Bellam Sunnundalu: బెల్లం సున్నుండలు ఇలా చేశారంటే ఎంతో బలం, రోజుకు ఒక సున్నుండ తింటే చాలు-bellam sunnundalu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellam Sunnundalu: బెల్లం సున్నుండలు ఇలా చేశారంటే ఎంతో బలం, రోజుకు ఒక సున్నుండ తింటే చాలు

Bellam Sunnundalu: బెల్లం సున్నుండలు ఇలా చేశారంటే ఎంతో బలం, రోజుకు ఒక సున్నుండ తింటే చాలు

Haritha Chappa HT Telugu
Jun 09, 2024 03:30 PM IST

Bellam Sunnundalu: సున్నుండలు మనకు తెలిసినవే కానీ, ఎక్కువగా వీటిని పంచదార పొడితోనే చేస్తారు. బెల్లంతో చేస్తేనే ఎంతో బలం. పిల్లలకు రోజు సున్నుండ తినిపిస్తే చాలు వారికెంతో ఆరోగ్యం కూడా.

బెల్లం సున్నుండలు రెసిపీ
బెల్లం సున్నుండలు రెసిపీ (Amazon)

Bellam Sunnundalu: తెలుగిళ్లల్లో సున్నుండలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాటిని ఎప్పుడూ పంచదారతోనే చేస్తూ ఉంటారు. నిజానికి పంచదారతో చేసిన సున్నుండలు తినడం అంత ఆరోగ్యకరం కాదు. బెల్లం సున్నుండలు పిల్లలకు, పెద్దలకు మేలు చేస్తాయి. బెల్లంతో చేసిన సున్నుండ రోజుకు ఒకటి తినండి చాలు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని చేయడం చాలా తేలిక. ఒకసారి చేసుకుంటే నెలరోజులు పాటు నిల్వ ఉంటాయి. రోజుకి ఒక సున్నుండ తినడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది. బెల్లంతో సున్నుండల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

బెల్లం సున్నుండల రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మినప్పప్పు - ఒక కప్పు

బెల్లం తురుము - ఒక కప్పు

నెయ్యి - అరకప్పు

యాలకుల పొడి - అర స్పూను

బెల్లం సున్నుండలు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి మినప్పప్పును చిన్న మంటపై వేయించుకోవాలి.

2. అవి కమ్మని వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

3. బెల్లాన్ని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు చల్లారిన మినప్పప్పును మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

5. అది పొడి అయ్యాక అందులోనే బెల్లం తురుమును కూడా వేసి 30 సెకన్ల పాటు గ్రైండ్ చేసుకోవాలి.

6. ఈ రెండూ బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

7. అందులోనే యాలకుల పొడిని చల్లుకొని బాగా కలుపుకోవాలి.

8. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఇందులో పోసుకొని చేత్తోనే బాగా కలపాలి.

9. ఉండలు కట్టడానికి వీలైనంత వరకు నెయ్యిని పోసుకోవాలి.

10. ఆ తర్వాత ఈ మిశ్రమాన్నిలడ్డూల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

11. గాలి చొరబడని డబ్బాల్లో ఈ బెల్లం సున్నుండలను వేసుకుంటే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి.

12. ముఖ్యంగా తడి తగలకుండా చూసుకోవాలి. తడి తగిలితే ఇవి బూజు పట్టే అవకాశం ఎక్కువ.

13. పంచదారతో చేసిన సున్నుండల వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు చాలా తక్కువ.

14. అదే బెల్లంతో చేసినవి తింటే ఎంతో మేలు జరుగుతుంది.

మినప్పప్పు శరీరానికి బలాన్ని ఇస్తుంది. బెల్లం ఐరన్ అందిస్తుంది. నెయ్యిలో కూడా ఆరోగ్య పోషకాలు నిండి ఉంటాయి. కాబట్టి వీటితో చేసిన ఈ స్వీట్ ని తినడం వల్ల పిల్లలు, పెద్దలు బలంగా మారుతారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ బెల్లం సున్నుండలను తినాల్సిన అవసరం ఉంది. వారిలోనే ఎక్కువగా రక్తహీనత సమస్య బయటపడుతూ ఉంటుంది. ఉదయం వేళ లేదా సాయంత్రం వేళ ఒక సున్నుండ తినేందుకు ప్రయత్నించండి. నెల రోజుల్లోనే మీరు మంచి మార్పును చూస్తారు. ముఖ్యంగా నీరసం, అలసట వంటివి మీ దరికి రావు. చురుగ్గా, ఉత్సాహంగా పనిచేస్తారు. పిల్లలు కూడా ఏకాగ్రతగా చదువుకుంటారు.

టాపిక్