Oats bisi bele bath: డయాబెటిస్ పేషంట్ల కోసం ఓట్స్‌తో బిసి బేలే బాత్ రుచి అదిరిపోతుంది-oats bisi bele bath recipe in telugu know how to make this diabetic recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Bisi Bele Bath: డయాబెటిస్ పేషంట్ల కోసం ఓట్స్‌తో బిసి బేలే బాత్ రుచి అదిరిపోతుంది

Oats bisi bele bath: డయాబెటిస్ పేషంట్ల కోసం ఓట్స్‌తో బిసి బేలే బాత్ రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Jul 03, 2024 06:35 PM IST

Oats bisi bele bath: డయాబెటిస్ పేషంట్ల కోసం ఇక్కడ మేము స్పెషల్ రెసిపీ ఇచ్చాము. ఓట్స్ తో చేసే బిసి బేలే బాత్ రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.

ఓట్స్ బిసి బెలే బాత్
ఓట్స్ బిసి బెలే బాత్

Oats bisi bele bath: డయాబెటిస్ పేషెంట్లు స్పెషల్ రెసిపీలను తినాల్సి వస్తుంది. వారు తినే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. ఇక్కడ మేము ఓట్స్ బిసి బేలే బాత్ రెసిపీ ఇచ్చాము. ఇది తినడం వల్ల వారికి అన్ని పోషకాలు అందడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీని చేయడం చాలా సులువు. ఒకసారి దీని రెసిపీ ఎలాగో చూడండి.

ఓట్స్ బిసి బేలే బాత్ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఓట్స్ - ఒక కప్పు

క్యారెట్ - ఒకటి

కంది పప్పు - పావు కప్పు

బీన్స్ - ఆరు

బంగాళదుంప - ఒకటి

బఠానీలు - గుప్పెడు

టమాటా - ఒకటి

ఉల్లిపాయ - ఒకటి

చింతపండు - ఉసిరికాయ సైజులో

పసుపు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - సరిపడినంత

బెల్లం తురుము - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఆవాలు - అర స్పూను

శనగపప్పు - అర స్పూను

మినపప్పు - అర స్పూను

ధనియాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

ఎండుమిర్చి - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

యాలకులు - ఒకటి

లవంగాలు - ఒకటి

మరాఠీ మొగ్గ - ఒకటి

ఎండు కొబ్బరి తురుము - ఒక స్పూను

బియ్యం - ఒక స్పూను

ఇంగువ - పావు స్పూను

ఓట్స్ బిసి బేలే బాత్ రెసిపి

1. కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

2. టమోటో, ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్, బీన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో సెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఎండు కొబ్బరి తురుము, బియ్యం, పావు స్పూన్ పసుపు, ఆవాలు, చిటికెడు మెంతులు, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి ఓట్స్ వేసి రెండు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద గిన్నెను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.

6. ఆ నూనెలో ఆవాలు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

7. తర్వాత ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి.

8. అందులోనే పసుపు పొడి కూడా వేయాలి. తరిగిన టమోటోను కూడా వేసి వేయించుకోవాలి.

9. అలాగే తురిమిన క్యారెట్, బంగాళదుంప, టమోటో, బీన్స్ ,బఠానీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి.

10. అవి మెత్తగా ఉడికే వరకు చిన్న మంట మీద ఉంచాలి. తురిమిన బెల్లాన్ని వేయాలి.

11. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును వేసి కలుపుకోవాలి.

12. చింతపండును ఒక కప్పు నీళ్లలో ముందుగానే నానబెట్టుకోవాలి.

13. ఆ చింతపండు నీటిని వేసి కలుపుకోవాలి. అందులో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

14. రుచికి సరిపడా ఉప్పును వేయాలి. నీరు సలసలా మరుగుతున్నప్పుడు ఓట్స్ ను వేసి కలుపుకోవాలి.

15. మంట చిన్నగా పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే ఓట్స్ బిసి బేలే బాత్ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లకు ఇది ఉత్తమ ఆహారమని చెప్పుకోవచ్చు.

ఓట్స్ తో చేసిన ఆహారం ఏదైనా ఆరోగ్యానికి మేలే చేస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు ఇలా ఓట్స్ బిసి బేలే బాత్ తినడం వల్ల టేస్టీగా ఉంటుంది. ఇది కాస్త స్పైసీగా చేసుకుంటే అదిరిపోతుంది. వారానికి ఒకటి రెండు సార్లు ఓట్స్ బిసి బేలే బాత్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఎంతో శక్తిని అందిస్తుంది. ఎన్నో పోషకాలను శరీరంలో చేరుస్తుంది. బిసి బేలే బాత్ మసాలా పొడిని ముందుగానే చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు సులువుగా దీనిని వండేసుకోవచ్చు.

Whats_app_banner