Omelette Curry: ఎగ్ ఆమ్లెట్ వేసి ఇగురులా వండండి, ఈ రెసిపీ అదిరిపోతుంది
Omelette Curry: కోడిగుడ్డుతో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా వండుకునే కన్నా కోడిగుడ్డుతో కొత్తగా కర్రీ వండి చూడండి. ఇక్కడ మేము ఆమ్లెట్ కూర రెసిపీ ఇచ్చాము. దీని రుచి అదిరిపోతుంది.
Omelette Curry: కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం. దీనితో చేసిన వంటకాలు ఏవైనా రుచిగానే ఉంటాయి. ఎగ్ బిర్యానీ, ఎగ్ కర్రీ,ఎగ్ బుర్జీ... ఎప్పుడూ కోడిగుడ్డుతో ఇలాంటి వంటకాలే చేయకుండా ఓసారి కొత్తగా ఆమ్లెట్ కర్రీ వండి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఆమ్లెట్ వేసుకుని తరువాత దాన్ని కూరగా వండుకోవాలి. దీన్ని పులుసులా చేసుకోవచ్చు లేదా ఇగురులా వండుకోవచ్చు. దీన్ని చేయడం చాలా ఇష్టం.
ఆమ్లెట్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉల్లిపాయ - రెండు
పచ్చిమిర్చి - రెండు
వంటసోడా - చిటికెడు
నూనె - రెండు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
టోమాటో - రెండు
నీళ్లు - సరిపడినన్ని
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఆమ్లెట్ కర్రీ రెసిపీ
1. ఆమ్లెట్ కర్రీ వండడానికి ముందుగా ఆమ్లెట్లను వేసుకోవాలి.
2. ఒక గిన్నెలో కోడిగుడ్లును కొట్టి వేయాలి. అందులో అర స్పూను కారం, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, రెండు స్పూన్ల ఉల్లిపాయ తరుగు, వంటసోడా వేసి బాగా కలపాలి.
3. స్టవ్ మీద పెనం పెట్టి ఆమెట్లుగా వేసుకోవాలి. ఆ ఆమ్లెట్లను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేయాలి.
5. ఆ నూనెలో జీలకర్ర, కరివేపాకులు వేసి వేయించాలి.
6. ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి. టొమాటో తరుగు వేసి వేయించాలి.
7. ఈ మిశ్రమం మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
8. అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని ఇగురులాగా ఉడికించుకోవాలి.
10. ఆ మిశ్రమంలో ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను వేసి కలుపుకోవాలి.
11. అందులో పావు గ్లాసు నీరు వేసి ఉడికించుకోవాలి. పైన కొత్తిమీర తరుగు చల్లుకుని ఇగురులాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే ప్రొటీన్ మన శరీరానికి చాలా అవసరం. గుడ్డులో మనం ఆరోగ్యంగా ఎదిగేందుకు కావాల్సిన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండర నిర్మాణానికి అవసరం పడతాయి.