Otti thunakala curry: ఎండు చేపల్లాగే ఎండు మాంసాన్ని టేస్టీ కూరగా వండుకోవచ్చు, అదే ఒట్టి తునకల కూర, రెసిపీ ఇదిగో-otti thunakala curry recipe in telugu know how to make this rayalaseema curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Otti Thunakala Curry: ఎండు చేపల్లాగే ఎండు మాంసాన్ని టేస్టీ కూరగా వండుకోవచ్చు, అదే ఒట్టి తునకల కూర, రెసిపీ ఇదిగో

Otti thunakala curry: ఎండు చేపల్లాగే ఎండు మాంసాన్ని టేస్టీ కూరగా వండుకోవచ్చు, అదే ఒట్టి తునకల కూర, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Published Feb 21, 2024 05:30 PM IST

Otti thunakala curry: ఎండు చేపలు కూర గురించి అందరికీ తెలుసు. అలాగే మాంసాన్ని కూడా ఎండబెట్టి రాయలసీమలో ఒట్టి తునకల కూర చేస్తారు. దాని రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

ఒట్టి తునకల కూర రెసిపీ
ఒట్టి తునకల కూర రెసిపీ (Youtube)

Otti thunakala curry: రాయలసీమలో స్పెషల్ కర్రీ ఒట్టి తునకల కూర. ఒట్టి తునకలు అంటే చికెన్ లేదా మటన్‌తో చేసే ఒరుగులు. ఈ ఒరుగులను ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఏడాదంతా వినియోగించుకోవచ్చు. ఎండు చేపల్లాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటితో కూర వండుకోవచ్చు. ఈ ఒట్టి తునకల కూరను చేసుకోవడానికి ముందుగా చికెన్ లేదా మటన్‌తో ఒరుగులను చేసుకోవాలి. చికెన్‌ను, మటన్‌ను చిన్న ముక్కలుగా కొట్టి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. కారం, పసుపు కూడా వేసి కలుపుకోవాలి. వాటిని ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి. మూడు రోజులు ఎండబెడితే అవి బాగా ఎండిపోతాయి. ఎండు చేపల్లా తేమ ఏమాత్రం లేకుండా ఎండిపోయాక, వాటిని ఒక డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవచ్చు. వీటితో ఒట్టి తునకల కూర ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

ఒట్టి తునకల కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

ఒట్టి తునకలు - ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - నాలుగు

గరం మసాలా - ఒక స్పూను

టమోటో - ఒకటి

లవంగాలు - మూడు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఉప్పు - రుచికి సరిపడా

ధనియాల పొడి - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

ఒట్టి తునకల కూర రెసిపీ

1. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు వేయాలి.

2. నీళ్లు బాగా వేడెక్కాక ఒట్టి తునకలను వేసి నానబెట్టాలి.

3. స్టవ్ కట్టేసి కాసేపు అలా వదిలేయాలి. ఆ వేడి నీటిలో ఒట్టి తునకలు మెత్తగా అవుతాయి.

4. ఇప్పుడు వాటిని చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.

5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి.

7. సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును వేసి వేయించాలి. నిలువుగా కోసిన పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలుపుకోవాలి.

8. ఉల్లిపాయల రంగు మారేవరకు వేయించాలి. తర్వాత టమోటా తరుగును వేసి ఉప్పు వేసి బాగా కలపాలి.

9. పైన మూత పెడితే టమోటా త్వరగా మెత్తగా ఇగురులా అవుతుంది.

10. టమోటో ఇలా ఇగురులా అయ్యాక పసుపు , కారం వేసి బాగా కలుపుకోవాలి.

11. అందులోనే ధనియాలపొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలపాలి.

12. ఆ మిశ్రమంలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఒట్టి తునకలను వేసి కలపాలి.

13. చిన్న మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మూత పెట్టి ఉడికించాలి.

14. తర్వాత మూత తీసి గ్లాసుడు నీళ్లు పోసి మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి.

15. ఒక 20 నిమిషాలు అలా ఉడికితే ఒట్టి తునుకుల కూర రెడీ అయిపోతుంది.

16. స్టవ్ కట్టే ముందు కొత్తిమీరను చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే రాయలసీమలో చేసే టేస్టీ ఒట్టి తునకల కూర రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే ఇష్టంగా చేసుకొని తింటారు.

ఒట్టి తునకల కూర తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండు చేపలు ఎలా ఆరోగ్యాన్ని, పోషకాలను అందిస్తాయో... ఇలా ఎండిన చికెన్, మటన్ కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి. ఆకలిని పెంచి ఆహారం తినేలా చేస్తాయి. కండరాలకు శక్తిని అందిస్తాయి. కండరాలు సన్నబడకుండా, పుష్టిగా ఉండేలా చూస్తాయి. ఎముకలు బలంగా మారేలా చూస్తాయి. గుండె ఆరోగ్యానికి ఒట్టి తునకల కూర మేలే చేస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

ఒట్టి తునకల కూరగా చికెన్‌ను చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. మటన్ ఒరుగుల కన్నా చికెన్ ఒరుగులే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. మటన్ ఒరుగులను అధికంగా వండితే చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి చికెన్ ఒరుగులతోనే ఒట్టి తునకల కూర చేసుకునేందుకు ప్రయత్నించండి.

Whats_app_banner