Ragi Laddu: ఆరోగ్యానికి మేలు చేసే రాగి లడ్డు, రోజూ తినమని చెబుతున్న పోషకాహార నిపుణులు-ragi laddu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Laddu: ఆరోగ్యానికి మేలు చేసే రాగి లడ్డు, రోజూ తినమని చెబుతున్న పోషకాహార నిపుణులు

Ragi Laddu: ఆరోగ్యానికి మేలు చేసే రాగి లడ్డు, రోజూ తినమని చెబుతున్న పోషకాహార నిపుణులు

Haritha Chappa HT Telugu
Jun 13, 2024 03:35 PM IST

Ragi Laddu: రాగులతో చేసే ఆహారాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇక్కడ మేము రాగి లడ్డు రెసిపీ ఇచ్చాము. ఇది రోజుకు ఒకటి తింటే చాలు... ఎన్నో పోషకాలు శరీరంలో చేరుతాయి.

రాగి లడ్డూలు
రాగి లడ్డూలు

Ragi Laddu: చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. ప్రతిరోజూ రాగిజావ తాగమని చెబుతూ ఉంటారు పోషకాహార నిపుణులు. అలాగే రాగులతో చేసిన రెసిపీలను తరచూ తినడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. ఇక్కడ మేము రాగి పిండితో చేసే లడ్డూ రెసిపీ ఇచ్చాము. ఇది పిల్లలకు, పెద్దలకు టేస్టీగా అనిపిస్తుంది. రోజుకు ఒక రాగి పిండి లడ్డూ తినండి చాలు. మీకు ఎన్నో అత్యవసర విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి.

రాగి పిండి లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు

రాగి పిండి - ఒక కప్పు

యాలకుల పొడి - పావు స్పూను

బెల్లం పొడి - అరకప్పు

నెయ్యి - రెండు స్పూన్లు

పాలు - పావు కప్పు

జీడిపప్పులు - గుప్పెడు

బాదం పప్పు - గుప్పెడు

కొబ్బరి తురుము - పావు కప్పు

రాగి పిండి లడ్డు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి.

2. ఆ నెయ్యిలో జీడిపప్పులు, బాదం పప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఆ నెయ్యిలోనే రాగి పిండిని వేసి దోరగా వేయించాలి.

4. అదే పిండిలో బెల్లం తురుము, యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.

5. ఇప్పుడు మరగ కాచిన పాలను వేసి ఒకసారి కలుపుకోవాలి.

6. చిన్న మంట మీద ఉంచి ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.

7. రెండు మూడు నిమిషాలు కలపడం వల్ల ఆ మిశ్రమమంతా దగ్గరగా వస్తుంది.

8. అలా అది దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.

9. వేడి తగ్గాక వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని గాలి చొరబడని డబ్బాల్లో వేసి ఉంచుకుంటే వారం రోజులు పాటు తాజాగా ఉంటాయి.

10. ఇందులో వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి ప్రతిరోజు ఒక లడ్డును మీ పిల్లలకు తినిపించండి. అలాగే పెద్దలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది.

రాగి పిండితో చేసిన రెసిపీలలో ముఖ్యమైనది రాగి జావ. అయితే దీన్ని పిల్లలు తినలేరు. కాబట్టి వారికి రాగి పిండితో ఇలా లడ్డూలను చేసి పెడితే ఇష్టంగా తింటారు. చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి రాగులు. రాగులు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు రాగి జావను తినిపించవచ్చు. ఆరు నెలలు దాటిన శిశువులకు రాగి జావని పెట్టడం వల్ల వారికి మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఈ రాగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి డయాబెటిస్ రోగులు రాగిజావను ప్రతిరోజూ తింటే ఎంతో ఉత్తమం. ఇక రాగి పిండితో చేసిన ఈ లడ్డూల్లో బెల్లాన్ని చాలా తక్కువగా వినియోగించాము. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు రెండు మూడు రోజులకు ఒకసారి ఈ రాగి లడ్డూను తింటే మేలే జరుగుతుంది.

Whats_app_banner