Valentines cake: వాలెంటైన్స్ డే వచ్చిందంటే ప్రేమికుల చూపులన్నీ చాక్లెట్లు, కేకుల మీదే ఉంటాయి. చాక్లెట్లను గిఫ్టులుగా ఇవ్వడం, తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకునేందుకు కేకులు కట్ చేయడం వంటివి చేస్తారు. ప్రతిసారి కేక్‌ను కొనేకన్నా... మీ ఇద్దరూ కలిసి ఇంట్లోనే కేక్‌ను తయారు చేయండి. ఈ కేక్ తయారు చేయడం చాలా సులువు. చాక్లెట్ కేక్‌ను లవ్ సింబల్ ఆకారంలో తయారు చేసి కట్ చేస్తే అది మీకు ఈ ఏడాదంతా మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు. చాక్లెట్ కేక్‌ను తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది.
మైదా - రెండున్నర కప్పులు
పంచదార పొడి - ఒకటిన్నర కప్పు
గుడ్లు - రెండు
వెనిల్లా ఎసెన్స్ - రెండు స్పూన్లు
బేకింగ్ పౌడర్ - రెండు స్పూన్లు
బేకింగ్ సోడా - రెండు స్పూన్లు
ఉప్పు - అర స్పూను
నీరు - రెండు కప్పులు
వెజిటబుల్ ఆయిల్ - పావుకప్పు
కోకో (చాక్లెట్) పొడి - పావు కప్పు
1. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో గుడ్లను పగలగొట్టి వేయండి.
2. గుడ్ల మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టండి.
3. అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదాపిండి వేసి బాగా కలపండి.
4. చక్కెర పొడి, కోకో పొడి కూడా వేసి బాగా కలపండి.
5. అర స్పూను ఉప్పు, వెజిటబుల్ ఆయిల్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా గిలక్కొట్టండి.
6. ఇప్పుడు లవ్ సింబల్ ఆకారంలో ఉన్న మౌల్డ్ ను తీసుకోండి.
7. ఆ మౌల్డ్ కు అడుగుభాగాన నెయ్యిని రాసి కాస్త మైదా పిండిని చల్లండి. ఇలా చేయడం వల్ల కేక్ అడుగుభాగానికి అంటుకుపోకుండా ఉంటుంది.
8. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కేకు మిశ్రమాన్ని ఈ లవ్ సింబల్ ఆకారంలో ఉన్న మౌల్డ్ లో వేయండి.
9. ఓవెన్ ఉన్నవారు ముందుగానే 180 డిగ్రీల సెంటీగ్రేడ్ కు ప్రీ హీట్ చేయండి.
10. ఈ మౌల్డ్ ను లోపల పెట్టి అరగంట పాటు వదిలేయండి.
11. కేక్ తయారయ్యిందో లేదో తెలుసుకోవడం కోసం మధ్యలో ఫోర్కును లేదా టూత్ పిక్ ను గుచ్చి చూడండి.
12. వాటికి ఏమీ అంటుకోకుండా బయటికి వస్తే కేక్ రెడీ అయినట్టే.
ఓవెన్ లేనివారు ప్రెషర్ కుక్కర్లో కేక ను రెడీ చేయొచ్చు. ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టండి. లోపల ఒక స్టాండు పెట్టి ప్రీ హీట్ చేయండి. కేకు మిశ్రమాన్ని ఈ లవ్ సింబల్ ఆకారంలో ఉన్న మౌల్డ్ ను పెట్టండి. తిరిగి కుక్కర్ మూత పెట్టేయండి. అరగంట పాటు ఉడికిస్తే చాలు కేకు రెడీ అయిపోతుంది.
చాక్లెట్ మిశ్రమాలు సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. హాట్ చాక్లెట్ లేదా చాక్లెట్ సిరప్ లాంటివి తెచ్చి ఈ కేకు పైన అందంగా వేయండి. మీకు నచ్చిన ఫ్రూట్స్‌తో అలంకరించండి. లేదా రంగు రంగుల జెమ్స్‌తో అలంకరించండి. అలంకరణ అనేది పూర్తిగా మీ ఇష్టం. ఇప్పుడు ఆ కేక్ ను కట్ చేసి మీ ప్రేమను సెలబ్రేట్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాము. కాబట్టి మెత్తగా వస్తుంది. ఆల్రెడీ చాక్లెట్ పొడి కూడా వేసాం కాబట్టి చాలా తీపిగా ఉంటుంది. మీ ప్రేమను మరింత మధురంగా మార్చేందుకు ఈ చాక్లెట్ ఉపయోగపడుతుంది.