Ragi Cake Recipe: టేస్టీ రాగి కేక్, రాగి పిండి చాక్లెట్‌తో చేసే ఒక హెల్దీ రెసిపీ-ragi cake recipe with chocolate in telugu know how to make cake ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Cake Recipe: టేస్టీ రాగి కేక్, రాగి పిండి చాక్లెట్‌తో చేసే ఒక హెల్దీ రెసిపీ

Ragi Cake Recipe: టేస్టీ రాగి కేక్, రాగి పిండి చాక్లెట్‌తో చేసే ఒక హెల్దీ రెసిపీ

Haritha Chappa HT Telugu
Feb 15, 2024 03:10 PM IST

Ragi Cake Recipe: పిల్లలకు కేకులంటే చాలా ఇష్టం. అలాగని ప్రతిరోజూ మైదా పిండితో చేసిన కేకులు తినిపించడం మంచిది కాదు. ఒకసారి రాగి పిండితో కేక్ తయారు చేసి పెట్టండి. ఈ కేక్ వారికి తప్పకుండా నచ్చుతుంది.

రాగి కేకు రెసిపీ
రాగి కేకు రెసిపీ (pixabay)

Ragi Cake Recipe: కేకులను చూడగానే పిల్లలకి నోరూరి పోతుంది. బయట దొరికే కేకులు అన్నీ మైదా పిండితో చేసినవే. ఆ విషయం చాలామందికి తెలియక పిల్లలకు ఎక్కువగా కేకులను పెడుతూ ఉంటారు. మైదా పిండిని అధికంగా తినిపించడం వల్ల భవిష్యత్తులో వారు త్వరగా రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంట్లోనే రాగి పిండి, చాక్లెట్ తో టేస్టీ కేక్ తయారు చేసి పెట్టండి. ఈ రాగి చాక్లెట్ కేకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. దీని తయారు చేయడం చాలా సులువు. రాగి చాక్లెట్ కేక్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

రాగి చాక్లెట్ కేక్ రెసిపీకి కావలసిన పదార్థాలు

రాగి పిండి - ఒక కప్పు

నీళ్లు - అర కప్పు

పెరుగు - పావు కప్పు

వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను

కోకో పౌడర్ - ఒక స్పూన్

బటర్ - ఒక స్పూను

బేకింగ్ పౌడర్ - ఒక స్పూన్

ఉప్పు - అర స్పూను

పంచదార పొడి - రెండు స్పూన్లు

వెజిటబుల్ ఆయిల్ - మూడు స్పూన్లు

రాగి చాక్లెట్ కేక్ రెసిపీ

1. రాగి పిండిని ముందుగానే జల్లించుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి.

2. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార పొడి, ఉప్పు, పెరుగు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి.

3. ఓ పది నిమిషాలు దాని పక్కన పెట్టాలి.

4. తర్వాత అదే గిన్నెలో రాగి పిండిని కూడా జల్లించుకొని వేసుకోవాలి.

5. కోకో పౌడర్, వెజిటబుల్ నూనె వేసి బాగా కలపాలి. మరీ మందంగా అనిపిస్తే కాస్త నీటిని వేసుకోవచ్చు. లేదా మరిగించిన పాలన వేసుకున్న మంచిదే.

6. ఇప్పుడు కేకు మౌల్డ్ ను తీసుకొని అడుగు భాగంలో నెయ్యి లేదా వెన్న రాయాలి.

7. కాస్త గోధుమ పిండిని చల్లాలి. ఇలా చేయడం వల్ల కేక్ అడుగుభాగానికి అతుక్కుపోకుండా ఉంటుంది.

8. ఇప్పుడు రాగి పిండి మిశ్రమాన్ని ఆ మౌల్డ్ లో వేసి గాలి బుడగలు లేకుండా చూసుకోవాలి.

9. ఆ మౌల్డ్ ను మెల్లగా నేలకి తడుతూ ఉంటే గాలి బుడగలు ఉన్నా పోతాయి.

10. ఓవెన్ ఉన్నవారు ముందుగానే 180 డిగ్రీల సెల్సియస్ కు ప్రీ హీట్ చేసుకోవాలి.

11. తరువాత ఈ కేక్ మౌల్డ్ లోపల పెట్టి ఒక అరగంట పాటు ఉంచాలి. అంతే రాగి కేక్ రెడీ.

ఓవెన్ అందరి ఇళ్లల్లో ఉండాలని లేదు. ఓవెన్ లేనివారు ప్రెషర్ కుక్కర్లోనే ఈ కేకు తయారు చేయొచ్చు. కుక్కర్ అడుగు భాగంలో ఒక చిన్న స్టాండ్‌ను పెట్టండి. పైన మూత పెట్టి ముందే ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత పైన ఉన్న మూతను తీసి కేకు మౌల్డ్ లో రాగి పిండి మిశ్రమాన్ని వేసి లోపల పెట్టండి. కుక్కర్ మూత పెట్టేయండి. చిన్న మంట మీద 40 నిమిషాల పాటు ఉడికించండి. పైన విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా కేక్ రెడీ అయిపోతుంది. దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసి మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోండి. కొందరు చాక్లెట్స్ తో చేస్తే, మరి కొందరు రంగురంగుల జెమ్స్ తో చేస్తారు. మరికొందరు ఫ్రూట్స్ తో అలంకరిస్తారు. ఎలా చేసినా కూడా రాగి పిండితో చేసే కేక్ ఆరోగ్యకరమే.

Whats_app_banner