Chukkakura Dry fish Curry: చుక్కకూర ఎండు చేపల ఇగురు ఇలా చేసి చూడండి, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది-chukkakura dry fish curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chukkakura Dry Fish Curry: చుక్కకూర ఎండు చేపల ఇగురు ఇలా చేసి చూడండి, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది

Chukkakura Dry fish Curry: చుక్కకూర ఎండు చేపల ఇగురు ఇలా చేసి చూడండి, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 27, 2024 11:43 AM IST

Chukkakura Dry fish Curry: చుక్కకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఎండు చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఇగురును వండి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.

చుక్కకూర ఎండు చేపలు ఇగురు
చుక్కకూర ఎండు చేపలు ఇగురు (Youtube)

Chukkakura Dry fish Curry: ఒకప్పుడు ఎండు చేపలను తినే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో కొన్నిచోట్ల మాత్రమే ఎండు చేపలను తింటున్నారు. నిజానికి ఎండు చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వండే టేస్టీ వంటకం చుక్కకూర ఎండు చేపల ఇగురు. వేడివేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఎండు చేపలు చాలా రకాలు ఉంటాయి. ఇందులో నెత్తల్లు, ఎండు రొయ్యలు ఇలా అనేక రకాల చేపలను ఎండలో బాగా ఎండబెట్టి ఎండు చేపలుగా మారుస్తారు. మీకు నచ్చిన వాటిని తీసుకొని చుక్కకూరకు జతగా వండుకోవచ్చు. చుక్కకూర ఎండు రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువగా చుక్కకూరలో ఎండు నెత్తల్లు వేసి వండుతారు. ఇక్కడ మేము చుక్కకూర ఎండునెత్తల్లా ఇగురు ఎలా చేయాలో చెప్పాము.

చుక్కకూర ఎండు చేపల ఇగురు రెసిపీకి కావలసిన పదార్థాలు

చుక్క కూర - నాలుగు కట్టలు

ఎండు నెత్తల్లు - 20

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

టమోటోలు - రెండు

కారం - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

గరం మసాలా - పావు స్పూను

ధనియాల పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అరస్పూను

చుక్కకూర ఎండు చేపల ఇగురు రెసిపీ

1. చుక్కకూరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఎండు చేపలను ముందుగానే ఒక గంట పాటు నీళ్లలో నానబెట్టాలి. దీనివల్ల అవి మెత్తగా అవుతాయి. త్వరగా కూరలో ఉడుకుతాయి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

4. అందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి.

5. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.

6. ఆ మిశ్రమంలో పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి.

7. టమాటోలను సన్నగా తరిగి వేసి ఇగురులాగా అయ్యేవరకు ఉంచాలి.

8. తరువాత ముందుగానే నీళ్లలో నానబెట్టుకున్న నెత్తళ్లను శుభ్రంగా కడిగి అందులో వేసి ఉడికించాలి.

9. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.

10. మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.

11. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న చుక్కకూరను అందులో వేసి బాగా కలుపుకొని... మూత పెట్టి చిన్న మంట మీద ఒక 20 నిమిషాలు పాటు ఉంచాలి.

12. దీనివల్ల ఇగురు టేస్టీగా మెత్తగా అవుతుంది.

13. కాస్త నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ కట్టేయాలి.

14. ఓసారి కలుపుకొని సర్వ్ చేయాలి. అంతే చుక్కకూర ఎండు చేపల ఇగురు రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది.

చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చుక్కకూరను తింటే మంచిది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఎలాంటి పూడికలు ఏర్పడకుండా చుక్కకూరలోని పోషకాలు కాపాడతాయి. రక్తనాళాలు వ్యాకోచిన చెందేలా చేస్తాయి అలాగే మహిళలు ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూరల్లో చుక్కకూర ఒకటి. ఇది అధికంగా తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అలాగే చంటి బిడ్డల తల్లులు చుక్కకూర తినడం వల్ల వారికి పాలు బాగా పడతాయి.

ఇక ఇందులో వాడిన ఎండు చేపల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎండు చేపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థకు కండరాలకు చాలా అవసరం. ముఖ్యంగా ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎండు చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు ఎండు చేపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎండు చేపల్లో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలు దృఢంగా మారేలా చేస్తుంది.

Whats_app_banner