మోన్ ఎల్‌హెచ్ అనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.

What is the appropriate duration of sleep? ఎంత సమయం నిద్రపోవాలి?

తగినంత నిద్ర లభించాలంటే కనీసం ఆరేడు గంటల నిద్రించడం అవసరం. అయితే 9 గంటల కంటే మించకూడదు. అంత ఎక్కువ సేపు నిద్రించినా అది ఫర్టిలిటీకి హానికరం. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఇటీవలి అధ్యయనం ప్రకారం ఐవీఎఫ్ చేయించుకున్న మహిళల్లో 9 గంటలు నిద్ర పోయిన వారితో పోల్చితే ఏడెనిమిది గంటలు నిద్ర పోయిన వారు గర్భధారణ పొందడానికి 25 శాతం ఎక్కువ ఛాన్స్ ఉందని తేలింది. అలాగే ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రించిన వారు గర్భధారణ పొందడానికి 15 శాతం తక్కువ అవకాశం ఉంది. అందువల్ల ఏడు నుంచి 9 గంటలు నిద్ర పోవడం ఆరోగ్యకరమైన గర్భధారణ అవకాశాలను పెంచుతుంది.

జీవగడియారం దెబ్బతింటుంది

మన శరీరంలోని ఏ క్రియలకైనా జీవగడియారం ఉంటుంది. శరరం నిర్ధిష్ట నమూనాలో చీకటికి, వెలుతురుకు అలవాటు పడితే జీవగడియారం సవ్యంగా సాగుతుంది. ఇందులో మార్పులు ఉంటే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారు, లేదా తరచూ షిఫ్టులు మారే వారు ఈ జీవగడియార సంబంధిత సమస్యల బారిన పడతారు. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మహిళలకు రుతుచక్ర సమస్యలు వస్తాయి. అవి సంతానోత్పత్తి సమస్యలు పెంచుతాయి.

తగినంత నిద్ర కోసం చిట్కాలు

  1. వ్యాయామం: రోజూ 30 నిమిషాల పాటు ఏరోబిక్ ఎక్సర్‌సైజులు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మీరు తగినంత నిద్ర పోయేందుకు దోహదం చేస్తాయి. రోజూ కొన్ని కేలరీలు కరిగిస్తే రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది.
  2. నిద్రకు నిర్ధిష్ట వేళలు: మీరు రోజూ నిర్ధిష్ట వేళల్లో నిద్రపోవాలి. ముఖ్యంగా గర్భం ధరించాలని ప్లాన్ చేస్తున్నట్టయితే ఇది చాలా కీలకంగా గుర్తించాలి. ఓ రోజు చాలా తొందరగా పడుకోవడం, మరో రోజు రాత్రంతా మెలకువతో ఉండడం సరికాదు. జీవ గడియారం దెబ్బతింటుంది. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోతూ, ఒకే సమయంలో నిద్ర లేవడం మంచిది. వారాంతంలోనూ ఈ వేళలు పాటించాలి.
  3. స్క్రీన్‌కు దూరంగా ఉండండి: స్క్రీన్ నుంచి వచ్చే నీలి రంగు కాంతిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. రాత్రి పడుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందు స్మార్ట్ ఫోన్లను పక్కన పడేయాలి. పగటి పూట కూడా స్క్రీన్ చూడడం పరిమితం చేయాలి.
  4. కాంతి: చీకటిగా ఉన్న, నిశబ్దంగా ఉన్న గదిలో నిద్ర త్వరగా వస్తుంది. నిద్రకు ఉపక్రమించే వేళ లైట్లు ఆర్పడం మంచిది.
  5. నిద్రను పాడు చేసే వాటికి దూరం: నికోటిన్, ఆల్కహాల్ వంటివి మెదడును ఉద్దీపన చెందిస్తాయి. దీంతో నిద్ర కరువవుతుంది. అలాగే సాయంకాలం కెఫీన్ కూడా తగ్గించాలి.
  6. రిలాక్స్: నిద్రకు ముందు స్నానం చేయడం, ఓ పుస్తకం చదవడం, సంగీతం వినడం, లేదా ఇతర రిలాక్సింట్ టెక్నిక్స్ వల్ల మీ శరీరం, మనస్సు తేలికపడి నిద్ర మత్తు ముంచుకొస్తుంది.

నిద్ర, ఫర్టిలిటీ రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని గుర్తించండి. ప్రతి రోజూ రాత్రి తగినంత నిద్ర ఉంటే మీ జీవిత నాణ్యత కూడా మెరుగుపడుతుంది.

WhatsApp channel