మనిషికి సంబంధించిన అనేక శారీరక, మానసిక సమస్యలకు యోగాలో పరిష్కారాలు దాగి ఉన్నాయి. రోజూ యోగా చేయడం వల్ల మనిషి అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ప్రతి రోగానికి దానికి సంబంధించిన సరైన ఔషధం తీసుకున్నప్పుడే ఆ వ్యాధి నయం అవుతుంది, వేరే ఔషధం తీసుకుంటే మరిన్ని సమస్యలు కలగజేయవచ్చు. ఇదే విధంగా యోగాతో చాలా సమస్యలకు పరిష్కారాలు ఉన్నట్లే, కొన్ని ఆసనాలతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. కావున సరైన అవగాహనను కలిగి ఉండటం చాలా ముఖ్యం.
ఉదాహరణకు హైబీపీ ఉన్నవారికి యోగాలో కొన్ని ఆసనాలు ఉత్తమంగా పనిచేస్తాయి. అదే సమయంలో మరికొన్ని ఆసనాలు వేసినపుడు బీపీ తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. అధిక రక్తపోటును మరింత పెంచే అలాంటి యోగాసనాల గురించి మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం.
అధిక రక్తపోటు రోగులకు నిపుణులు సిఫార్సు చేయని యోగాలో కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. వీటిని హైబీపీ కలిగిన వ్యక్తులు ఆచరించడం నిషిద్ధం. ఈ యోగాసనాలు వేయడం వల్ల మనిషికి రక్తపోటు పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త, ఆ ఆసనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
శీర్షాసనము తలలో రక్త ప్రసరణను ప్రోత్సహించడంతో పాటు శారీరక సమతుల్యతను మెరుగుపరచడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు శీర్షాసనము ఆచరించడం నిషేధం. ఈ ఆసనం వేసినపుడు తలకు అకస్మాత్తుగా రక్త ప్రసరణ పెరుగుతుంది, దీని కారణంగా రక్తపోటు సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
అదో ముఖ స్వనాశనం శరీరానికి, ముఖ్యంగా తలకి రక్త ప్రవాహాన్ని వేగంగా పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. ఇలాంటి యోగాసనాలు రక్తపోటును పెంచుతాయి.
హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు ఉత్తనాసన యోగా సాధనకు దూరంగా ఉండాలి. యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి యోగాసనాలు వేసేటప్పుడు, కాళ్ళు, మొండెం ఎత్తులో ఉంటాయి, అలాగే తల భాగం, గుండె క్రిందకు వస్తుంది, ఈ పరిస్థితి అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
పైన పేర్కొన్న ఆసనాలు అధిక రక్తపోటు ఉన్నవారు వేయవద్దు. అయితే వీటికి బదులుగా బాలాసనం, సుఖాసనం, శవాసనం, భుజంగాసనం, సేతుబంధాసనం వంటి ఆసనాలు వేయవచ్చు. ఇవి హైపర్‌టెన్షన్‌ను తగ్గించగలవు.
సంబంధిత కథనం