Green Chapathi: చుక్కకూర చపాతి ఇలా చేశారంటే చికెన్ కర్రీతో అదిరిపోతుంది, రెసిపీ వెరీ సింపుల్
Green Chapathi: చపాతి ఎప్పుడూ ఒకేలా చేసుకునే కన్నా కాస్త పుల్లపుల్లగా వచ్చేలా చేయండి. చుక్కకూరను కలిపి చేస్తే చపాతీ పుల్లగా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
Green Chapathi: గ్రీన్ చపాతి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చపాతి ఆకుపచ్చ రంగులో రావాలంటే దానిలో ఆకుకూరలు కలపాలి. కొంతమంది పాలకూరను కలుపుతారు. మరి కొంతమంది చుక్కకూరను కలుపుతారు. చుక్కకూర కలపడం వల్ల చపాతీకి కాస్త పుల్లని రుచి వస్తుంది. తినాలన్న కోరిక ఎక్కువవుతుంది. ముఖ్యంగా చుక్కకూర చపాతీతో చికెన్ కర్రీని తింటే ఆ టేస్టే వీరు. పైగా చుక్క కూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో చేరుతాయి. చుక్కకూర చపాతి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
చుక్కకూర చపాతి రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
చుక్క కూర - రెండు కట్టలు
ధనియాల పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నూనె - కాల్చడానికి సరిపడా
కారం - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
చుక్కకూర చపాతి రెసిపీ
1. చుక్కకూరను సన్నగా కట్ చేసి నీళ్లలో వేసి ఉంచాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. నూనె వేడెక్కాక శుభ్రంగా కడుక్కున్న చుక్కకూరను తీసి వేయించాలి.
4. ఆ చుక్కకూరలోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలపాలి.
5. చుక్కకూరంతా ఇగురులాగా దగ్గరగా అయిపోతుంది.
6. నీరంతా ఇంకిపోయాక స్టవ్ కట్టేయాలి.
7. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో చపాతీ పిండిని కలిపేందుకు గోధుమ పిండిని వేయాలి.
8. ఆ గోధుమ పిండిలోనే చుక్కకూర మిశ్రమాన్ని వేసి ముందుగా చేత్తోనే బాగా కలుపుకోవాలి.
9. చుక్కకూర, గోధుమపిండి బాగా కలిసిపోయాక అప్పుడు నీటిని వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి.
10. దీన్ని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి.
11. ఇప్పుడు చపాతీని చిన్న ఉండలుగా తీసి ఒత్తుకొని పెనంపై కాల్చుకోవాలి.
12. అంతే రెండు వైపులా బాగా కాల్చాక చుక్కకూర చపాతీ రెడీ అయినట్టే.
13. దీన్ని కోడిగుడ్డు కూరతో తిన్నా, చికెన్ కర్రీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.
14. చపాతితో ఏ కర్రీ లేకపోయినా కూడా ఇది పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి, దీని రుచి మీకే నచ్చుతుంది.
కూర తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో చుక్కకూర ముందుంటుంది. కామెర్ల వ్యాధిని అడ్డుకునే శక్తి చుక్కకూరకు ఉంది. కంటి ఆరోగ్యం కోసం చుక్కకూరను వారానికి ఒకసారైనా తినాలి. ఇది రేచీకటి సమస్య రాకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికే రేచీకటితో బాధపడుతున్న వారు చుక్కకూరను మెనూలో చేర్చుకుంటే మంచిది. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడుతున్న పిల్లలు, మహిళలకు ఈ ఆకుకూరను తరచూ తినిపించడం వల్ల ఉపయోగం ఉంటుంది. వారు త్వరగా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.
చుక్కకూరను చపాతీల్లోనే కాదు, పప్పులో కూడా వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. కాకపోతే పిల్లలు చుక్కకూర వంటకాన్ని ఇష్టపడకపోవచ్చు. అందుకే వారికి చుక్కకూర చపాతీలను తినిపించడం సులువు అవుతుంది. పిల్లల చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఇది ముందుంటుంది.